- విరాళాల చోరీ జరుగుతోందని చెప్పిన అధికారిని తొలగించారని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: 2020–-21లోనే లెక్కల్లో చూపని బంగారం, వెండి ఆభరణాల మళ్లింపు జరుగుతోందని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్చరించాడని ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తెలిపారు. అయితే, ఆయన మాటలను పట్టించుకోకుండా ఆ అకౌంట్స్ అధికారిని విధుల నుంచి తొలగించారని వెల్లడించారు. రామ మందిరం విరాళాల కుంభకోణం, లూటీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలని ప్రధాని మోదీకి గురువారం వేణుగోపాల్ లేఖ రాశారు.
విరాళాల లెక్కింపు ప్రక్రియలో నిఘా కన్ను గప్పి భారీ ఎత్తున నగదు, విలువైన ఆభరణాలను దోచుకున్నారని ఆరోపించారు. ఇది చిన్న ఉద్యోగులు చేసిన పని కాదని, ట్రస్ట్‌లోని పెద్దల పర్యవేక్షణలోనే జరిగిన దోపిడీ అని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఏకంగా 7 నుంచి 8 నెలలపాటు అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయడమే ఇందుకు సాక్ష్యమని తెలిపారు. ఈ విరాళాల చోరీపై యూపీ సర్కార్ జూన్ 13న సిట్ వేసి.. జూన్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఒక డ్రామా మాత్రమేనని విమర్శించారు. దోపిడీకి స్కెచ్ వేసిన 'పెద్ద తలకాయలను' కాపాడేందుకు కేవలం డ్రైవర్లు, క్లర్కులు, అవుట్ సోర్సింగ్ క్యాషియర్లు వంటి చిన్న ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
