హుజూరాబాద్.. బరి గీసి కొట్లాడే గడ్డ

హుజూరాబాద్.. బరి గీసి కొట్లాడే గడ్డ

కరీంనగర్, వెలుగు: ‘‘కేసీఆర్! నా హుజూరాబాద్.. నాగార్జునసాగర్, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ కాదు. ఇది బరి గీసి కొట్లాడే గడ్డ. ఇక్కడి ప్రజలను మోసం చేయలేవు’’ అని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఇల్లందకుంట, హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. ‘‘నా ఒక్కని కోసం వేల కోట్లు ఖర్చు చేసిన్రు. అసెంబ్లీలో కనపడొద్దని కుట్ర చేసిన్రు. కానీ 30 నాడు ఓట్లు గుద్దితే కేసీఆర్ దిమ్మదిరగాలె. పైసలు పంచినోళ్లకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలె” అని ఓటర్లకు పిలుపునిచ్చారు.

పది నిమిషాల్లో ఎట్లొస్తున్నరు

‘‘సెగ్మెంట్ల నేను అభివృద్ధి చేయనే లేదని టీఆర్ఎసోళ్లు అంటున్నరు. అదే నిజమైతే జమ్మికుంట నుంచి హుజూరాబాద్ కు పది నిమిషాల్లో ఎట్లొస్తున్నరు? నేను చేసిన అభివృద్ధి కనపడాల్నంటే మల్యాల వాగు మీద కట్టిన  చెక్ డ్యాములు చూడండి. రాములోరి గుడి చూడండి” అని ఈటల అన్నారు. ఈటల గెలుపు హుజూరాబాద్ కే గాక రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తుందని డీకే అరుణ అన్నారు. ఈటలను భారీ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అహంకారం తగ్గుతదన్నారు.

నన్ను చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం..

‘‘నేను మీ బిడ్డను. మీరు ఆశీర్వదిస్తే మీకు పనులు చేసిపెట్టిన. నా అవసరం తీరినంక కేసీఆర్ నన్ను కష్టపెడుతున్నడు. హుజూరాబాద్​లో నన్ను ఓడించాలని చూస్తున్నడు. డబ్బులు ఇస్తే మీరు ఓట్లు వేసి వాళ్లను గెలిపిస్తారనుకుంటుండు. మీరే నిర్ణయించుకోండి మీ బిడ్డనైన నన్ను చంపుకుంటారో.. సాదుకుంటారో.. మీ ఇష్టం’ అని ఈటల రాజేందర్ ఎమోషనల్​గా మాట్లాడారు.  కేసీఆర్ 2014 వరకు మాత్రమే ఉద్యమకారుడని, ఆ తర్వాత దోపిడీదారుడిగా మారాడన్నారు.