
గోదావరి నదిని చూస్తే మనసు పులకరించిపోతోందని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును తాము ఎలా డిజైన్ చేశామో.. అనుకున్నది అనుకున్నట్టుగా నిర్మాణం జరగడమే కాదు.. అంతకంటే మంచి ఫలితాలు అందిస్తోందని చెప్పారు. కాళేశ్వరంలో.. ఒక్కో బ్యారేజీ.. ఒక్కో పంప్ హౌజ్.. ఓ ప్రాజెక్టుతో సమానమని చెప్పారు. సజీవంగా మారిన గోదావరిని చూసి తాను మామూలుగా ఆనందంతో లేననీ.. చాలా సంతోషంగా ఉన్నాననీ చెప్పారు కేసీఆర్. రాత్రి, పగలు చూడకుండా… భార్యాపిల్లలు, కుటుంబాలను వదిలి ఇంజినీర్లుకష్టపడ్డారని చెప్పారు సజీవ గోదావరిని అందించినందుకు.. అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు చెబుతున్నా అన్నారు కేసీఆర్.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, గోదావరి నీటి నిల్వను ఆయన హెలికాప్టర్ సర్వేలో పరిశీలించారు. పలు బ్యారేజీలపై దిగి గోదావరిలోకి పూలు చల్లి వందనం చేశారు. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు.
“250 కి.మీ. పొడవునా రాష్ట్రంలో గోదావరి సజీవంగా ఉండబోతోంది. ఇది ఎవరూ కలలో కూడా అనుకోలేదు. మేం అనుకున్నది అనుకున్నట్టుగా.. బ్యారేజీలు, బ్యాంకుల దగ్గర నీళ్లు ఎలా ఉంటాయనుకున్నామో…. అంతకంటే బెటర్ గా ఇవాళ గోదావరి కనిపించింది. 44 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డుల ఆధారంగా.. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేశాను. ఇదేదో ఆషామాషీగా, చిల్లరమల్లరగాళ్లు చెబితే చేయలేదు. ఈ లిఫ్ట్ ప్రాజెక్టుల కారణంగా.. గోదావరిలో ఇపుడు నికరంగా ఏడాదిలో 4వందల టీఎంసీలను వాడుకోబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో 40లక్షల ఎకరాలకు నీళ్లు అందబోతున్నాయి. జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలల్లో నెలకు 60 టీఎంసీలు ఎత్తిపోసుకుంటాం. 6 నెలల్లో మొత్తం 360 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తాం. నవంబర్ నుచి జూన్ వరకు.. మినిమం 40 టీఎంసీలు వాడుకుంటాం. అలా మొత్తం 400 టీఎంసీలు నీళ్లను మనం వాడుకుంటాం. ప్రతిరోజు గోదావరి ఇలాగే కళకళగా ఉంటుంది.” అన్నారు కేసీఆర్.
కరెంట్ బిల్లుపై సీఎం స్పందన
“ప్రాజెక్టు కరెంట్ బిల్లుపై రకరకాలుగా చెబుతున్నారు. కరెంట్ ఖర్చు పెద్దదేం కాదు. తగ్గించమని కూడా అడిగాం. ఏడాదిలో మొత్తం 400 టీఎంసీలు కాళేశ్వరం నుంచి తీసుకోవడానికి.. మనం చెల్లించేది రూ.4992 కోట్లు. అంటే సుమారుగా రూ.5వేల కోట్ల బిల్లు ఏడాదికి మనం కడతాం. అంతే” అన్నారు కేసీఆర్.
“తెలంగాణకు కరెంటు కష్టాలు లేవు. సాగునీరు, తాగునీటి కష్టాలు లేవు. సంక్షేమంలో మన రాష్ట్రమే నంబర్ వన్ గా ఉంది.” అన్నారు సీఎం కేసీఆర్.