కేసీఆర్ ఫోన్ చేసి రమ్మంటేనే వెళ్లా

కేసీఆర్ ఫోన్ చేసి రమ్మంటేనే వెళ్లా
  • మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ 
  • మా మధ్య బీఆర్ఎస్ ప్రస్తావన రాలే
  • నేషనల్ పాలిటిక్స్పై కేసీఆర్​కు ఫుల్ క్లారిటీ
  • లంచ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో పీకే కూడా ఉన్నారు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ ఫోన్‌‌‌‌ చేసి రమ్మంటేనే తాను ప్రగతి భవన్‌‌‌‌కు వెళ్లి ఆయనను కలిశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌కు వచ్చిన ఉండవల్లి ప్రగతి భవన్‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌తో సమావేశమయ్యారు. దీంతో కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి ఆయనను ఏపీ ఇన్ చార్జ్ గా నియమిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. కేసీఆర్‌‌‌‌తో భేటీ గురించిన అంశాలను వివరించారు. ‘‘ప్రగతి భవన్ లో మంత్రి హరీశ్‌‌‌‌రావు స్వాగతం పలికారు. మా భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. పది రోజుల క్రితం కేసీఆర్‌‌‌‌ ఫోన్‌‌‌‌ చేసి రావాలని  కోరారు. అప్పుడే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పాను. కేసీఆర్‌‌‌‌తో కలిసి లంచ్‌‌‌‌ చేశాను. మీటింగ్‌‌‌‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌‌‌‌ కిశోర్‌‌‌‌, మంత్రులు హరీశ్‌‌‌‌రావు, ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, ఒక ఎంపీ కూడా ఉన్నారు” అని ఉండవల్లి చెప్పారు. కేసీఆర్ తో కలిసి తాను వెజ్ తిన్నానని, మూడు గంటల భేటీలో తాను అరగంట మాట్లాడితే కేసీఆర్ రెండున్నర గంటలు మాట్లాడారని తెలిపారు.

జాతీయ రాజకీయాలపైనే చర్చ

కేసీఆర్ తో జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ఉండవల్లి తెలిపారు. కేసీఆర్ ఏర్పాటు చేస్తారని చెప్తోన్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రస్తావన మాత్రం రాలేదన్నారు. దేశంలో మోడీ పాలనను వ్యతిరేకించే వారిలో కేసీఆరే బలమైన నేతగా ఉన్నారన్నారు. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని, ఆ పార్టీ విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తానని తెలిపారు. బీజేపీ విధానాలు ఇప్పుడున్నట్లే ఉంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపైనే ప్రధానంగా తమ మధ్య చర్చ జరిగిందన్నారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే దిశగా కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారన్నారు. బీజేపీయేతర పార్టీలను కేసీఆర్ లీడ్‌‌‌‌ చేయగలరని అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాలపై తనకన్నా ఎక్కువగా కేసీఆర్‌‌‌‌ స్టడీ చేశారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కన్నా బలంగా కేసీఆర్ ప్రజలకు చెప్పగలరన్నారు. దేశంలో కాంగ్రెస్‌‌‌‌ బలహీనపడినట్టే కనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అవసరమేనన్నారు. చర్చలో ప్రశాంత్‌‌‌‌ కిశోర్‌‌‌‌ పాల్గొనలేదని, తాము మాట్లాడుతుంటే ఆయన సాంతంగా విన్నారని తెలిపారు. కేసీఆర్‌‌‌‌ మళ్లీ ఎప్పుడు పిలిచినా వెళ్లి కలుస్తానన్నారు.