కేసీఆర్​ నల్గొండకు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా : సీఎం రేవంత్

 కేసీఆర్​ నల్గొండకు కాదు..  దమ్ముంటే అసెంబ్లీకి రా :  సీఎం రేవంత్

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడడం కాదని దమ్ముంటే అసెంబ్లీలో ఇరిగేషన్​పై చర్చకు రావాలని బీఆర్ఎస్ చీఫ్​కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని, పిల్లర్లు కుంగి ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చాయని, నీళ్లు నింపితే బ్యారేజీలన్నీ కొట్టుకపోయే పరిస్థితి ఉందని రేవంత్ అన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు పిలిస్తే రాకుండా, మేడిగడ్డ పరిశీలనకు రాకుండా కేసీఆర్ ముఖం చాటేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఎక్కడ తన బండారం బయటపడుతుందోనని నల్గొండ పోయి తమపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపైన అసెంబ్లీలో చర్చకు పిలిస్తే తన బండారం బయట పడుద్దని కేసీఆర్ కు అర్థమైంది. దీన్ని మరిపించడానికి నల్లగొండ సభ నాటకం ఆడిండు. కుర్చీ పోగానే మళ్లీ కృష్ణా నీళ్లు, నల్లగొండ ఫ్లోరైడ్‌‌ సమస్య అంటున్నడు. కోటి ఎకరాలకు నీళ్లిస్తున్నామని కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై ఇప్పటికే కోటి అబద్ధాలు చెప్పిండు. కృష్ణానది నీళ్లపై అసెంబ్లీలో తీర్మానం చేద్దాం రమ్మంటే రాడు. 

కాలు విరిగిన సాకుతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.. కానీ నల్గొండకు పోయిండు. కేసీఆర్ ఇంటికి అసెంబ్లీ దగ్గరనా..? నల్గొండ దగ్గరనా..? ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌లో జరిగిన అన్ని తప్పులకు కేరాఫ్ కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో జరిగిన అవినీతి బండారాన్ని బయటపెట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని రేవంత్‌‌ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌పూర్‌‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న సీఎం, రాష్ట్ర మంత్రులు, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుంగిన మేడిగడ్డ పియర్లను, వాటికి వచ్చిన పగుళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ లోపాలపై ఇరిగేషన్‌‌ శాఖ ఏర్పాటు చేసిన పవర్‌‌ పాయింట్‌‌ ప్రజెంటేషన్‌‌ తిలకించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌‌ రెడ్డి మాట్లాడారు.

కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా..

నల్గొండ మీటింగులో కేసీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మేడిగడ్డలో నాలుగు పిల్లర్లు కుంగాయని కేసీఆర్ అంటున్నడు. ఇది నీ దిగజారుడుతనానికి నిదర్శనం. నీ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కుంగినయ్. అసెంబ్లీ తీర్మానాన్ని తప్పుపట్టే బదులు నువ్వే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహా ఇవ్వవచ్చు కదా కేసీఆర్. అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పొమ్మని నల్గొండలో కాదు అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యి. కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందే నువ్వు. ఏనుగును మొత్తం దాటించావ్. మాకు తోక మాత్రమే మిగిలింది. దాన్ని పట్టుకొని లాగుతున్నం. మమ్మల్ని బెదిరించి బతకాలి అని చూస్తున్న వ్. కానీ నువ్వు బెదిరిస్తే భయపడే ప్రభుత్వం కాదు. మాది ప్రజా ప్రభుత్వం. నువ్వు చేసిన పనికి తెలంగాణ ప్రజలు ఇంకా నిన్ను మళ్లీ అధికారంలోకి ఎట్ల తీసుకొని వస్తారనుకుంటున్నవ్? ప్రతిపక్షంగా సభకు రాకుండా ఏ ముఖం పెట్టుకొని నల్గొండ పోయావు. కుర్చీ పోగానే కేసీఆర్​కు మళ్లీ నీళ్లు, ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చాయి. రేపు సభకు రా కేసీఆర్. ఇరిగేషన్ మీద వైట్​పేపర్​విడుదల చేస్తం. దానిపైన చర్చకు రా అసెంబ్లీకి’ అని రేవంత్​ కేసీఆర్​కు సవాల్ విసిరారు.

కేఆర్ఎంబీకి అనుకూలంగా కేసీఆర్​ లెటర్ రాయించలేదా?

రీ ఇంజినీరింగ్ అంటూ కాళేశ్వరం కట్టి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్, దీనిపై చర్చ జరగకుండా నల్లగొండలో సభ పెట్టుకున్నారని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. ప్రజల ముందు తన బండారం బయటపడుతున్నదనే ప్రస్టేషన్​లో  తమపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘​కేఆర్‌‌ఎంబీ విషయంలో అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించాలని కేసీఆర్ చూస్తున్నారు.. ఆయన హయాంలో సీఎం సెక్రటరీగా  పనిచేసిన స్మితా సబర్వాల్‌‌ కేఆర్​ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదా? ఇది అప్పటి సీఎం కేసీఆర్‌‌కు తెల్వకుండానే చేసిన పనా?’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేసి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి  మేడిగడ్డలో ఓ నాలుగైదు పిల్లర్లు కూలిపోతయ్‌‌ అయితే ఏంటి? అని చాలా చులకనగా మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని రేవంత్​ మండిపడ్డారు.

పగుళ్లు కనిపిస్తలేవా?

