- ట్రాఫిక్, కాలుష్యం తగ్గించేలా ఈఎస్‌జడ్ బయటే పనులు
- పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నరన్న అటవీ శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) నేషనల్ పార్క్ చుట్టూ చేపడుతున్న రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జడ్)ను టచ్ చేయలేదని తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. అన్ని పనులు ఈఎస్‌జడ్ పరిధి బయటే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఈఎస్‌జడ్‌లో చెట్లను నరికివేస్తున్నారంటూ పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. అందువల్ల కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను కొట్టేయాలని కోరింది.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణంతో చెట్లు, పర్యావరణానికి శాశ్వత నష్టం జరుగుతుందని పేర్కొంటూ కాజల్ మహేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. స్టేకు హైకోర్టు నిరాకరించడంతో ఆమె ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా పార్క్ చుట్టూ 25 మీటర్ల నుంచి 35 మీటర్ల బఫర్ జోన్‌లో చెట్లను నరకరాదంటూ మే 18న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
5.82 హెక్టార్లలో ఈఎస్‌జడ్
ప్రతిపాదిత పనులు కేబీఆర్ పార్క్ విధ్వంసానికి దారితీస్తాయన్న ఆరోపణలు తప్పని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అధికారి వినయ్ కుమార్ కౌంటర్‌లో పేర్కొన్నారు. మొత్తం 108 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. నిపుణుల కమిటీ, సంబంధిత శాఖల పరిశీలన తర్వాత పార్క్ చుట్టూ 3 నుంచి 29.80 మీటర్ల వెడల్పుతో ఈఎస్‌జడ్‌ను నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రం 2020 అక్టోబర్ 27న నోటిఫికేషన్ జారీ చేసిందని, 5.82 హెక్టార్లను ఈఎస్‌జడ్‌గా గుర్తించినట్లు వివరించారు.
ట్రాఫిక్, కాలుష్యం తగ్గించడమే లక్ష్యం
తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, వాహనాల రాకపోకలను మెరుగుపరిచేందుకు ఈ పనులు చేపడుతున్నామని అటవీ శాఖ కోర్టుకు తెలిపింది. దీంతో ఇంధన వినియోగం, వాహన ఉద్గారాలు, వాయు కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొంది.
విచారణ వచ్చే నెల 7కు వాయిదా
విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న ఎన్ని చెట్లను తొలగించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించారు. ఇప్పటివరకు ఒక్క చెట్టూ నరకలేదని ఆయన కోర్టుకు తెలిపారు. పనులపై స్టే ఎత్తివేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ దాఖలు చేసిన దరఖాస్తులు, అదనపు పత్రాలను కూడా కోర్టు పరిశీలించింది. అయితే వాటిలో లోపాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తులపై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు సమయం ఇస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది.
