
- అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి
- ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన కేడర్ అనుమానిస్తున్నది
- బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై పాజిటివ్, నెగిటివ్ అంశాలు ప్రస్తావన
- అందరినీ కలవాలని, అందరి అభిప్రాయాలు వినాలని లేఖలో సూచన
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడకపోవడంతో.. భవిష్యత్‌లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనన్న ఊహాగానాలు కేడర్‌లో వినిపిస్తున్నాయని కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసినట్లు ఓ లేఖ బయటకు వచ్చింది. ‘‘డాడీ.. మీరు సభలో బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేసి మాట్లాడాల్సి ఉండె. బీఆర్ఎస్ కేడర్‌కే కాదు నాకు కూడా ఇదే అనిపించింది.
బీజేపీ వల్ల నేను పడిన ఇబ్బందులే ఇందుకు కారణం కావొచ్చు. రాష్ట్రంలో బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమోనని మన కేడర్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నది” అని లెటర్లో ఉంది. గత నెల 27న వరంగల్‌లోని బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ జరిగింది. ఈ సభకు సంబంధించి పాజిటివ్, నెగెటివ్ విషయాలను ప్రస్తావిస్తూ ఈ నెల 2న కేసీఆర్‌కు కవిత రాసినట్లు ఓ లేఖ గురువారం బయటకు వచ్చింది.
బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం నిరాశపరిచింది
‘‘సిల్వర్ జూబ్లీ సభలో వక్ఫ్ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై డాడీ (కేసీఆర్).. మీరు మాట్లాడకపోవడం కేడర్‌ను నిరాశకు గురి చేసింది. ఇంత పెద్ద మీటింగ్‌కు పాత ఇన్‌చార్జులకే బాధ్యతలివ్వడంతో.. ఉద్యమకారులకు సరైన సదుపాయాలు కల్పించలేదని కొన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మళ్లీ పాత ఇన్‌చార్జులకే లోకల్ బాడీ ఎలక్షన్లలో బీఫాంలు ఇస్తారన్న ప్రచారం కొన్ని చోట్ల జరుగుతున్నది.
సర్పంచులుగా పోటీ చేయాలనుకునేవాళ్లు కొంత రిలాక్స్డ్గానే ఉన్నా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా పోటీ చేయాలనుకునేవాళ్లు మాత్రం రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచే డైరెక్ట్‌గా బీఫాంలు తీసుకోవాలని కోరుతున్నారు. మీ స్పీచ్ పవర్‌ఫుల్‌గానే ఉన్నా.. ఇంకొంచెం పంచ్ ఉంటే బాగుండేదని కేడర్ భావించారు” అని లేఖలో ఉంది. వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగంతో అందరూ సంతోషించారని, ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడటం చాలా మందికి నచ్చిందని లేఖలో కవిత పేర్కొన్నట్లు ఉంది.
‘‘తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు.. తెలంగాణ గీతం విషయంపై మీరు స్పందిస్తారని భావించారు. వాటి గురించి మీరు మాట్లాడితే బాగుండేది. ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది. మీ స్పీచ్ అయ్యే వరకు కేడర్ ఆసక్తిగా విన్నారు’’ అని ఆ లేఖలో ఉంది.
అందరి అభిప్రాయాలు తీసుకోండి
‘‘కాంగ్రెస్‌పై క్షేత్ర స్థాయిలో నమ్మకం పోయింది. దీంతో బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనని మన కేడర్ అనుకుంటున్నరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్‌ను కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. దీనిపై మీరు కౌంటర్ ఇస్తారని, కార్యక్రమాలు నిర్వహిస్తారని కేడర్ ఎక్స్పెక్ట్ చేసింది. ఇకనైనా ఒకట్రెండు రోజులు ప్లీనరీని నిర్వహించండి.
అందరి అభిప్రాయాలను తీసుకుంటే మంచిది. దీనిపై కొంచెం ఆలోచించండి. ఎమ్మెల్యే స్థాయి నేతలు, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లకు మీ అపాయింట్మెంట్ దొరకడం లేదని బాధపడుతున్నారు. కొందరినే మీరు కలుస్తున్నారని చాలా మంది అంటున్నారు. దయచేసి అందరినీ కలవండి” అని కేసీఆర్‌కు కవిత సూచిస్తున్నట్లుగా లేఖలో ఉంది.