
- ముందుకు సాగని రైల్వే లైన్ నిర్మాణ పనులు
- నదులపై వంతెనల నిర్మాణాలు, అటవీ భూ సేకరణలో లేట్
- కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి తోడు పట్టించుకోని రైల్వే ఆఫీసర్లు
- త్వరగా -అందుబాటులోకి వస్తే మెరుగవనున్న రైల్వే రవాణా
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు : ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీ కల్పించే కాజీపేట– -బల్లార్షా రైల్వే మూడో లైన్ పదేండ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. కరోనాతో పాటు పలు చోట్ల నదులపై వంతెనల నిర్మాణాలు, కొన్నిచోట్ల భూ వివాదాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు ఆగుతూ.. సాగుతూ ఉన్నాయి. కాజీపేట– -బల్లార్షా రైల్వే రూట్ లో రూ.2063 కోట్లతో 234 కిలోమీటర్ల మేర మూడో లైను పనులు ఐదేండ్లలో పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకోగా.. పదేండ్లైనా ఇప్పటికీ కంప్లీట్ కాలేదు.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి తోడు రైల్వే ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు. దీంతో రెండు లైన్లు నిత్యం రద్దీగా ఉండడంతో గంటల తరబడి ఆలస్యమవుతుంది. తద్వారా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధానంగా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మూడో లైన్ పనుల్లో ఎలాంటి ఫురోగతి లేదు. మొత్తం 234 కిలోమీటర్ల రూట్ లో 34 ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
2010లోనే ప్రతిపాదించిన కేంద్రం
ఢిల్లీ-– -చెన్నై రూట్ లోని గ్రాండ్ట్రంక్లైన్ను వినియోగించుకుని రైల్వేపరంగా మరింత వృద్ధి సాధించాలని కేంద్ర ప్రభుత్వం 2010లో కాజీపేట– -బల్లార్షా రూట్ లో మూడో రైల్వే లైన్ ను ప్రతిపాదించింది. 2016లో మందమర్రి-– రాఘవపురం మధ్య 33 కి.మీ లైన్ పూర్తి చేసింది. 2015–-16లో 202 కి.మీ ట్రిప్లింగ్, ఎలక్ర్టికల్పనులకు రూ.2,063 కోట్లు మంజూరు చేసింది. మూడో రైల్వే లైన్ రూట్ లో పొత్కపల్లి వద్ద మానేరు నది, మంచిర్యాల వద్ద గోదావరి నది, ఆసిఫాబాద్– -కాగజ్నగర్మధ్య పెద్దవాగు, బల్లార్షా సమీపంలో వార్ధా నదిపై రైల్వే వంతెన నిర్మాణాలు చాలా కీలకం గా ఉన్నాయి.
కాగా.. వీటిలో మానేరు, మంచిర్యాల వద్ద గోదావరిపై మాత్రమే వంతెనలు నిర్మించారు. పులుల ఆవాసానికి, వాటి తాగునీటికి ఇబ్బందు లేకుండా చూడడటంతో పాటు అండర్‌పాస్‌లు నిర్మించాలని ఎన్టీసీఏ(నేషనల్టైగర్కన్జర్వేజన్అథారిటీ) ఆదేశించింది. కాగజ్‌నగర్ నుంచి సిర్పూర్(టి) వరకు టైగర్‌జోన్ పరిధిలో పర్మిషన్లలో జాప్యం కారణంగా రెండేండ్లు లేట్ గా పనులు ప్రారంభించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లేట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రూ.600 కోట్ల నిధులతో మూడో రైల్వే లైన్ పనులు చేపట్టారు. ఆసిఫాబాద్‌జిల్లా కాగజ్నగర్సమీపంలోని బీబ్రా పెద్దవాగుపై ఐరన్ బ్రిడ్జి ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి బీబ్రా పెద్దవాగు బ్రిడ్జి వరకు13 కి.మీ భూసేకరణ మాత్రమే పూర్తయింది. బెల్లంపల్లిలోని కల్వరి చర్చి నుంచి మందమర్రి కోల్యార్డ్ వరకు 8 కి.మీ ట్రాక్లైను నిర్మించాలి. రెండు చోట్ల భూములు చదును చేసి ఏండ్లు గడుస్తుండగా.. పనులు పూర్తయ్యే పరిస్థితులు లేవు.
టెక్నికల్ప్రాబ్లమ్, వర్షాల కారణంగా బీబ్రా పెద్దవాగు బ్రిడ్జి పనులు నిలిచిపోయాయని, ఏడాది చివరి నాటికి పూర్తి చేసి రైళ్లు నడిపిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈనెల 7న మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో అభివృద్ధి, మూడో రైల్వేలైన్ నిర్మాణ పనులను దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జనరల్మేనేజర్సందీప్మాథూర్ పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
రెండు లైన్లపై రోజుకు 150 పైగా రైళ్ల ప్రయాణం
రెండో లైన్ పై రైళ్లతో నిత్యం రద్దీగా ఉంటుండగా.. ప్రయాణికులకు గంటల తరబడి జాప్యం అవుతుంది. సింగరేణి నుంచి బొగ్గు రవాణా, మంచిర్యా ల,రామగుండం,ఆసిఫాబాద్నుంచి సిమెంట్, ఇతర ప్రాంతాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువుల ఉత్పత్తులతో పాటు ఉత్తరాది నుంచి ఇతర ఉత్పత్తులు, సరుకులు తీసుకెళ్లే గూడ్స్రైళ్లు రెండు లైన్ల మీదుగా వెళ్లడానికి సిగ్నల్‌కోసం చాలా సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. రెండు లైన్లపైన రోజుకు 60 నుంచి 80 వరకు గూడ్స్ రైళ్లు, అంతే సంఖ్యలో ప్యాసింజర్ రైళ్లు వెళ్తుంటాయి.
గరిష్ట పరిమితికి మించి రైళ్లను నడుపుతున్నట్టు, ట్రాక్ వినియోగం 127 శాతంగా ఉందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మరోవైపు మూడో రైల్వే లైన్ పనులు పూర్తి కాకపోవడంతో వరంగల్ జిల్లా కాజీపేట జంక్షన్‌నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షా వరకు వెళ్లే ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. కొత్త లైన్అందుబాటులోకి వస్తే ఈ సమస్యలు తీరనున్నాయి.