కబ్జాలో కవ్వాల్!.. పలుచబడ్తున్న అడవులు..పత్తాలేని పులులు

కబ్జాలో కవ్వాల్!.. పలుచబడ్తున్న అడవులు..పత్తాలేని పులులు
  • రిజర్వ్ ఫారెస్ట్​లో 1.30 లక్షల ఎకరాల ఆక్రమణ
  • ఇప్పటికే 1.16 లక్షల ఎకరాల్లో చెట్ల నరికివేత.. పోడు పట్టాలు జారీ
  • ఓవైపు గ్రామాల రీలొకేషన్.. మరోవైపు కొత్తగా కబ్జాలు
  • ఆక్రమణలే పులుల ఆవాసానికి అడ్డంకిగా మారాయంటున్న అధికారులు
  • కవ్వాల్​ ఫారెస్ట్​ను కాపాడుకుంటేనే పులులకు మనుగడ 

మంచిర్యాల, వెలుగు:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కబ్జా కోరల్లో చిక్కింది. దీనిని పులుల అభయారణ్యంగా ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సంరక్షణ కోసం ఓవైపు వందల కోట్లు ఖర్చు చేస్తుంటే, మరోవైపు అటవీ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. కొన్నేండ్లుగా గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం అటవీ భూములను యథేచ్ఛగా ఆక్రమించి పోడు వ్యవసాయం పేరుతో అడవుల్లో చెట్లను నరికేస్తున్నారు. దీంతో కవ్వాల్ అభయారణ్యం పలుచబడి, వచ్చిన పులులు వచ్చినట్లే ఇక్కడ ఉండలేక మహారాష్ట్రకు తిరుగుముఖం పడ్తున్నాయి.


కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ ను మొదట్లో నిర్లక్ష్యం చేసిన అటవీఅధికారులు, తీరా అడవులన్నీ పలుచబడ్డాక ఇప్పుడు కబ్జాపాలైన భూములను కైవసం చేసుకునేందుకు పడరానిపాట్లు పడ్తున్నారు. నిజానికి అడ్డగోలు ఆక్రమణలే కవ్వాల్ టైగర్ రిజర్వ్​లో పులుల ఆవాసానికి అడ్డంకిగా మారాయని ఆఫీసర్లు చెప్తున్నారు. పోడు వ్యవసాయం కారణంగా అడవుల్లో అలికిడి పెరగడం వల్ల టైగర్స్ వచ్చినదారిలో వెళ్లిపోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. 

1.30 లక్షల ఎకరాల్లో ఆక్రమణలు.. 

కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎనిమిది ఫారెస్టు డివిజన్లు ఉండగా, అంతటా అటవీ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఫారెస్టు డిపార్ట్​మెంట్ తాజా రిపోర్టు ప్రకారం.. కవ్వాల్​ పరిధిలో మొత్తం 52వేల343.579 హెక్టార్ల (లక్షా30వేల858.947 ఎకరాల)లో ఆక్రమణలు ఉన్నట్టు తేలింది. ఇవికాకుండా ఇప్పటికే  కవ్వాల్​పరిధిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు 46 వేల711.208 హెక్టార్ల (లక్షా16 వేల778.02 ఎకరాల)లో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను గత ప్రభుత్వాలు జారీ చేశాయి. డివిజన్ల వారీగా పరిశీలిస్తే... జన్నారంలో 387.310 హెక్టార్లు, మంచిర్యాల 140.072,  చెన్నూర్ 879.773,  బెల్లంపల్లి 3,535.267,  ఖానాపూర్2,943.262, ఉట్నూర్​లో 6,589.718 హెక్టార్లలో ఆక్రమణలు ఉన్నట్లు అటవీశాఖ గుర్తించింది. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ఆసిఫాబాద్ డివిజన్​లో 20,792.880 హెక్టార్లు, కాగజ్​నగర్ డివిజన్​లో17,075.478 హెక్టార్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఆసిఫాబాద్ రేంజ్లో 5712.436 హెక్టార్లు, గిన్నెధరి 2,221.330, జోడేఘాట్ 5,465.490, కెరమెరి 5,088, రెబ్బెన 2,093.110, తిర్యానిలో 212.514 హెక్టార్లలో అడవులను ఆక్రమించారు. అలాగే బెజ్జూర్ రేంజ్​లో 2,822.430, పెంచికల్​పేట్ 1,445.660, సిర్పూర్(టి) 6,542.970, కర్జెల్లి 4,998.418, కాగజ్​నగర్ రేంజ్​లో 1,266 హెక్టార్లలో ఎన్ క్రోచ్ మెంట్లు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

