హైదరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపు చేశారు. కంపెనీలో నుంచి దట్టమైన పొగ వెలువడుతుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడు గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
