ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్​ గుడ్​న్యూస్​

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్​ గుడ్​న్యూస్​

ప్రజలకు నేను అప్పీలు చేస్తా ఉన్న. సంస్థ మనది, కార్మికులు కూడా బతకాలె. కొంత బస్సు చార్జీల భారం కూడా పెంచుతం. కిలోమీటర్ కు 20 పైసలు పెంచినట్లయితే.. సంవత్సరానికి రూ. 752 కోట్ల అదనపు ఆదాయం టీఎస్ ఆర్టీసీకి వస్తది. ఇది కొంత నష్టాన్ని కూడా పూడుస్తది. సోమవారం నుంచి చార్జీలు పెంచుకోవచ్చని ఆర్టీసీ ఎండీకి ఉత్తర్వులు జారీ చేస్తున్నం. – సీఎం కేసీఆర్​

ఎటువంటి కండీషన్లు పెట్టం.. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్​ గుడ్​న్యూస్​

కిలోమీటర్​కు 20 పైసల చొప్పున బస్సు చార్జీల పెంపు.. సోమవారం నుంచే అమలు

ఆర్టీసీకి వెంటనే రూ. 100 కోట్లు ఇస్తం

చార్జీల పెంపుతో మరో రూ. 752 కోట్ల ఆదాయం

చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సాయం
వారి ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం

యూనియన్లతో మాట్లాడేది లేదు

కార్మికుల మరణానికి అవే కారణం

కార్మికులనే ప్రగతిభవన్​కు పిలిచి మాట్లాడుత

ప్రతి డిపోకు వర్కర్స్ వెల్ఫేర్​ కౌన్సిల్​ పెడుతం

సమ్మె ఇల్లీగలే..  లేబర్​ కోర్టు డిక్లేర్​ చేయనక్కర్లే

ప్రతిపక్ష నేతలు ఆర్చెటోళ్లు కాదు.. తీర్చెటోళ్లు కాదు

లెక్కలు తీస్తున్నం.. కేంద్రం ఇవ్వాల్సింది 22వేల కోట్లు

కేంద్రంపై కోర్టుకు వెళ్తం.. నోటీసులు ఇస్తం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులందరూ శుక్రవారం డిపోలకు వెళ్లి డ్యూటీలో జాయిన్​ కావాలని సీఎం కేసీఆర్​ అన్నారు. వారికి ఎలాంటి షరతులు విధించడం లేదని చెప్పారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీకి వెంటనే ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. సంస్థకు అదనపు ఆదాయం కోసం కిలో మీటర్​కు 20 పైసల చొప్పున బస్సు చార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచే ఇది అమలు చేసుకోవచ్చని ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీకి ఆయన సూచించారు. యూనియన్లది ఉన్మాదమని, యూనియన్లతో తాము మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ  చలిమంటలు కాచుకుంటున్నాయని విమర్శించారు. సమ్మె ఇల్లీగలేనని, లేబర్​ కోర్టు డిక్లేర్​ చేయాల్సిన అవసరం లేదని, తమను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తామని, నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. గురువారం సీఎం కేసీఆర్​ అధ్యక్షతన ప్రగతిభవన్​లో రాష్ట్ర కేబినెట్​ సమావేశం జరిగింది. శుక్రవారం కూడా సమావేశం జరుగనుంది. తొలిరోజు భేటీలో ప్రధానంగా ఆర్టీసీ, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు సీఎం కేసీఆర్​ మీడియాతో మాట్లాడారు. కేబినెట్​ నిర్ణయాలను ప్రకటించారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

పేదల పొట్ట కొట్టలే

ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని ఈ రోజు కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నం. కార్మికులకు ఒక్కటే మనవి చేస్తున్నం. ఎప్పుడు చెప్పినా మేం బాధ్యతతో చెప్పినం. ప్రజల పొట్టలు నింపినం తప్ప.. ఎవరి పొట్టలు కొట్టలే. మచ్చుకు ఒక రెండుమూడు చెప్పుకున్నా..  హైఎస్ట్​ పెయిడ్​ అంగన్​వాడీ టీచర్లు ఎక్కడ ఉంటరంటే.. మొత్తం భారతదేశంలో తెలంగాణలోనే ఉంటరు. హైఎస్ట్​ పెయిడ్​ హోంగార్డులు ఎక్కడ ఉంటరంటే తెలంగాణలే ఉంటరు. అతి ఎక్కువ జీతాలు పొందే ఆశావర్కర్లు  ఇక్కడే ఉంటరు. ట్రాఫిక్​ పోలీసులకు రిస్క్​ అలవెన్స్​ బేసిక్​ సాలరీలో 30శాతం ఇచ్చేది ఒక్క తెలంగాణనే. ఒంటరి మహిళలకు పెన్షన్​ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే. బీడీ కార్మికులకు కూడా పెంచన్​ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణే. ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్​ల కూడా ఇస్తలేరు. ఇట్ల చెప్పుకుంటే మస్తున్నయి. పేదల పొట్ట నింపినం కానీ.. పేదల పొట్ట కొట్టలే.