ఇరిగేషన్‌ శాఖలో జరిగిన అన్ని తప్పులకు కేసీఆరే కారణమని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా దానిని చిన్న సంఘటనగా కేసీఆర్ చెబుతున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై మీ వైఖరేంటో శాసనసభలో చెప్పండి’ అని కేసీఆర్​కు సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలని కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌‌ నగర్‌‌లో కలిపి 36 ఎమ్మెల్యే సీట్లు ఉంటే కేసీఆర్‌‌కు నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయని, అందుకే రాబోయే పార్లమెంట్‌‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి మళ్లీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్‌‌ చేశారని అన్నారు. తాను భయపడనని కేసీఆర్‌‌ ప్రగల్భాలు పలకడం కాదని, దమ్ముంటే వచ్చి సభలో మాట్లాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందన్నారు. కేసీఆర్ కాళేశ్వరానికి కాదు..ఇక కాశీకి వెళ్లి సన్యాసం పుచుకోవాల్సిందేనని చెప్పారు.

పదేండ్లలో సర్వనాశనం చేసినవ్..

చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చిన అని ఇంకా ఎన్నిరోజులు చెప్తవ్​.. ఇప్పటికే  పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినవ్.. మళ్లీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్​చేసినవ్​’ అని కేసీఆర్​పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలేదన్నారు. ‘మీరు చేసిన నిర్వాకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టాం. మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13వ తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు మాత్రం ఎలా వెళ్లారు?’ అని నిలదీశారు.  ‘కేఆర్‌‌ఎంబీపై తాను సలహాలు ఇచ్చేవాడినని కేసీఆర్ నల్గొండలో అంటున్నారు. సభకు వచ్చి సలహాలు ఇవ్వొచ్చని మేం ముందునుంచీ చెబుతున్నాం. తీర్మానంలో లోపాలు ఉంటే హరీశ్​ రావు ఎలా మద్దతు ఇచ్చారు. అందుకే వారి మాటలకు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలో విలువ లేదని, కేసీఆరే సభకు రావాలని మేం కోరాం. నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు.. శాసనసభకు రండి. వచ్చి సూచనలు సలహాలు ఇవ్వండి’ అని కేసీఆర్​కు సీఎం రేవంత్ సూచించారు.

ఎల్​ అండ్​ టీపై ఆర్​ఆర్ యాక్ట్​ ప్రయోగిస్తం..

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయం పెంపు పై అనుమానాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. బ్యారేజీకి మొదట రూ.1800 కోట్లతో అంచనాలు తయారుచేసి రూ.4,600 కోట్లకు  పెంచేశారని గుర్తుచేశారు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని, ఒకవేళ ఎల్ అండ్ టీ ముందుకు రాకుంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ప్రజాధనాన్ని రికవరీ చేస్తామని సీఎం​ స్పష్టం చేశారు.

కోటి ఎకరాలు పచ్చి అబద్ధం

కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్లిచ్చామని ఇన్నాళ్లూ కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని రేవంత్​అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ కు ఇప్పటి వరకు రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం 95 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారన్నారు. మరో రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టి  మొత్తం ప్రాజెక్ట్‌‌ పూర్తి చేసినా 19 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలమన్నారు. అలాంటిది కేసీఆర్‌‌ కోటి ఎకరాలకు నీళ్లిచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఏటా 180 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాల్సిన కాళేశ్వరం ద్వారా గడిచిన 5 ఏండ్లలో కనీసం 160 టీఎంసీ లు కూడా ఎత్తి పోయలేదన్నారు. ప్రాజెక్ట్‌‌ మొత్తం అంచనా వ్యయం లక్షా 27 వేల  కోట్లయితే ప్రాజెక్ట్‌‌ రన్‌‌ చేయడానికి యేటా కరెంట్​ బిల్లులే  రూ.10,500 కోట్లు కట్టాల్సి ఉంటుందని, మెయింటెనెన్స్‌‌, అప్పులు, వడ్డీ చెల్లింపుల కోసం మరో రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలన్నారు. 2020 లోనే మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉందని ఇక్కడి అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారని, అయినా నాటి సర్కారు పట్టించుకోకపోవడం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలన్నీ ఒకే విధంగా నిర్మించారని, వీటిలో నీళ్లు నిల్వ చేస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారని సీఎం వెల్లడించారు. అందువల్ల ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు వచ్చి కుంగిన మేడిగడ్డ ను పరిశీలించి, లోపాల గురించి వివరించారని మొత్తం ఆరు రకాల  టెస్టులను సూచించారన్నారు.

బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలి

బీఆర్‌‌ఎస్‌,‌ బీజేపీ చీకటి దోస్తులు కాబట్టే ఈ రోజు బీఆర్ఎస్​తో పాటు బీజేపీ నేతలు కూడా మేడిగడ్డకు రాలేదని సీఎం రేవంత్ ఆరోపించారు.‘బీజేపీ వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టంచేయాలి. కేసీఆర్ అవినీతికి సహకరిస్తారో, అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో తేల్చండి. కేసీఆర్ అవినీతిని బయటపెట్టడానికి ఈ పర్యటన కీలకం. అలాంటి మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్​చేశారు. తాము జ్యుడీషియల్ విచారణ చేస్తామంటే బీజేపీ సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నదని,  ఇది కేసీఆర్ ను కాపాడడానికే తప్ప మరోటి కాదని రేవంత్​ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌‌ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి, ఇతర మంత్రులు శ్రీధర్‌‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌‌, జూపల్లి కృష్ణారావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌తో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ‌ తదితరులు పాల్గొన్నారు. 

చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చిన అని ఇంకా ఎన్నిరోజులు చెప్తవ్​.. ఇప్పటికే  పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినవ్.. మళ్లీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్​ చేసినవ్​. సత్య హరిశ్చంద్రుడివే అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలే. మీరు చేసిన నిర్వాకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టినం. మేడిగడ్డకు రావాలని మా మంత్రి లేఖ రాశారు. మీకు 13వ తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్గొండ సభకు మాత్రం ఎలా వెళ్లారు?.
- సీఎం రేవంత్​రెడ్డి