V6 News

కేటీఆర్ అండతోనే కబ్జాలు.. మాధవరం కృష్ణారావూ.. నీ వెనకున్న గుంటనక్కను వదల: కవిత

కేటీఆర్ అండతోనే కబ్జాలు.. మాధవరం కృష్ణారావూ.. నీ వెనకున్న గుంటనక్కను వదల: కవిత
  • నేను ఇప్పుడు టాస్​ మాత్రమే వేసిన.. ముందుంది టెస్ట్​ మ్యాచ్.. జాగ్రత్త
  • హిల్ట్ పాలసీకి బీజం వేసిందే కేటీఆర్​
  • సిగ్గుండాలె.. ఇంటి అల్లుడి ఫోన్​ ట్యాప్​ చేసుడేంది?
  • పార్టీల కెంచి ఎల్లగొట్టిన్రు కదరా బై.. కండ్లు సల్లవడ్తలేవా?
  • నాపై మొరిగితే కాళ్లు ఇరగ్గొడ్త.. అందరి చిట్టా విప్పుతా
  • నన్ను నిజామాబాద్​కే పరిమితం చేశారు.. అదీ ఐదేండ్లే
  • మీరు కేసీఆర్​ నీడన చేరి.. పందికొక్కుల్లా తిన్నరు
  • ఏదో ఒకరోజు నేను సీఎం అయిత.. మీ అక్రమాలపై విచారణ జరిపిస్తానని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో కేసీఆర్​ నీడన చేరి బీఆర్ఎస్‌ నేతలు ప్రభుత్వ, అసైన్డ్​ భూములను పంది కొక్కుల్లా దోచుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. నాడు  హిల్ట్ పాలసీకి బీజం వేసిందే బీఆర్ఎస్, కేటీఆర్​ అని అన్నారు. నాడు భూముల దోపిడీకి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కిటికీలు తెరిస్తే.. నేడు రేవంత్‌‌‌‌రెడ్డి సర్కారు ఏకంగా దర్వాజలే తెరిచిందని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో కవిత మాట్లాడారు.

బీఆర్ఎస్​ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌‌‌‌రావుపై నిప్పులు చెరిగారు. ‘‘నాకూ టైమ్ వస్తది.. దేవుడు దయతలిస్తే ఏదో ఒక రోజు నేనూ ఈ రాష్ట్రానికి సీఎం అయిత.. 2014 నుంచి ఇప్పటివరకు ఎవరెవరు ఏమేం వెనకేసుకున్నారో ఆ లెక్కలన్నీ బయటికి తీస్తా.. ఒక్కరిని కూడా వదిలిపెట్టను’’ అని  సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఇప్పుడు కేవలం టాస్ మాత్రమే వేశానని, వన్డే మ్యాచ్ ఆడుతున్నానని, ముందు ముందు టెస్ట్ మ్యాచ్ ఉంటుందని కవిత హెచ్చరించారు. తనపై రాజకీయ కుట్రలు చేస్తే భరించానని, కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదని, తన భర్తపై ఆరోపణలు చేస్తే తోలు తీస్తానని తీవ్రస్థాయిలో వార్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. -- ఎక్కువ తక్కువ మొరిగితే కాళ్లు ఇరగ్గొడ్తానని హెచ్చరించారు. తాను పిరికిపందను కాదని, చాకలి ఐలమ్మలెక్క తిరగవడ్తానని,  అందరి చిట్టా విప్పుతానని అన్నారు.

చెరువులు మింగేసి.. విల్లాలు కట్టిన్రు..
కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, బ్యూటిఫికేషన్ పేరుతో చెరువులను ప్రైవేట్ బిల్డర్లకు అప్పజెప్పారని, ఉస్మాన్‌‌‌‌‌‌‌‌కుంటలాంటి చెరువులను ప్రణీత్ ప్రణవ్ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌లాంటి సంస్థలు మింగేసి, వాటిలో విల్లాలు కట్టుకున్నాయని కవిత ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్న రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఈ విల్లాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

‘‘బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఫేవరెట్ అయిన వాసవి బిల్డర్‌‌‌‌‌‌‌‌కు సెయింట్ గోబైన్ భూములు ఎట్ల బదిలీ చేశారు? దీని వెనుక ఓ గుంట నక్క, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉంది. ఆ దందా అంతా నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు పేర్లతో సహా బయటపెడ్త. దీనిపై విజిలెన్స్, ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి’’ అని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె... హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ విఫలమయ్యాయని, కేటీఆర్, రేవంత్‌‌‌‌‌‌‌‌  గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.

