- మున్సిపల్ ఎన్నికలపై ఏఐఎఫ్బీ నేతలతో భేటీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో భాగం కాబోతున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే రాజకీయ కార్యక్రమాలను చేపడుతున్న ఆమె.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరఫున అభ్యర్థులను బరిలోకి దింపనున్నారు. అయితే, జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు లేకపోవడంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) తరఫున తమ అభ్యర్థులను పోటీకి నిలపనున్నారు.
ఏఐఎఫ్బీ సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించి బుధవారం ఏఐఎఫ్బీ ఆఫీసులో ఆ పార్టీ చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డితో కవిత సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీతో పాటు భవిష్యత్ కార్యాచరణపైనా వీరు చర్చించారు. కాగా, ఇప్పటికే ఆ పార్టీ గుర్తింపు కోసం ఢిల్లీలో ఎన్నికల సంఘానికి జాగృతి నేతలు దరఖాస్తు చేశారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడతాం: కవిత
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ల నేతలతో బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన అనుమతులు ఉన్నప్పటికీ జిల్లాల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లను అడ్డుకోవటం సరికాదన్నారు. జిల్లాల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లపై హైదరాబాద్ లో జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలన్నారు. ఈ సమస్యపై సంబంధిత పోలీస్, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి జిల్లాల ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించేలా చూస్తామన్నారు.
