కొండపోచమ్మ సాగర్​ వేడుకపై సోషల్​ మీడియాలో సెటైర్లు

కొండపోచమ్మ సాగర్​ వేడుకపై సోషల్​ మీడియాలో సెటైర్లు
  • మాస్కులేమాయె..డిస్టెన్స్​ ఎటుపాయె?
  • గుంపులు గుంపులుగా ఆ జనమేంది?

హైదరాబాద్/ సిద్దిపేట, వెలుగు: ‘‘చావుకు 20 మంది.. పెండ్లికి 50 మంది.. కొండ పోచమ్మ సాగర్​ ప్రారంభోత్సవానికి మాత్రం 1500 మందినా..?’’ అంటూ రాసిన ఓ పోస్టు శుక్రవారం సోషల్​ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘కొండ పోచమ్మ సాగర్​ ప్రారంభోత్సవం, ఈ సందర్భంగా నిర్వహించిన యాగాల్లో మాస్కులు పెట్టుకోకపోవడమేగాక ఫిజికల్ డిస్టెన్స్​ పాటించని  సీఎం కేసీఆర్, చినజీయర్​స్వామి, మంత్రులు, ఇతర నాయకులు ఫైన్ కడతారా?’’ అంటూ పెట్టిన మరో పోస్టు ఫేస్​బుక్​, వాట్సప్​లో చక్కర్లు కొడుతోంది. ‘‘లాక్​డౌన్​ టైమ్​లో పెట్టిన రూల్స్​ ప్రజలు పాటించేందుకేనా..? ప్రభుత్వ పెద్దలకు పట్టదా?”అంటూ రకరకాల పోస్టులతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

శుక్రవారం కొండపోచమ్మసాగర్​ ఎత్తిపోతల కార్యక్రమానికి సుమారు 1500 మంది రైతులు, టీఆర్​ఎస్​ కార్యకర్తలు హాజరయ్యారు. వీళ్లతోపాటు బందోబస్తు డ్యూటీలోని పోలీసులు, ఇతర అధికారులు, సిబ్బంది, యాగాలు నిర్వహిచేందుకు వచ్చినవాళ్లు మరింత మంది ఉంటారు. మోటార్ల స్విచ్​ ఆన్​, కొండపోచమ్మ ఆలయంలో పూజలు, యాగాలు తదితర కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్​, చినజీయర్​స్వామితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని యూట్యూబ్​లోని న్యూస్​ చానళ్లలో లైవ్​చూసినవాళ్లు.. ఇలా భారీ జన సమీకరణపై సెటైర్లు పోస్టు చేశారు. ‘‘లాక్​ డౌన్​ రూల్స్​ పాటించాలని, గుంపులుగా ఉండొద్దని పదేపదే చెప్పే ప్రభుత్వ పెద్దలే సభ్య సమాజానికి ఇప్పుడు ఏం మెస్సేజ్​ ఇస్తున్నట్లు?  మాస్కులు పెట్టుకోకపోవడమేంది? ఫిజికల్ డిస్టెన్స్​ ఎటుపోయింది? గుంపులుగా గుంపులుగా వెళ్లడమేంది? నారాయణఖేడ్​లో  మాదిరిగానే కొండ పోచమ్మ గురించి వార్తలు రాసే రిపోర్టర్ల  కొంపలు కూల్చేస్తరా?’’ అనే ప్రశ్నలు కామెంట్స్​ రూపంలో కనిపించాయి. ‘‘రాష్ట్రంలో పలుప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోని సుమారు 40 వేల మంది దగ్గర ఫైన్లు వసూలు చేసిన అధికారులు.. వీళ్ల దగ్గర వసూలు చేస్తారా’’ అనే చాలెంజ్​లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

లాక్​డౌన్​లో ఆలయం ఓపెనేంది?

లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు మూసి వేసి భక్తుల సందర్శనను పూర్తిగా నిలిపివేస్తే.. శుక్రవారం సీఎం రాకతో మాత్రం కొండపోచమ్మ దేవాలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఆలయ ఆవరణలో రెండు జంటలతోనే  డిస్టెన్స్​ పాటిస్తూ  చండీ యాగాన్ని నిర్వహించినా.. సీఎం రాగానే ఆ డిస్టెన్స్​ కనిపించలేదు. అక్కడికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం మాస్క్ లు పెట్టుకోకపోవడం, డిస్టెన్స్​ పాటించకపోవడంపై సోషల్​ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

జస్ట్ ఆరేళ్లలోనే బంగారు తెలంగాణ చేశాం