చాన్స్​ ఇవ్వాలనుకున్నం

ఈ రోజు కేబినెట్‌‌లో చర్చ చేసినం. మినిస్టర్స్‌‌ అందరు కూడా.. ఎన్నో సంస్థలను కాపాడినం, ఎంతోమందికి అన్నం పెట్టినం, వీళ్లను బజార్ల పడేసి మనం చేసేది ఏముంటదన్నరు. ఒక ఛాన్స్‌‌ ఇచ్చి చూద్దామన్నరు. సస్తే సస్తరు.. బతికితే బతుకుతరు మనకు సంబంధం కాదన్నరు. మనం అయితే మానవతా దృక్పథంతో  చాన్స్​ ఇద్దామని చెప్పిన్రు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ఆర్టీసీ పక్షాన చెబుతున్నా ఇప్పటికైనా మీరు(కార్మికులు) రియలైజ్‌‌ కాండి. మీరింకా బజార్లపడి ఖతమైపోతం అనే అవసరం లేదు. ఆర్టీసీకి ఆదేశాలిస్తం. ముందు ప్రెస్‌‌కాన్ఫరెన్స్‌‌లోనే చెప్తున్న. అందరికందరూ కార్మికులు రేపు పొద్దగాల(శుక్రవారం) హ్యాపీగా డ్యూటీల జాయిన్‌‌కాండి. చేర్చుకోవాలని ఇప్పుడే ఐదునిమిషాల్లో లిఖితపూర్వక ఉత్తర్వులు ఆర్టీసీకి ఇస్తం. మీ సంస్థ బతకాలె. మీరు బతకాలే. అదే మేం కోరుకుంటున్నం. మేం డూప్లికేట్‌‌ మాటలు చెప్పం. అలవాటు అట్ల లేదు. హైకోర్టు సీజే గారు ఆర్టీసీకి రూ. 40 కోట్లు ఇవ్వమంటే మేం ఇవ్వలే. నిజంగా కూడా పరిస్థితి బాగా లేదు. ఆర్థిక మాంద్యం ఉంది. అయినప్పటి కూడా మీరు(కార్మికులు) ఈ రెండు నెలలు సంస్థను ఆగం చేసుకున్నరు. ఆర్టీసీల బ్యాలెన్స్​ ఎంతుందంటే.. రూ. 13 కోట్లు ఉందని ఎండీ చెప్పిండ్రు.  ఇవాళ అందరికందరు సంతోషంగా జాయిన్​కండి  మీ ఉద్యోగాలు కాపాడుకోండి. మంచిగ బతుకుండ్రి. మిమ్మల్ని చెడిపోమ్మంటలేం. గవర్నమెంట్​ నుంచి రేపు తెల్లారేకల్ల ప్రత్యేకంగా రూ. 100 కోట్లు ఇస్తం. అంతవరకే ఊకోం.

మమ్మల్ని ఏం చేయలేరు.. సమ్మె ఇల్లీగలే

ఆర్టీసీ సమ్మెపై లేబర్​ కోర్టుకు రెఫర్​ చేయాలని హైకోర్టు మమ్మల్ని ఆదేశించింది. టైం ఉంది మాకు ఇంకా. వీ కెన్​ డెఫినెట్లీ​ డూ దట్​. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. రూల్స్​ ఉన్నయ్​. సెక్షన్​ 22‌‌‌‌-1ఏ, 1 బీ ప్రకారం కార్మికులు ఆల్​రెడీ ఇల్లీగల్​ సమ్మెలో ఉన్నరు. ఏ లేబర్​​ కోర్టు డిక్లేర్​ చేయాల్సిన  అవసరం లేదు. కార్మికులకు అతి కల్పించింది, అతిచేసిందంతా యూనియన్​ నాయకులు, ప్రతిపక్షాల నాయకులే. ఇవాళ ఎవరు కాపాడుతరు? మేం చేయచ్చు.. అనుకుంటే ఒక్క క్షణంలో లేబర్​ కోర్టుకు రిఫర్​  చేస్తే అంతా అయిపోతది. ఆటోమెటిక్​గా ఆర్డర్స్​ కూడా డిక్లెర్​ చేస్తరు. తర్వాతేంది? చాలా ఇబ్బందులస్తయ్​. కార్మికుల బతుకులు పోతయ్​. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాల? ఏం అవసరం ఉంది. మేం కార్మిక నాయకుల పొట్టగొడుతమా, వారి ఉద్యోగాలు తీసేస్తమా.. ఇంకోటి తీస్తమా?

