కవిత, కేజ్రీవాల్​ను కలిపి విచారించే చాన్స్​!

కవిత, కేజ్రీవాల్​ను కలిపి విచారించే చాన్స్​!

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్​ స్కామ్​ కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ను కలిపి విచారించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరనున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్​లో సౌత్ గ్రూప్ నుంచి కవిత కింగ్ పిన్​గా వ్యవహరిస్తే.. పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ కీ రోల్ పోషించారని ఈడీ వర్గాలు అంటున్నాయి. అందువల్ల వీరిద్దరిని కలిపి విచారిస్తే.. స్కామ్​కు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నాయి. కాగా, కవిత కస్టడీ శనివారం మధ్యాహ్నంతో ముగియనుంది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆమెను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి రౌస్ ఎవెన్యూలోని స్పెషల్​ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్​లో ఈ నెల 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఢిల్లీలోని ఈడీ హెడ్ ఆఫీస్ కు తరలించారు. 

తర్వాత రోజు రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన కోర్టు.. కవితను ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలతో కస్టడీ గడువు ముగుస్తుంది. కవిత నుంచి మరింత కీలక సమాచారం రాబట్టేందుకు గాను ఆమె కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని కోర్టును ఈడీ కోరనున్నట్లు తెలిసింది.  తాజాగా లిక్కర్ స్కామ్​ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ను కూడా కస్టడీకి అప్పగించినందున ఆయనను, కవితను కలిపి విచారించాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తే వీరిద్దరిని కలిపి విచారించేందుకు అవకాశం ఉంటుంది. 

కేజ్రీవాల్ అరెస్ట్ తో ఈడీ అధికారులు బిజీ

చివరి రోజు శుక్రవారం కస్టడీలో ఈడీ అధికారులు కవితకు ఎలాంటి ప్రశ్నలు వేయనట్లు తెలిసింది. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్  జోగిందర్  బిజీగా ఉన్నారు. శుక్రవారం ఉదయం అంతా కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించిన రిపోర్ట్ తయారీలో ఆయన తలమునకలయ్యారు. మధ్యాహ్నం తర్వాత రౌస్ ఎవెన్యూ స్పెషల్​ కోర్టు లో కేజ్రీవాల్ ను హాజరుపరిచి, వాదనల టైంలో అక్కడే ఉన్నారు. దీంతో కవిత విచారణపై పెద్దగా ఫోకస్ చేయనట్లు తెలిసింది. అయితే.. కోర్టు కవిత కస్టడీని పొడిగిస్తే.. అప్పుడు కేసు సంబంధించిన మరిన్ని అంశాలపై ఆమె స్టేట్​మెంట్ ను రికార్డు చేయనున్నట్లు సమాచారం. 

కవితను కలిసి కొడుకు

ఈడీ కస్టడీలో ఉన్న  కవితను ఆమె చిన్న కొడుకు ఆర్య, బంధువులు అఖిల, వినిత, లాయర్ మోహిత్ రావు కలిసి మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు వీళ్లు ఈడీ హెడ్ ఆఫీసుకు చేరుకున్నారు. ఆర్యను చూసిన కవిత... త్వరగానే ఇంటికి వస్తానని, తన విషయంలో బాధపడొద్దని చెప్పారు. కాగా, కవిత బెయిల్​కోసం శుక్రవారం స్పెషల్​ కోర్టులో ఆమె తరఫు అడ్వకేట్లు పిటిషన్​ను దాఖలు చేసే అవకాశం ఉంది.