నేటి యువతకు కావూరు సాంబశివరావు ఆదర్శం

నేటి యువతకు కావూరు సాంబశివరావు ఆదర్శం
  •     ఇంజినీరింగ్ నుంచి పారిశ్రామిక వేత్తగా..
  •     రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర 

హైదరాబాద్, వెలుగు: జన్మనిచ్చిన తల్లికి, పుట్టిన పల్లెకు వన్నె తెచ్చిన మహనీయుడు కావూరు సాంబశివరావు జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, అక్కల వద్ద పెరిగిన ఆయన పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. సాధారణ గ్రామం నుంచి బయలుదేరి, వరంగల్ రీజనల్ కాలేజీలో తొలి బ్యాచ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 

విద్యార్థి దశలోనే నాయకత్వాన్ని ప్రదర్శించి, విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1966లో భాగస్వామ్య సంస్థను ప్రారంభించి, తర్వాత హైదరాబాద్‌లో ప్రోగ్రెసివ్ ఇంజినీరింగ్ కంపెనీ, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్‌గా విస్తరించారు. దేశీయంగా, విదేశాల్లోనూ నిర్మాణ రంగంలో గుర్తింపు పొందారు. 

1982లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, 1983లో పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు. టీడీపీ హయాంలో మచిలీపట్నం నుంచి మూడు సార్లు, ఏలూరు నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.  పార్లమెంట్‌లో రైతుల తరఫున గళం వినిపించి గుర్తింపు పొందారు.  కావూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం చేశారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలు అందించారు.  హైదరాబాద్​లో మెడ్విన్ ఆసుపత్రి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. మార్చి 11, 2026న ఆయన మృతి చెందారు.