మొన్న సీజే కూడా నాకు చెప్పిండ్రు

నిజంగా కార్మికుల గురించి కొంచెం సిన్సియర్‌‌గా ఆలోచించిన వాళ్లు ఎవరన్నా ఉన్నరంటే మన హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ గారే ఉన్నరు. నాకు మొన్న రాజ్‌‌భవన్‌‌లో కలిసినప్పుడు కూడా అన్నరు. వారు పూర్‌‌ వర్కర్స్‌‌ అండీ.. వాళ్లను బతికించే ప్రయత్నం చేయండి అని చెప్పిన్రు. ఆయన బెంచ్‌‌మీద కూడా చెప్పిండు. రాజ్‌‌భవన్‌‌ల కల్సినప్పుడు కూడా చెప్పిండు. వాడెవడో వీడెవడోగానీ అమాయకులు పీకుతరు అని కన్సర్న్‌‌ చూపిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నరంటే చీఫ్‌‌ జస్టిసే. అతిగా ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన పరిధిలో ఉన్న ఆదేశాలు ఇచ్చిండు. అంతకంటే ఏం చేస్తరు.

కార్మికులతో నేనే మాట్లాడుత

వీలైనంత త్వరలో స్వయంగా కార్మికులను పిలిచిపించుకుని మాట్లాడతా.. ఉద్యోగ భద్రత, హెరాస్‌‌మెంట్‌‌ లేకుండా చూస్తం. క్రమశిక్షణారాహిత్యంతో మేం చెడగొట్టుకుంటాం..  కాపాడండి అంటే దేశంలో మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఒక పెద్దన్నగా తెలంగాణ బిడ్డగా కాపాడే ఉద్దేశం నాకుంది. నెక్ట్స్‌‌ ఐదారు రోజుల్లో నాకు ఢిల్లీ కూడా పోవాల్సిన అవసరం ఉంది. ప్రధాన మంత్రిని కూడా కలవాలె. రేపటికి ఫైనల్‌‌ అయితది. ఐఐఎం గురించి ఫైల్‌‌ ఫైనల్‌‌ అయిందని తెలిసింది. ఢిల్లీ వెళ్లేలోగా కాని,  వచ్చాక గానీ ఈచ్‌‌ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ప్రగతిభవన్​కు పిలిచి నేనే స్వయంగా మాట్లాడుతా. ఇక్కడికే ప్రగతి భవన్‌‌కు పిలిపిస్తా. అసలు ఏంది. ఏ జరుతాంది.. ? అని వాళ్లతో మాట్లాడుత. ఆర్టీసీ పూర్తి వివరాలు, ఆర్థిక వివరాలు అన్ని విషయాలు ప్రింట్‌‌ కొట్టించి కార్మికులందరికి ఇస్తం. వాటిని చూసి కార్మికులు వాస్తవాలు తెలుసుకొని.. మెంటల్‌‌గా ప్రిపేర్‌‌ అయ్యి మీటింగ్‌‌కు రావాలె. అందరం కలిసి మంచిగ మాట్లాడి భోజనం చేసి నిర్ణయం తీసుకుందాం. ఆర్టీసీ, ప్రజల కోసం మంచిగ కంబైన్డ్‌‌ నిర్ణయం తీసుకుందాం. కార్మికులను కాదని మేం ఏ నిర్ణయం తీసుకోదల్చుకోలేదు. యూనియన్లను మాత్రం సంప్రదించం. యూనియన్లను మీటింగ్​కు రానివ్వం. ఇంత చెడగొట్టి, నాశనం చేసి, వాళ్ల బతుకులు బజారులేసి, పది, పంతొమ్మిది మంది చనిపోవడానికి కారణమైన యూనియన్లను మేం క్షమించదల్చుకోలె. వాళ్లు ఏమన్నా అనుకోని.

