ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి: కవిత

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి: కవిత

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో 19 ఏళ్ల క్రితం ఎన్జీవోగా పుట్టిన 'తెలంగాణ జాగృతి' సంస్థ ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీగా మారొచ్చని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీన రసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ జాగృతి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గా ఉన్నా ప్రజల సమస్యలపై గళ మెత్తిందన్నారు. ఇకపైనా అదే వైఖరిని కంటిన్యూ చేస్తామని అన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో ప్రజల తరపున మాట్లాడామని, ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో తెలంగాణ జాగృతి తన గళాన్ని వినిపించిందని అన్నారు. ప్రజల తరఫున పోరాడాలంటే రాజకీయ పార్టే కానవసరం లేదన్న ఆమె.. కానీ ప్రజలు కోరుకుంటే మాత్రం తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారవచ్చని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయన్నారు. తెలంగాణ జాగృతి కూడా రాజకీయపార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాద న్నారు. కానీ సమయం, సందర్భంగా వచ్చిన ప్పుడు జాగృతి సంస్థ కూడా రాజకీయ పార్టీగా ఆవిర్భవించవచ్చని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల వల్ల ప్రజలకు మంచి జరగాలనేది తమ సంకల్పమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే ఈ నెల 25న నిజామాబాద్ లో 'తెలంగాణ జాగృతి జనం బాట' యాత్రను ప్రారంభించి నాలుగు నెలల పాటు నిర్విరామంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. అందరి సలహాలు, సూచనలతో యాత్రను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.