ప్రజలకు పేలాలు పంచి కేసీఆర్​ బిర్యానీ తింటుండు: మధుయాష్కీ

ప్రజలకు పేలాలు పంచి కేసీఆర్​ బిర్యానీ తింటుండు: మధుయాష్కీ

సెల్ఫీవిత్​ కాంగ్రెస్​ డెవలప్​మెంట్​
సెల్ఫీలు తీసి.. వాట్సాప్​లో డీపీలుగా పెట్టుకోవాలి
కాంగ్రెస్​ కేడర్​కు భట్టి విక్రమార్క పిలుపు

హైదరాబాద్, వెలుగు: రైతులకు ఉచిత కరెంట్​ అనేది కాంగ్రెస్​ పార్టీ పేటెంట్​ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘ఫ్రీ కరెంట్​ పాలసీ బీఆర్​ఎస్​దే అన్నట్లుగా సీఎం కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్  పచ్చి అబద్ధాలాడుతున్నరు” అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్​ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు ‘సెల్ఫీ విత్​ కాంగ్రెస్​ డెవలప్​మెంట్​’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్​ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకొచ్చిన ప్రాజెక్టుల ముందు సెల్ఫీ తీసుకోవడమే ఈ కార్యక్రమమని చెప్పారు. మంగళవారం సీఎల్పీలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. మెట్రో రైలు, ఔటర్​ రింగ్​రోడ్డు, ఎయిర్​పోర్ట్​, ఈసీఐఎల్, బీహెచ్​ఈఎల్, బీడీఎల్, డ్రింకింగ్​ వాటర్​ వంటివన్నీ కాంగ్రెస్​ హయాంలో వచ్చినవేనని, వాటి ముందు సెల్ఫీ తీసుకొని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ సెల్ఫీ ఫొటోలను వాట్సాప్​ డీపీలుగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత కరెంట్​ను రైతులకు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్​ హయాంలో కట్టిన విద్యుత్​ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు విద్యుత్​ కోతలు లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అవినీతి సొమ్ముతో బీఆర్​ఎస్​ నేతలు సోషల్​ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్​కు సోయి ఉందో లేదో కూడా తెలియదని విమర్శించారు. ‘‘రాష్ట్రాలను బట్టి అవసరాలుంటాయి. ఆయా రాష్ట్రాల అవసరాలు, ఆదాయ వనరులను బట్టే మేనిఫెస్టో ఉంటుంది. చత్తీస్​గఢ్​లో ఉచిత కరెంట్​ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించడం వారి పిచ్చి ముదిరి మాట్లాడినట్టు 

అనిపిస్తున్నది’’ అని దుయ్యబట్టారు. 

శ్రీరామ్​సాగర్​ వద్ద సంబురాలు జరుపుతం: మధుయాష్కీ
రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు భట్టి విక్రమార్క ఆదిలాబాద్​ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేయడం గొప్ప విషయమని మధుయాష్కీ అన్నారు. ఆనాడు వైఎస్​ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్​ను తీసుకురావడంలో భట్టి విక్రమార్క ప్రమేయం కూడా ఉందని చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు ఉండేది. కానీ, ఇప్పుడు ఆదాయం పెంచకపోగా.. రాష్ట్ర సర్కారు అప్పులను విపరీతంగా పెంచింది” అని ఆయన మండిపడ్డారు. శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్టును నిర్మించి 60 ఏండ్లవుతున్నదని, కాంగ్రెస్​ కట్టిన ఆ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలు పచ్చబడ్డాయని తెలిపారు. 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టు వద్ద సంబురాలు నిర్వహిస్తామన్నారు. గ్రావిటీతోనే కిందికి  నీళ్లిచ్చేలా రూపొందించిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కేవలం కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్​ కట్టారని ఆయన  ఆరోపించారు. ప్రజలకు పేలాలను పంచుతూ.. కేసీఆర్​ మాత్రం బిర్యానీలను తింటున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కల్వకుంట్ల కుటుంబం కడుపు నింపుకుందని విమర్శించారు. వరంగల్​ రైతు డిక్లరేషన్​లో భాగంగా రాహుల్​ గాంధీ ప్రకటించిన అన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ధరణిని తెచ్చి భూబకాసురులుగా మారారని కేసీఆర్​పై మధు యాష్కీ ఫైర్​ అయ్యారు. 

ALSO READ :ఆర్టీసీ డిపోల్లో అకౌంట్స్​ సెక్షన్ క్లోజ్

వైఎస్​ తొలి సంతకం ఫొటో ముందు సెల్ఫీ    
2004లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్​ ఫైల్​పై తొలి సంతకం పెట్టారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. నాటి ఫొటోను ప్రదర్శించారు. ఆ ఫొటో ముందు మధు యాష్కీ, బెల్లయ్య నాయక్​ తదితర నేతలతో కలిసి ఆయన సెల్ఫీ తీసుకున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలేవీ ఆలోచన చేయనప్పుడే.. 1999 ఎన్నికల్లో సోనియా గాంధీ అనుమతితో వైఎస్​, అప్పటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్​ చక్రపాణి ఫ్రీ కరెంట్​ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చారని భట్టి తెలిపారు. అప్పటి నుంచే ఉచిత విద్యుత్​కు కాంగ్రెస్​ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఉచిత కరెంట్​పై వైఎస్​ చేసిన తొలి సంతకం ఫొటోను విస్తృతంగా ప్రచారం చేయాలని కేడర్​కు పిలుపునిచ్చారు.