వర్కర్స్‌‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌‌ పెడ్త

మాకు మానవత్వం ఉంది. ఎవరైతే కార్మికులు చనిపోయారో వాళ్ల కుటుంబంలో ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇస్తం. ఆర్టీసీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఇస్తం. వంద శాతం ఆ కుటుంబాలు.. మా కుటుంబాలే.. మా బిడ్డలే. వాళ్లను కాపాడుకుంటం. కడుపులో పెట్టుకుంటం. వాళ్లకు తక్షణ సాయం కూడా చేస్తం. మమ్మల్ని తిట్టిండ్రు..నిందించిన్రు. అవన్నీ పట్టించుకోదల్చుకోలె. ఏదో చిల్లరగాడు చెప్తే మాకు తేడా వచ్చిందిలేదు. వాళ్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండ్రు. ఎమర్జెన్సీ విధిస్తరు. బొందపాలన వస్తది అని మాట్లాడిన్రు. వీ డిడ్‌‌నాట్‌‌ కేర్‌‌. పెద్ద బాధ్యతలో ఉన్నవాళ్లం చిల్లర మాటలను పట్టించుకోం. అంత చీప్‌‌గా వ్యవహరించం. అది ధర్మం కాదు. క్రమశిక్షణతో ఉంటే సింగరేణిని ఏ విధంగా తెచ్చినమో తెలుసు కదా. మొన్న సంతోషంగా వాళ్లు లక్షా 60 వేలు తీసుకున్నరు. ఏ యూనియన్‌‌ సాయం చేయదు. యూనియన్‌‌ లేకుంటే ఎట్ల అని ఆర్టీసీ కార్మికులు అనుకుంటరు.. మేం బాండెడ్‌‌ లేబర్‌‌గా ఉండాల్నా, యాజమాన్యం హెరాస్‌‌మెంట్‌‌ చేస్తరనుకుంటున్నరు.  నాక్కూడా తెలుసు ఆ బాధ. డిపో నుంచి ఇద్దరు చొప్పున వర్కర్స్‌‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌‌ పెడ్త. దానికి సీనియర్‌ మినిస్టర్‌‌ను ఇన్‌‌చార్జిగా పెడ్తం. ప్రతి నెల యథావిధిగా ఫిక్స్‌‌డ్‌‌ డేట్‌‌లో సమావేశం పెట్టే ఏర్పాటు చేస్తం. మేనేజ్‌‌మెంట్‌‌ వేధించకుండ చూస్తం. సంస్థ బతకడం ఇంపార్టెంట్‌‌. సంస్థ మనుగడలో మీ(కార్మికుల) బతుకుదెరువు ఉన్నది.

ప్రతిపక్షాలను నమ్మొద్దు

ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు నమ్మి పెడదారి పడుతున్నరు. వాళ్లు చెడిపోతున్నది కూడా అక్కడ్నే. లేని టెన్షన్​కు కూడా గురవుతున్నది అక్కడ్నే.  ప్రధానమైన ప్రాబ్లమ్‌​ అదే. దాని వల్లే ఈ రోజు అనాలోచిత సమ్మె. దాని వల్లే ఈరోజు అసంబద్ధ డిమాండ్లతో కూడిన అనాలోచిత సమ్మె. దీనికి పూర్తి బాధ్యత వాళ్లే వహించాల్సి ఉంటది.  ఇది 100 శాతం చరిత్రలో ఉంటది. దీనికి ఇగ పనికిమాలినోళ్లు.. ఏదెక్కడా లేనోళ్లు టెంటు కనబడితే చాలు ఉపన్యాసం చెప్పే బాపతుగాళ్లు ఉంటరు.  పాపం రాజకీయ నిరుద్యోగులు వాళ్లు. బీజేపీ, కాంగ్రెస్​ పాలించే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆర్టీసీని ప్రభుత్వంల విలీనం చేయలే. ఆ పార్టీల నాయకలు మాత్రం ఇక్కడ విలీనం చేయాలని మాట్లాడుతరు. ఒక అర్థం పర్థం తాత్పర్యం ఏమీ లేకుండా మాట్లాడుతరు. డిమాండ్​ చేస్తే అర్థం ఉండాలె. వాళ్ల వల్ల పర్యవసానం ఏమైంది? వాళ్లు జబ్బలు చరిచి ఇటు చరిచి అటు చరిచి.. ఆర్టీసీ కార్మికుల బతుకులు బజార్ల పడెటట్లుచేసిండ్రు. వాళ్ల వల్ల కార్మికుల రెండు నెలల విలువైన రోజులు పోయినయి.. రెండునెలల జీతాలు పోయినయ్​. కార్మికులు టెన్షన్​కు కూడా గురైండ్రు. ఇవాళ ఉద్యోగం ఉంటదో పోతదో తెల్వదు. డ్యూటీలో జాయిన్​ కావాలని నేను అప్పట్లనే కార్మికులకు చెప్పిన. ప్రతిపక్షాలు మాటలు నమ్మొద్దని చెప్పిన. రాజకీయం కోసం, ఓట్ల కోసం వీళ్లు(ప్రతిపక్షాలు) చలిమంటలు కాచుకుంటరని చెప్పిన. రేపు ఏదైనా జరగరానిది జరిగితే అయ్యో సారీ ఇట్ల ఐతదనుకోలేదు అని టాటా చెప్పి పోతరు తప్ప వీళ్లేం బాధ్యత వహించరు. వీళ్లది నెత్తికాదు.. నా కత్తి కాదు. వట్టిగ టెంట్‌‌ వేస్తే వచ్చి మాట్లాడిపోతరు తప్ప వీళ్లు ఏమీ ఆర్చేటోళ్లుకాదు తీర్చేటోళ్లు కాదు. లాస్ట్​ టైమ్​ ఇదే విపులంగా చెప్పిన. కార్మికులకు ప్రతిపక్షాల నాయకులు లేనిపోని భరోసా కల్పించిండ్రు.. లేనిపోని అనవసరమైన ఆశలు కల్పించిండ్రు. తప్పుడు మాటలు చెప్పిండ్రు. వీళ్లకు అనసవర ఆశలు కల్పించిండ్రు. కార్మికులను బజార్ల పడేసిండ్రు.

