
రా ష్ట్రం సాధించుకున్న తర్వాత తండ్రిచాటున ఉన్న కల్వకుంట్ల కుటుంబ సభ్యులతో పాటు సమీప బంధువులు కూడా మంత్రి పదవుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనేక ఉన్నతస్థాయి నామినేటెడ్ పదవులు పొందారు. ఉద్యమం చేసి ప్రాణత్యాగాలు చేసిన 1400 మంది కుటుంబాలను, ఇతరులను ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు మర్చిపోయారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తమ సొంత ఆస్తిగా కుట్ర పన్నారు. అధికారంలో ఉండి లక్షలాది మంది ఉద్యమకారుల త్యాగాలను, ఆశయాలను మంటగలిపారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమ సామాజికవర్గపు పోలీసులు, ఇతర అవినీతి అధికారుల అండదండలతో ప్రజాధనాన్ని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల భూములను కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, కుటుంబానికి వత్తాసు పలికిన నాయకులకు పంచిపెట్టడం జరిగిందని ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులతో వెలువడుతున్న సమాచారం ద్వారా తెలుస్తున్నది.
కేసీఆర్ కుటుంబానికే సంపూర్ణ అధికారం
రాష్ట్ర గత కేబినెట్లో కుటుంబ సభ్యులే ముఖ్య శాఖలను ఉంచుకొని అన్ని రకాల అవకతవకలకు పాల్పడ్డారు. కంపెనీల యజమాన్యాలు. ప్రాంతేతరుల వెంటబడి వేల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ సమీకరించుకున్నారు. కేటీ రామారావు గత కేబినెట్లో ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, మైనింగ్, టెక్స్టైల్ శాఖలు తీసుకొని ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.
ఫార్ములా ఈ రేస్ దర్యాప్తు ఇదే అంశాన్ని తెలియజేస్తున్నది. పెట్టుబడుల ఆకర్షణ నెపంతో మంత్రిగా అనేక దేశాలు తిరిగి అక్కడ ఏం నిర్వాకం చేసిందీ ప్రజలకు తెలియదు. తెలంగాణ వచ్చినా ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేసి అపారమైన ఆస్తులు, అధికారాన్ని సంపాదించుకోవచ్చు.
ప్రాంతేతరులను బుజ్జగించి పదవులు ఇచ్చి ఓట్లను కొల్లగొట్టి వారి సహకారాలు స్వీకరించి దీర్ఘకాలంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం వారికి మాత్రమే చెల్లింది. అనేక ప్రభుత్వ శాఖలలో కుటుంబ సభ్యులు చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్న అనేక దర్యాప్తుల విషయాలను సోషల్ మీడియా ప్రజలకు తెలియజేయడం తప్పు ఎలా అవుతుంది.? తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై మీడియా సంస్థలపై ప్రతిపక్షాలపై నిఘా, నియంత్రణ, అణచివేత కొనసాగిన విషయం కేటీ రామారావు మర్చిపోయి ఉంటాడు.
తెలంగాణలో రాచరికం చెల్లదు
అధికారంతో సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి ఇతర దేశాలు కావాలి. తమ సామ్రాజ్యాన్ని దేశమంతటా విస్తరించడానికి ఆంధ్రవాళ్ళు కావాలి. అధికారం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు పంపిణీ చేసి రాయలసీమను రతనాల సీమను చేస్తామని ప్రగల్భాలు పలకవచ్చు.
ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలవవచ్చు. ఆయన ప్రమాణస్వీకారానికి అమరావతి వెళ్లి సంబురాలు చేసుకోవాలి. మంత్రి రోజా ఆహ్వానాన్ని అందుకొని నగరి సందర్శించి ఆంధ్రా చేపల పులుసుతో ఆతిథ్యం పుచ్చుకొని రావచ్చు. అవసరాన్ని బట్టి తమ స్టాండ్ మార్చడం కేవలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు మాత్రమే చెల్లుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు?. ప్రతిపక్షంలో ఉండి కూడా మీడియాపై దాడి చేయడం ఆ కుటుంబ సభ్యులకు ఒక రాజ్యాంగేతర హక్కుగా మారింది.
నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలు అయినట్లు
తెలంగాణలో ఒక రాచరికంలాగ సాగిన కుటుంబ పాలనపై ప్రజల అసంతృప్తి ఇప్పటికీ పోలేదని అర్థంచేసుకోవాలి. ఇప్పటికైనా క్రియాశీలక ప్రతి పక్ష హోదాను నిర్వర్తిస్తే మీ భవిష్యత్తుకు, మీ పార్టీకి మంచిది. అన్ని కష్టనష్టాలకు ఓర్చుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావును నమ్ముకున్న బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా కొంతమేలు చేసినట్లే అవుతుంది. కార్యకర్తల భవిష్యత్తును అంధకారమయం చేయకండి. తెలంగాణ మొదటి దశ, మలిదశ ఉద్యమంలో పాల్గొని దాదాపు 20 సంవత్సరాలు నిరంతర పోరుబాటలో నడిచిన మాలాంటి వేలాది మందికి మీ భాష, మీ దాడులు మీరు చేసిన అక్రమాలు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు కన్నీటి పర్యంతం బాధపడవలసిన దుస్థితి ఏర్పడుతున్నది.
కేవలం ఒక కుటుంబం అధికారానికి, అక్రమాస్తుల కోసం, అహంకారానికి మాత్రమే తెలంగాణ సాధించామా అని బాధ కలుగుతుంది. ఇకనైనా తెలంగాణ ప్రజల భాషను, నిజాయితీ, సంస్కృతి, మంచితనం మీరూ నేర్చుకోండి. తెలంగాణ తేవడంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీ కుటుంబ ఆస్తి పంపకాల తగాదాలతో రాజకీయాలను మరింత ఆవేదనకు, అశాంతికి గురి చేయకండి. అందరం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.
దుర్భాషలు, మీడియా మీద దాడులు
తాహతును మించి ఇతర పార్టీల నాయకులను, ప్రధానమంత్రినీ, ముఖ్యమంత్రిని కూడా దుర్భాషలాడడం తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయం కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదు. వారు ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారనీ వారి అసహనాన్ని, దుర్భాషలను ప్రజలు, ఉద్యమకారులు నిరసిస్తున్నారు. అధికారం కోల్పోయి పార్లమెంటులో ఒక్క సీటు కూడా రాని పరిస్థితులను గమనించి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి.
రాజకీయ రంగంలో మీ ప్రతిపక్ష పాత్రను క్రమశిక్షణతో నిర్వహించినప్పుడే ప్రజలు మీ పార్టీని ఆదరిస్తారు!. ఇకనైనా మీడియాపై దాడులు చేయడం మానేయండి. ప్రస్తుతం జరుగుతున్న అనేక దర్యాప్తులకు సహకరించండి.
- కూరపాటి వెంకట్ నారాయణ, ప్రొఫెసర్ (రి)–