సీఎంల పనితీరు: టాప్ 10 లో కేసీఆర్ కు దక్కని చోటు

సీఎంల పనితీరు: టాప్ 10 లో కేసీఆర్ కు దక్కని చోటు

దేశంలోని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి పనితీరుపై ఇండియా టుడే- కార్వీ ఇన్ సైట్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ టాప్ టెన్ లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశంలో బెస్ట్ సీఎంగా నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. తమిళనాడులో 42శాతం మంది స్టాలిన్ బాగా పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. నవీన్ పట్నాయ్ కు 38శాతం మంది మద్దతు పలికారు. మూడో స్థానంలో నిలిచిన కేరళ సీఎం పినరయి విజయన్ కు 35 శాతం, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే 31 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 30శాతం మద్దతుతో ఐదో స్థానంలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ 29శాతం ఓట్లతో ఏడో స్థానంలో, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 22శాతం ఓట్లతో 8వ స్థానంలో ఉన్నారు. 

ఇక జాతీయ స్థాయి సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ కు 19శాతం మంది మద్దతు పలికారు. అర్వింద్ కేజ్రీవాల్ కు 14శాతం, మమతా బెనర్జీకి 11శాతం, YS జగన్ కు 6 శాతం మద్దతు తెలిపారు. అయితే రాష్ట్రాల వారీ సర్వేలో  తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు టాప్ టెన్ లో చోటు దక్కలేదు. రాష్ట్రాల వారీ సర్వేలో KCR, జగన్ లు ఇద్దరికీ 19శాతం ఓట్లు కూడా రాలేదు. అయితే ఇండియా టుడే టాప్ టెన్ జాబితాను మాత్రమే ప్రకటించింది. దీంతో KCR, జగన్ లు ఏ స్థానాల్లో ఉన్నారో తెలియరాలేదు. 

ఇక ప్రధాని మోడీకి కూడా ఆదరణ భారీగా తగ్గింది. గత ఆగస్ట్ లో ఆయనకు 66 శాతం మంది మద్దతు పలకగా... ఈ సారి 24శాతమే నమోదైంది. అయినప్పటికీ దేశ ఉత్తమ ప్రధానిగా 24శాతం మంది ఆయనకే మొగ్గు చూపారు. ప్రధానమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ కు 11శాతం, రాహుల్ గాంధీకి 10 శాతం మద్దతు పలికారు. గతేడాదితో పోలిస్తే రాహుల్ గాంధీకి 2 శాతం ఆదరణ పెరిగింది. 

దేశంలోని 19 రాష్ట్రాల్లో 115 లోక్ సభ నియోజకవర్గాలు, 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జులై 10 నుంచి జులై 20 వరకు ఇండియా టుడే-కార్వీ ఇన్ సైట్స్ సర్వే చేశాయి. అందులో 71 శాతం గ్రామీణ, 29శాతం పట్టణ ప్రాంతాలున్నాయి.