ఢిల్లీ ఎల్లయ్య ఏం జేస్తడు?

ఇక్కడా ఓ కేంద్ర మంత్రి ఉన్నరు బీజేపీ ఆయన. ఇద్దరో ముగ్గురో ఎంపీలు ఉన్నరు. ఆయనగాక ముగ్గురు కదా.. మొత్తం నలుగురు ఉన్నరు. ఈ నలుగురికి నలుగురు మొన్న పార్లమెంట్​ బడ్జెట్​ సెషన్‌‌లో రవాణా చట్టానికి ఓటేసిన్రు. రేపు వీళ్లు చెప్పాల ప్రజలకు. దమ్కీ మాట్లాడటం కాదు. అడ్డంపొడుగు మాట్లాడటం కాదు. మీరు ప్రైవేటైజేషన్‌‌ చేయడానికి రవాణా చట్టానికి ఓటేశారా లేదా? పార్లమెంట్‌‌లో ఓటేస్తరు.. ఇక్కడొచ్చి దమ్కీలు కొడ్తరా? ఏది కరెక్ట్‌‌ అన్నట్లు.. ఇంత ఆత్మవంచననా? ఎవర్ని మోసం చేయాలి? ఇంక కూడా కార్మికులను మభ్యపెడుతున్నరు. ఢిల్లీకి తోల్కపోతమని కార్మికులతో అంటున్నరు. ఎవలో ఎల్లయ్యతో అపాయింట్​మెంట్​ ఇప్పిస్తమంటున్నరు. ఢిల్లీ ఎల్లయ్య ఏం జేస్తడు ఈడ. ఏముంటది వాళ్ల చేతుల? నాకర్థం కాదు.

ప్రైవేట్‌‌ అని సన్నాసులు ప్రచారం చేసిండ్రు

బస్సులు ప్రైవేట్‌‌ చేస్తమని మేం అనుకున్నది వేరు. బయట ఈ సన్నాసులు ప్రచారం చేసింది వేరు. యాక్చువల్లీ మాకు సంపూర్ణ అధికారం ఉంది. మేం పెట్టవచ్చు. మేం పర్మిషన్లు ఇయ్యొచ్చు. అంత అర్జెంట్‌‌గా పర్మిషన్లు ఇయ్యాల్సిన అవసరం మాకు లేదు. కక్షపూరితంగా సాధించాల్సిన ఉద్దేశాలు కూడా ప్రభుత్వానికి లేదు. రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలె. ఈ ప్రైవేట్‌‌ పర్మిట్లు ఇచ్చినట్లయితే ఎవరికిద్దాం? పెట్టుబడిదారులకు ఇయ్యదల్చుకోలే, షావుకార్లకు ఇయ్యదల్చుకోలే. ఒక వేళ సంస్కరణలు తెస్తే ఆర్టీసీలో కొద్ది మంది ఎంప్లాయీస్‌‌ వీఆర్‌‌ఎస్‌‌ తీసుకుంటే నలుగురు ఐదుగురు కలిస్తే.. వాళ్లకే ఇద్దాం అనుకున్నా ఈ పర్మిట్లు కూడా. అంత గొప్పగా పోదాం అనుకున్నం. దురుద్దేశపూర్వకంగా అనుకోలే.

