కాళేశ్వరం పాపాలకు కేసీఆర్​, హరీశ్​రావే బాధ్యులు : సీఎం రేవంత్​రెడ్డి

కాళేశ్వరం పాపాలకు కేసీఆర్​, హరీశ్​రావే బాధ్యులు : సీఎం రేవంత్​రెడ్డి
  • ముంచింది  మామా అల్లుడే 
  • కాళేశ్వరం పాపాలకు కేసీఆర్​, హరీశ్​రావే బాధ్యులు
  • ఇంజనీర్లు, నిపుణులు చెప్పినా వినిపించుకోలే
  • మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్​కు 
  • సొంత సర్కార్​ వేసిన కమిటీ రిపోర్టును కూడా పక్కనపడేసిండు
  • తుమ్మిడిహెట్టిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి ఆగం చేసిండు
  • నదులకే నడక నేర్పిన వ్యక్తి.. మునిగిన మేడిగడ్డ, పగిలిన అన్నారం, కుప్పకూలిన సుందిళ్లపై ఏం సమాధానం చెప్తడు?
  • రూ. 38,500 కోట్ల ప్రాజెక్టు అంచనాలను లక్షా 47వేల కోట్లకు పెంచి దోచుకున్నారని ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు:  దోచుకోవడం, దాచుకోవడానికే గత బీఆర్​ఎస్​ సర్కార్​ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని, జరిగిన తప్పులను ఒప్పుకోకుండా ఆ పార్టీ నేతలు ఇంకా దబాయిస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టొద్దని ఇంజనీర్లు, నిపుణులు చెప్పినా కేసీఆర్, హరీశ్​రావు  వినిపించుకోలేదని, అట్ల మామ​అల్లుడు  చేసిన పాపాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయని ఆయన అన్నారు. చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘‘నదులకే నడక నేర్పిండని, నెమలికే డ్యాన్స్​ నేర్పిండని, అపర భగీరథుడని కేసీఆర్​ గురించి బీఆర్​ఎస్​ వాళ్లు గొప్పగా చెప్పుకుంటుంటరు. కానీ, ఇప్పుడు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారం, కుప్పకూలిన సుందిళ్లపై ఏం సమాధానం చెప్తరు? జరుగబోయే ప్రమాదాన్ని అప్పట్లోనే నిపుణులు, ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్​ వినిపించుకోలేదు. తుమ్మిడిహెట్టిలో కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీని కట్టి ముంచిండు. కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ కూడా హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. ప్రాజెక్టు  వ్యయం అంచనాలను భారీగా పెంచి దోపిడీకి తెగబడ్డడు’’ అని సీఎం మండిపడ్డారు. కాళేశ్వరం దుర్మార్గాలకు కేసీఆర్​, హరీశ్​రావే బాధ్యులని అన్నారు.  శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని కాదని, తెలంగాణ సమాజానికే కళంకం అని అన్నారు. బీఆర్​ఎస్​ నేతలు రాష్ట్రాన్ని పదేండ్లు దివాలా తీయించారని, కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు. 

2018లో హరీశ్​ను ఎందుకు బర్తరఫ్​ చేసిండు

2014 నుంచి 2018 వరకు ఇరిగేషన్​ మంత్రిగా హరీశ్​రావును కేసీఆర్​ కొనసాగించారని, ఆ తర్వాత ఇరిగేషన్​ మంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేశారని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘హరీశ్​రావును నిలదీస్తున్న.. దుర్మార్గాలకు కేసీఆర్​, నువ్వే బాధ్యులు. మిమ్మల్ని 2018వరకూ ఇరిగేషన్ మంత్రిగా కొనసాగించి,  ఆతర్వాత ఎందుకు కేసీఆర్​ బర్తరఫ్​ చేసిండు. తెలంగాణకు చెదలు పట్టించిందే మీ ఇద్దరు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ఇంకా నిస్సిగ్గుగా తప్పులను సమర్థించుకుంటారా?  మొండి వాదనలు.. తొడివాదనలు వద్దు. మీరు చేసిన తప్పులను, వాస్తవాలు చెప్తుంటే మాపైనే దాడి చేసుడేంది?’’ అని నిలదీశారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్ కు అని తెలిపారు. ‘‘మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పిండో తెలియదు కానీ, ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చిండు.. తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టాలని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసినా వినిపించుకోలేదు. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఆ కమిటీ తన రిపోర్టులో తేల్చిచెప్పింది. దీన్ని కేసీఆర్​ తొక్కి పెట్టిండు” అని మండిపడ్డారు. గోదావరి ప్రాజెక్టులపై ఐదుగురు సీనియర్ రిటైర్డ్ ఇంజినీర్లతో 2015లోనే కమిటీ వేశారని, ఆ కమిటీ ఏరియల్ ఫిజికల్ సర్వే చేసి14 పేజీల నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. సొంత సర్కారు వేసిన కమిటీ నివేదికను కూడా కేసీఆర్​ పట్టించుకోలేదన్నారు. 