పులుల ఆవాసానికి ఆటంకాలు

కవ్వాల్ టైగర్ రిజర్వ్​ను ప్రకటించి 13 ఏండ్లు గడిచినా నేటికీ దాని లక్ష్యం నెరవేరలేదు. పొరుగునున్న మహారాష్ర్టలోని తిప్పేశ్వర్, తడోబా టైగర్ జోన్ల నుంచి అడపాదడపా పులులు కవ్వాల్ కోర్ ఏరియాను టచ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోతున్నాయి. కేటీఆర్ బఫర్ ఏరియా పరిధిలోని కాగజ్​నగర్ డివిజన్​లో మాత్రం 2016 నుంచి పెద్దపులుల జాడలు కనిపించడం ఫారెస్టు అధికారులకు ఊరటనిస్తున్నది. కోర్, బఫర్ ఏరియాల పరిధిలోని లక్షల ఎకరాల అటవీ భూముల ఆక్రమణలే పులుల ఆవాసానికి ఆటంకంగా ఉన్నాయని ఫారెస్టు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇక్కడి అడవులను పులుల ఆవాసానికి అనుకూలంగా మార్చేందుకు కోర్ ఏరియా పరిధిలోని జన్నారం, ఖానాపూర్ డివిజన్లలో గల పలు అటవీ గ్రామాలను రీ లొకేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్ డివిజన్​లోని రెండు గ్రామాలను తరలించి అక్కడి ప్రజలకు పునరావాసం కల్పించారు. త్వరలో జన్నారం డివిజన్​లోని మరో రెండు గ్రామాలను అటవీ ప్రాంతం బయటకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎలాగోలా రీ లొకేషన్​కు అడుగులు పడినప్పటికీ.. కొత్తగా మరింత అటవీభూమి ఆక్రమణలకు గురవుతుండడం తలనొప్పిగా మారిందని ఫారెస్టు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆక్రమణదారులను అడ్డుకుంటే తప్ప కవ్వాల్ అడవులను కాపాడలేమని, అడవులను కాపాడలేకపోతే ఇక పులుల సంగతి మర్చిపోవాలని ఆయన వాపోయారు.

2015.44 చదరపు కిలోమీటర్లలో కవ్వాల్​ టైగర్ రిజర్వ్..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్) విస్తరించి ఉంది. ఈ అడవులు పెద్దపులుల ఆవాసానికి అనుకూలంగా ఉన్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్​లో టైగర్ రిజర్వ్​గా ప్రకటించింది. కేటీఆర్ మొత్తం విస్తీర్ణం 2,015.44 చదరపు కిలోమీటర్ల కాగా, ఇందులో 893 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా, 1122.44 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియాగా ప్రభుత్వం తేల్చింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా టైగర్ జోన్లతో లింక్ ఉండడం, అక్కడి పులులు ఇటువైపు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో అవి ఇక్కడే  స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే చాన్స్ ఉంటుందని భావించారు. కానీ టైగర్ రిజర్వ్ గా ప్రకటించడానికి ముందు నుంచే ఈ అడవులు ఆక్రమణలకు గురికావడం పులుల ఆవాసానికి ఆటంకంగా మారిందని చెప్తున్నారు.

కేటీఆర్ పరిధిలో  ఎన్​క్రోచ్​మెంట్ల వివరాలు (హెక్టార్లలో)

ఫారెస్ట్ డివిజన్    ఆర్వోఎఫ్ఆర్    ఎన్​క్రోచ్​మెంట్ల
జన్నారం         769.724    387.310
మంచిర్యాల    166.392    140.072
చెన్నూరు        688.400    879.773
బెల్లంపల్లి    1,113.588    3,535.267
ఆసిఫాబాద్    25,341.283    20,792.880
కాగజ్​నగర్    4,445.012    17,075.478
ఖానాపూర్    5,400.220    2,943.262
ఉట్నూర్    8,786.590    6,589.718
మొత్తం      46,711.208    52,343.579