యూనియన్లది ఉన్మాదం

ఈ రియలైజేషన్‌‌ రావాలనే నేను కఠినంగా వ్యవహరించిన. ఇది ఎవరికీ తెలియదు. గతంలో 20 ఏళ్ల కిందనే రవాణా శాఖ మంత్రిగా మూడేండ్లు ఉన్న. అప్పుడు ఆర్టీసీ 13.80 కోట్ల నష్టాల్లో ఉండేది. కానీ కాలికి బట్టగట్టకుండా జిల్లాలు తిరిగి, బస్టాండ్ల టాయిలెట్స్‌‌ ఎట్లున్నయో పరిశీలించి స్థితిగతులు మార్చిన. నష్టాన్ని పూడ్చి, మరో 14.50 కోట్ల లాభం తెచ్చిన. ఇది ఆర్టీసీ రికార్డుల్లో ఉంది. గతంలో రామారావు అనే వ్యక్తి ఉండే. సడన్‌‌గా స్ట్రైక్‌‌ అనౌన్స్‌‌ చేసిండు. 11 రోజులు సమ్మె చేసిండు. దీంతో మేం వేరే బస్సులు పెట్టి మేనేజ్‌‌ చేసినం. తర్వాత నన్ను కలవడానికి రామారావు వస్తే అడిగిన.. ఎందుకు చేసినవయా సమ్మె అని.. యూనియన్‌‌ బతకడానికి చేసిన అని చెప్పిండు. నీ యూనియన్​ బతకాలంటే ఆర్టీసీ బతకాలి కదా ఫస్ట్​ అన్న. ఇప్పుడూ యూనియన్లది అదే ఉన్మాదం. బతుకులను ఆగం చేసుకోవద్దు.అద్భుతమైన ఆర్టీసీని నడుపుదాం. మంచిగ జరగాలనే కోరుకుంటం. శుక్రవారం ఫస్ట్‌‌ అవరల్‌‌లోనే జాయిన్‌‌ అవ్వండి. ఇన్ని రోజులు పనిచేసిన టెంపరరీ ఉద్యోగులకు థ్యాంక్స్‌‌. త్వరలోమీకు కూడా ఏదో చేస్తా. ఏడాదికి 50 వేల బోనస్‌‌ సంపాదించేలా చేస్తం.

సోమవారం నుంచి చార్జీల పెంపు

ప్రజలకు కూడా నేను అప్పీలు చేస్తా ఉన్న. టీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక సారి చార్జీలు పెంచినం. నాలుగైదేండ్ల నుంచి రూపాయి కూడా చార్జి పెంచలే. సంస్థ మనది, కార్మికులు కూడా బతకాలె, వాళ్లు కూడా మనలో భాగమే. కొంత చార్జీల భారం కూడా పెంచుతం. తప్పకుండా కిలోమీటర్​కు 20 పైసలు పెంచినట్లయితే.. సంవత్సరానికి రూ. 752 కోట్ల అదనపు ఆదాయం టీఎస్​ఆర్టీసీకి వస్తది. ఇది కొంత నష్టాన్ని కూడా పూడుస్తది. ఈ సాయం కూడా ఆర్టీసీకి చేస్తున్నం. చార్జీలు పెంచుకోవాలని ఇప్పుడే లిఖితపూర్వకంగా ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు ఇస్తున్నం. వచ్చే సోమవారం నుంచి చార్జీలు పెంచుకోవచ్చని ఆర్టీసీ ఎండీకి ఉత్తర్వులు జారీ చేస్తున్నం. దీన్ని మళ్లా  కార్మికులు అలుసుగా తీసుకుంటే మళ్లా కార్మికులే మునుగతరు. బాధ్యత గల ముఖ్యమంత్రిగా, తెలంగాణ బిడ్డగా మిమ్ముల్ని మా బిడ్డలుగా భావించి మీరు రోడ్డున పడొద్దని చెప్తున్న. జాయిన్​కాండి. మీకు ఎటువంటి కండిషన్లు పెట్టం.