అప్పుడు మా వాళ్లే పెప్పర్​ స్ప్రేకు ఎదురొడ్డిన్రు

తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రం తీవ్ర అన్యాయం చేసిందని, సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయని, నీళ్ల కోసం కోట్లాడామని సీఎం రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రావాలని, కావాలని కోరుకున్నామని చెప్పారు. ‘‘తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే.. తెచ్చిందీ మావేళ్లే. పొన్నం ప్రభాకర్, రాజ్ గోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, బలరామ్ నాయక్, సిరిసిల్ల రాజయ్య వంటి వారు ఎంపీలుగా ఉండి పార్లమెంట్​లో పెప్పర్ స్ప్రె దాడికి ఎదురొడ్డి.. తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన్రు. పార్లమెంట్ లోని లైవ్ రికార్డులు తీస్తే తెలుస్తుంది. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నరనేది కూడా తెలియాలి” అని అన్నారు.

సబితక్క..! తప్పు చేస్తే చెప్పాలె కదా

కాళేశ్వరం ప్రాజెక్టు దుర్మార్గులకు బాధ్యులైన కేసీఆర్​, హరీశ్​రావును సబితా ఇంద్రారెడ్డి కూడా సమర్థించడం ఏమిటని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. చేవెళ్లలో ప్రాజెక్టు ఆగిపోతే ఆనాడు సబితాఇంద్రారెడ్డి ధర్నా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘చేవెళ్ల, వికారాబాద్​, తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను కేసీఆర్​ దిగమింగిండని, మల్లన్నసాగర్​కే ఆపేసిండని ఆనాడు సబితక్క ధర్నా చేశారు. ఇప్పుడు అక్కకు ఎదురుగనే హరీశ్​రావు కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే.. సబితక్క మాట్లాడకపోవడం ఆశ్చర్యమేస్తున్నది. చేవెళ్ల చెల్లెమ్మగా పేరున్న సబితక్క మౌనంగా.. హరీశ్​రావు సమర్థించడం ఏమిటి? తప్పుచేస్తే చెప్పాలె కదా” అని సీఎం అన్నారు. గడీల స్కూల్ ట్రైనింగ్ అలాంటిదని, కడియం శ్రీహరి కూడా మంచివాళ్లే అయినప్పటికీ ఒత్తిడితో వాళ్లు(కేసీఆర్​) ఏం చెబితే అదే చెప్తున్నారని ఆయన విమర్శించారు. జరిగిన తప్పులకు కేసీఆర్​ తరఫున హరీశ్​రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినప్పుడు ఎవరి ఒత్తిడితో ఇవన్నీ చేశారో స్టేట్ మెంట్ ఇచ్చి ఒప్పుకోవాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. 

రిపోర్టును తొక్కిపెట్టిన్రు

నాడు ఐదుగురు ఇంజనీర్లు కష్టపడి 14 పేజీల రిపోర్టును ఇస్తే.. దాన్ని కేసీఆర్, హరీశ్​రావు తొక్కిపెట్టి, మసిపూసి మారేడుకాయ చేశారని సీఎం రేవంత్​రెడ్డి ఫైర్​ అయ్యారు. ‘‘రూ.38,500 కోట్ల నుంచి 1.47లక్షల కోట్లకు ప్రాజెక్టు అంచనాలను పెంచారు. 2015లోనే ‘మేడిగడ్డ మేడిపండేనా?’ అంటూ కేసీఆర్ మిత్రుడి పత్రికలోనే కథనం వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మునిగిపోయిన మేడిగడ్డ.. పలిగిపోయిన అన్నారం, కుప్పకూలిన సుందిళ్లను చూసి రాసింది కాదు.  గతంలో ఇంజనీర్ల రిపోర్టు ఆధారంగా మీడియా మిత్రులు వాస్తవాలు చెప్పారు. ఇవన్నీ పెడచెవినపెట్టి, దోచుకోవాలె..దాచుకోవాలనే ఆలోచనతో కేసీఆర్​ పనిచేసిండు” అని అన్నారు.