నల్గొండకు పోయే ఓపికుంది గానీ..అసెంబ్లీకి మాత్రం రారు : తుమ్మల

నల్గొండకు పోయే ఓపికుంది గానీ..అసెంబ్లీకి మాత్రం రారు : తుమ్మల

 హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నల్గొండకు పోయే ఓపికుందిగానీ.. ఇంటి పక్కనే ఉన్న అసెంబ్లీకి మాత్రం కేసీఆర్​రావడం లేదని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న సభలో ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం లేకనే అసెంబ్లీకి రావట్లేదన్నారు. కేసీఆర్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. 

తనకు ఓటేసినంత కాలం ప్రజలు తెలివైనోళ్లు.. వేయకుంటే మూర్ఖులు అన్నట్టుగా కేసీఆర్​ మాట్లాడుతున్నారన్నారు. పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును ఎన్నుకున్నారంటూ మాట్లాడి కేసీఆర్ తన నియంతృత్వ పోకడలను మరోసారి చాటుకున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై రాష్ట్ర వాటాను వదులుకున్నది కేసీఆరేనని మండిపడ్డారు.