కవితను విడిపించుకునేందుకు మోదీతో కేసీఆర్‌‌ కాంప్రమైజ్‌‌ : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌

కవితను విడిపించుకునేందుకు మోదీతో కేసీఆర్‌‌ కాంప్రమైజ్‌‌ : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌
  •      హిందుమతం పేరుతో బండి సంజయ్‌‌ రాజకీయం చేస్తున్నడు

వేములవాడ, వెలుగు : ‘తన బిడ్డ కవితను విడిపించుకునేందుకు కేసీఆర్‌‌ ప్రధాని మోదీతో కాంప్రమైజ్‌‌ అయ్యారు, ఇందుకు కరీంనగర్‌‌ ఎంపీ క్యాండిడేట్‌‌ బోయినపల్లి వినోద్‌‌కుమార్‌‌ను బలిపశువును చేస్తున్నారు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ విమర్శించారు. బండి సంజయ్​ హిందుమతం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం జరిగిన వేములవాడ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్​ అది శ్రీనివాస్‌‌తో కలిసి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్‌‌ మాట్లాడుతూ -కార్యకర్తలు కష్టపడితే కరీంనగర్ ఎంపీ సీటు కాంగ్రెస్‌‌ వశం అవుతుందని, కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్‌‌ పదవులు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌‌ ఇచ్చిన మాట ప్రకారం-- ఆరు గ్యారంటీలను అమలుచేస్తుంటే బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. రాజన్న గుడిని డెవలప్‌‌ చేస్తానని చెప్పి దేవుడికే శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్‌‌ అని అన్నారు. సిరిసిల్లకు రావాల్సిన టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌ను వరంగల్‌‌కు తరలించిన వినోద్‌‌కుమార్‌‌కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 

ఉత్తర భారతదేశంలో మోదీ గ్రాఫ్‌‌ పడిపోతోందని, బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం బదులు నియంతృత్వం అమల్లోకి వస్తుందన్నారు. అక్షింతల పేరుతో బీజేపీ లీడర్లు రాజకీయం చేశారన్నారు. ప్రసాద్‌‌ స్కీమ్‌‌లో వేములవాడ, కొండగట్టుకు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి అకౌంట్‌‌లో రూ. 15 లక్షలు అన్న హామీలు ఎటు పోయాయని నిలదీశారు. సమావేశంలో నాయకులు వెలిచాల రాజేందర్‌‌రావు, మాజీ ఎమ్యేల్యేలు అరెపల్లి మోహన్, సత్యనారాయణ, హుజురాబాద్‌‌ కాంగ్రెన్‌‌ ఇన్‌‌చార్జి ప్రణవ్ పాల్గొన్నారు.