ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ భేటీ.. కేసీఆర్ మతలబేంటి?

ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ భేటీ.. కేసీఆర్ మతలబేంటి?

కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ మూమెంట్స్ అన్నీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ, ప్రత్యామ్నాయ వేదిక చుట్టూ తిరిగింది కేసీఆర్ రాజకీయం. ఇప్పుడు జిల్లా పర్యటనలు, కేబినెట్ సమావేశం, టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికకు టైం దగ్గర పడుతున్న సందర్బంలో.. ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలు నిర్వహిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారింది. 

 సీఎం కేసీఆర్ కార్యాచరణ అంతా మూనుగోడు కోసమా ..లేక  ముందస్తు ఎన్నికలకు వెళ్ళే వ్యూహమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనట్లు క్యాబినెట్ మీటింగ్ ఎజెండా.. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఎజెండా ముందే బహిర్గతపర్చటంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇతర అంశాలపై దృష్టి వెళ్ళకుండా ముందే ఈ అంశాలపై డిస్కస్ చేస్తామని ఫిక్స్ చేశారనే చర్చ జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు డిఫరెంట్ గా ఉండటంతో ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చిస్తారనే చర్చ జరుగుతోంది.

 మునుగోడు ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అనూహ్యంగా తన కుటుంబ సభ్యుల పాత్రపై ఆరోపణలు రావటంతో కేసీఆర్ డైలమాలో పడ్డట్లు చర్చ జరుగుతోంది. మునుగోడుకు ముందే ప్రభుత్వ రద్దు దిశగా ఆలోచన చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. కేబినెట్ మీటింగ్, టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ల ద్వారా పార్టీ నేతలను మానసికంగా ప్రిపేర్ చేసే పని పెట్టుకున్నారా అనే టాక్ నడుస్తోంది. 

కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా ఉండటంతో జరుగుతున్న చర్చలకు బలం చేకూరుతుంది. 2018 సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేశారు. అది కలిసి వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవితపై అవినీతి ఆరోపణలు.. మున్ముందు ఎక్కడికి దారితీస్తాయో అన్న చర్చ ప్రగతిభవన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ముదరకముందే ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉంటుందనే విషయంపై రకారకాల చర్చలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ అనుకున్నదానికి.. భిన్నంగా వ్యవహారాలన్నీ జరుగుతుండటంతో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న టాక్ నడుస్తోంది.