దోస్తుల్లా ఉందాం

దోస్తుల్లా ఉందాం

ఇరు రాష్ట్రాలకు మేలు కలిగేలా చేద్దామని సూచన నదుల నీళ్లను సమర్థంగా వాడుకుందామని ప్రతిపాదన భార్య, పార్టీ నేతలతో కలిసి ప్రగతి భవన్‌కు వచ్చిన జగన్ ఎదురెళ్లి స్వాగతం పలికిన కేసీఆర్, కేటీఆర్, మంత్రులు శాలువా కప్పి కొత్త బట్టలు పెట్టిన కేసీఆర్​ దంపతులు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించిన జగన్ అరగంట పాటు కేసీఆర్, జగన్​ భేటీ.. 

ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్ తోనూ అలాగే ఉంటామని కాబోయే ఏపీ సీఎం, వైఎస్సార్​సీపీ అధినేత జగన్​మోహన్​రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్​అన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్.. భార్య భారతి, పలువురు పార్టీ నేతలతో కలిసి శనివారం ప్రగతి భవన్​కు వచ్చారు. వారికి సీఎం కేసీఆర్, టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు సాదరంగా స్వాగతం పలికారు.

కేసీఆర్​ జగన్​ను కావలించుకుని శుభాకాంక్షలు చెప్పారు. స్వయంగా ప్రగతిభవన్​లోపలికి తీసుకుని వెళ్లారు. జగన్ భార్య భారతికి కేసీఆర్ సతీమణి శోభారాణి, కేటీఆర్ సతీమణి శైలిమ స్వాగతం పలికారు. జగన్​కు స్వీటు తినిపించిన కేసీఆర్.. ఆయన సీఎం బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆశీర్వదించారు. పోచంపల్లి ఇక్కత్​ శాలువా కప్పి, కరీంనగర్​ సిల్వర్​ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసిన వెండి హంస వీణను బహూకరించారు. రాష్ట్ర మంత్రులను, ఇతర ప్రముఖులను జగన్ కు పరిచయం చేశారు. కేటీఆర్​జగన్​ను కావలించుకుని శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత జగన్‌‌ దంపతులకు కేసీఆర్‌‌, కేటీఆర్​ దంపతులు కొత్త బట్టలు పెట్టారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్, కేటీఆర్​ ఇతర నేతలను జగన్​ ఆహ్వానించారు. తర్వాత కేసీఆర్, జగన్​ అరగంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

అందరికీ మేలు జరగాలి..
ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదన్నదే తమ భావన అని భేటీలో కేసీఆర్​ చెప్పారు. ‘‘నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం ఫడ్నవీస్ ను కలిసిన. జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై చొరవ తీసుకుని మాట్లాడిన. లివ్ అండ్ లెట్ లివ్ మా విధానమని, వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని చెప్పిన. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు కట్టుకోగలుగుతున్నం. ఆంధ్రప్రదేశ్ తో కూడా ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా చేద్దాం’’అని పేర్కొన్నారు.

గోదావరి నీళ్లను వాడుకుందాం
గోదావరి నుంచి ఏటా 3,500 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయని, అందులో 800 టీఎంసీలకు మించి తెలంగాణ వాడుకునే అవకాశం లేదని జగన్​తో కేసీఆర్​ పేర్కొన్నారు. మిగతా నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి సోమశిల మధ్య గ్రావిటీ ద్వారా ఏపీనే ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. ఆ నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని వివరించారు. రెండు లిఫ్టులు ఏర్పాటు చేసి, నీళ్లను తరలించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమై అన్ని అంశాలపై చర్చించాలని కేసీఆర్, జగన్​ నిర్ణయించారు. అయితే కేసీఆర్​ మాట్లాడిందంతా జగన్​ విన్నారని, పెద్దగా ఏమీ మాట్లాడలేదని సమాచారం. చివరగా జగన్​ వెళ్లిపోతున్న సమయంలో.. ‘ముందు ముందు మనం మళ్లీ కలవాలి’ అని కేసీఆర్​ పేర్కొన్నట్టు తెలిసింది.

తొమ్మిదేళ్ల నాటి జ్ఞాపకాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ సీఎంగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలకే వైఎస్‌‌ రాజశేఖర్‌‌రెడ్డి హెలికాప్టర్‌‌ ప్రమాదంలో చనిపోయారు. అప్పటివరకు వైఎస్​తోపాటు భార్య విజయమ్మ, జగన్​ దంపతులు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. 2010లో అక్కడి నుంచి సాగర్‌‌ సొసైటీలోని నివాసానికి షిఫ్ట్‌‌ అయ్యారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్‌‌ బేగంపేట క్యాంపు ఆఫీసు పక్కనే ప్రగతి భవన్‌‌ను నిర్మించారు. శనివారం ప్రగతి భవన్‌‌కు వచ్చిన జగన్‌‌.. తొమ్మిదేళ్ల కిందటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్నారని, తన తండ్రి నిర్మించిన క్యాంపు ఆఫీసును చూసి ఉద్వేగానికి లోనయ్యారని తెలిసింది. వైఎస్​ మరణం తర్వాత కాంగ్రెస్‌‌ను వీడి సొంత పార్టీ పెట్టుకున్న జగన్‌‌.. ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన జగన్‌‌.. తాజా ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్నారు. విజేతగా బేగంపేట క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న ప్రగతి భవన్‌‌కు వచ్చారు.

తొలిసారి ప్రత్యేక భేటీ
రాజ్‌‌భవన్‌‌లో నిర్వహించే ఎట్‌‌ హోం కార్యక్రమాల్లో మినహా జగన్‌‌, కేసీఆర్‌‌ నేరుగా భేటీ కావడం ఇదే మొదటిసారి. తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న పలు అంశాలు, ఏపీ ఆర్థిక, సామాజిక స్థితిగతులపైనా వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు, గ్రాంట్లపై కేసీఆర్‌‌ వివరించినట్టు సమాచారం. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని చెప్పినట్టు తెలిసింది. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు అందజేసిన కేసీఆర్‌‌కు ఈ సందర్భంగా జగన్‌‌ కృతజ్ఞతలు తెలిపినట్టు సమాచారం. సాయంత్రం 6.55 గంటల సమయంలో జగన్‌‌ ప్రగతి భవన్‌‌ నుంచి లోటస్​పాండ్​లోని తన నివాసానికి బయలుదేరారు.