ఇంటి అల్లుడి ఫోన్‌ ట్యాప్ చేస్తారా ?
తన భర్త అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జరుగుతున్న అసత్య ప్రచారం హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, బీఆర్ఎస్ పార్టీ రచిస్తున్న పక్కా వ్యూహమని, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో హరీశ్‌‌‌‌‌‌‌‌రావే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని కవిత మండిపడ్డారు. ‘‘నా భర్త 2019లోనే సదరు భూమి నుంచి బయటకు వచ్చారు. 2022లో ఆ భూమికి పర్మిషన్లు, ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్ కన్వర్షన్ నాటి ప్రభుత్వమే ఇచ్చింది. అప్పుడు మంత్రిగా ఉన్నది కేటీఆరే. అక్కడ సంతకం పెట్టింది ఆయనే. 

కేటీఆర్ ప్రధాన అనుచరుడు పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఇందులో సంబంధం లేదా?’’ అని నిలదీశారు. తన భర్త వ్యాపారాలు పారదర్శకంగా ఉంటాయని, ఆయనెప్పుడూ తెరవెనుక ఉండరని చెప్పారు. కానీ బీఆర్ఎస్ హయాంలోనే ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కవిత మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు, ఏలేటి, టీ న్యూస్ చానల్‌‌‌‌‌‌‌‌కు లీగల్ నోటీసులు ఇస్తున్నానని, వారం రోజుల్లో పబ్లిక్‌‌‌‌‌‌‌‌గా క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. ‘‘మాధవరం కృష్ణారావూ.. నీ వెనుకున్న గుంటనక్కను వదల” అని వార్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. 

స్టూడియోల దగ్గర వసూళ్లు చేశారు..
రాజకీయంగా తనను అణచివేసేందుకు సొంత మనుషులే కుట్ర చేశారని, ఎంపీగా గెలిచిన కొత్తలో తనను నిజామాబాద్‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేసి, ఐదేండ్లు ఎక్కడా తిరగనివ్వలేదని కవిత అన్నారు. తాను ఉద్యమం నడిపినప్పుడు సొంత నగలు కుదవపెట్టి బతుకమ్మ పండుగ నిర్వహించానే తప్ప, ఇతరుల మాదిరిగా ఎవరినీ బెదిరించి వసూళ్లకు పాల్పడలేదని పేర్కొన్నారు. 

‘‘బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరి దగ్గర ఎంత దోచుకున్నారో, ఏయే స్టూడియోల దగ్గర ధర్నాలు చేసి.. ఆ తర్వాత రాజీపడి డబ్బులు తీసుకున్నారో ఆ చిట్టా అంతా నాకు తెలుసు. తెలంగాణ పరువు పోతుందనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టినా మీ కక్ష తీరడం లేదా? నా ఫ్యామిలీ జోలికి వస్తే ఆ చిట్టా విప్పుత’’ అని కవిత వార్నింగ్ ఇచ్చారు. జాగృతి జనం బాట ద్వారా ప్రజల్లోకి వెళ్లి గత ప్రభుత్వ అక్రమాలను తెలుసుకుంటున్నాననే భయంతోనే తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె విమర్శించారు.

అంబర్‌ పేట్‌, కాచిగూడ, సికింద్రాబాద్‌లో పర్యటన
ముషీరాబాద్/అంబర్‌ ‌పేట్/పద్మారావు నగర్‌, వెలుగు: తాను ఏ ప్రాంతానికి వెళ్తే  అక్కడి సమస్యలను బట్టి మాట్లాడుతున్నానే తప్ప ఎవర్ని టార్గెట్ చేయడం లేదని  కవిత తెలిపారు. ప్రభుత్వాలు మారితే ప్రజలు ఇబ్బంది పడవద్దు అన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తమిళనాడులో ఇలాంటి పరిస్థితి లేదని, ప్రభుత్వాలు మారినా సరే వాళ్లు ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తారని చెప్పారు.  అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట నియోజకవర్గంలోని చే నెంబర్ చౌరస్తా, మూసారాం బాగ్ బ్రిడ్జి తదితర ప్రాంతాలను కవిత పరిశీలించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా జాగృతి పేరుతో ప్రజల మధ్యనే ఉన్నానని, తనకు ప్రజలు కొత్త కాదని తెలిపారు. తాను చేసిన సేవలు పార్టీ మర్చిపోయిందని, కానీ ప్రజలు మాత్రం మర్చిపోలేదన్నారు. అంతకుముందు కాచిగూడలోని జూనియర్ కాలేజ్, స్కూల్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాకు చేరుకొని, జాగృతి నాయకులను, ప్రజలను ఉద్దేశించి కవిత మాట్లాడారు. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని సీబీఎన్ నగర్ బస్తీలో శిథిలమైన ఇండ్లను కవిత పరిశీలించారు. సికింద్రాబాద్​ నియోజకవర్గంలో పర్యటించారు.  సికింద్రాబాద్ గురుద్వారాను సందర్శించి.. ప్రార్థనలు చేశారు.