మహిళనని వివక్ష చూపిస్తున్నరు.. అవమానిస్తున్నరు

మహిళనని వివక్ష చూపిస్తున్నరు.. అవమానిస్తున్నరు
  • రాజ్ భవన్ అంటరానిదా?
  • సీఎం, మంత్రులు ఎందుకు రారు?
  • గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోను
  • ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు సేవ చేస్తానని స్పష్టీకరణ: గవర్నర్ ​తమిళిసై 
  • రాష్ట్ర గవర్నర్​గా మూడేండ్లు పూర్తిచేసుకున్న తమిళిసై

హైదరాబాద్, వెలుగు: ‘‘రాజ్‌‌భవన్‌‌ ఏమన్నా అంటరానిదా..? సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు రావట్లేదు?’’ అని గవర్నర్‌‌ తమిళిసై ప్రశ్నించారు. ఎట్​ హోంకు ఆహ్వానిస్తే ముందుగా వస్తామని చెప్పి తర్వాత రాలేదని అన్నారు. మహిళను అయినందున తనపై వివక్ష చూపిస్తున్నారని, అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల కోసం పనిచేస్తానని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘సమస్యలను ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తే ప్రజలు నా దగ్గరికి (రాజ్‌‌భవన్‌‌) ఎందుకు వస్తారు?  మొన్నామధ్య వరదలు ముంచెత్తి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను నేను పరామర్శించేందుకు వెళ్తే కొందరికి బాధ్యత గుర్తుకువచ్చి బాధితుల వద్దకు వెళ్లారు” అని అన్నారు. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్‌‌, ఎస్పీ ఆహ్వానం పలకాల్సి ఉన్నా.. పలకడం లేదని చెప్పారు.

సదరన్ కౌన్సిల్‌‌ మీటింగ్​కు సీఎం ఎందుకు పోలే?

‘‘కేంద్రం తెలంగాణ సమస్యలను పట్టించుకోలేదని అంటున్నరు. అలాంటివేమైనా ఉంటే ఇటీవల తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్‌‌ కౌన్సిల్ మీటింగ్‌‌కు వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌ షాను ప్రశ్నించొచ్చు కదా?’’ అని గవర్నర్​ తమిళిసై అన్నారు. సదరన్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్​కు సీఎం ఎందుకు వెళ్లలేదని ఆమె ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు ఈ మీటింగ్‌‌కు వచ్చి తమ డిమాండ్లను కేంద్రం ముందు పెట్టారని, తాను పుదుచ్చేరి లెఫ్టినెంట్‌‌ గవర్నర్‌‌గా ఆ సమావేశానికి వెళ్లానని తెలిపారు. ఆ మీటింగ్‌‌లో 75 శాతం తెలుగు రాష్ట్రాల సమస్యలే ప్రస్తావనకు వచ్చాయని చెప్పారు. తాను రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి అక్కడ రాష్ట్ర సమస్యలు ఎలా ప్రస్తావిస్తానని అన్నారు.

ఎవరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోనని ఆమె చెప్పారు.  గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం రాజ్‌‌భవన్‌‌లో  “రీ డిస్కవరీ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్‌‌లెస్ సర్వీస్ ” కాఫీ టేబుల్‌‌ బుక్​ను రిలీజ్‌‌ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌‌ మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మూడేండ్ల పదవీకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లానని అన్నారు. పేదల కోసం రాజ్‌‌భవన్‌‌ తలుపులు తెరిచి ప్రజాభవన్‌‌గా మార్చానని చెప్పారు. తాను ఏం మాట్లాడినా రాజకీయం అంటున్నారని, సోషల్‌‌ మీడియాలో ట్రోల్‌‌ చేస్తున్నారని తమిళిసై మండిపడ్డారు. తనకు పర్సనల్‌‌గా గౌరవం ఇవ్వాలని కోరడం లేదని, గవర్నర్‌‌  చైర్‌‌కు మర్యాద ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. రాజ్ భవన్‌‌లో సీఎం కేసీఆర్ ఫొటో పెట్టలేదని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘‘ఫొటో పెట్టకపోవటం వల్లనే సీఎం రాజ్ భవన్‌‌కు రావట్లేదా..? వెంటనే ఫొటో ఏర్పాటు చేస్త. సీఎం వస్తరా?’’ అని గవర్నర్​ అన్నారు.  

నేను తెలుసుకున్నంత వరకు సెప్టెంబర్​ 17 తెలంగాణ లిబరేషన్​ డే

మహిళా దర్బార్‌‌ నిర్వహించినా, ప్రజల వద్దకు వెళ్లి నా వారికి సేవ చేయడానికే తప్ప తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని తమిళిసై స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడనని.. తన పని తాను చేసు కుంటూ వెళ్తానన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమ చరిత్రను తాను అధ్యయనం చేశానని, తాను తెలుసుకున్నంత వరకు సెప్టెంబర్‌‌ 17 తెలంగాణ లిబరేషన్‌‌ డే అని ఆమె పేర్కొన్నారు. 

వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన

ఇటీవల వరదలకు రాష్ట్రంలో ఏర్పడిన నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు గవర్నర్​ తెలిపారు. రాష్ట్రపతి,  ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసినప్పుడు ప్రజా సమస్యలే నివేదించానన్నారు. ప్రొటోకాల్, రాష్ట్రంలో తనకు జరుగుతున్న అవమానాల వంటి చిన్న అంశాలను వాళ్ల దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పారు. పబ్లిక్ సమస్యలు తెలుసుకునేందుకే జిల్లాలకు వెళ్తున్నానని, ఇలాంటప్పుడు ప్రొటోకాల్‌‌ను పట్టించుకుంటే ఫోకస్ డైవర్ట్ అవుతుందన్నారు.  

సీఎం కేసీఆర్​ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన 

రాష్ట్రంలో పలు సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్​కు లేఖలు రాశానని గవర్నర్​ తమిళిసై తెలి పారు. ఇటీవల బాసర ట్రిపుల్‌‌ ఐటీలో  పర్యటించానని, అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రిపుల్‌‌ ఐటీ స్టూడెంట్స్ సమస్యలు విని చలించిపోయానని అన్నారు. పలు వర్సిటీల విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యానని, వారి ఇబ్బందులు తెలుసుకున్నానని చెప్పారు. 

రాష్ట్రంలో హాస్పిటళ్లు బాగాలేవు

రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరు బాగోలేదని, వాటిలో వసతులు మెరుగు పర్చాల్సి ఉందని గవర్నర్​ అన్నారు. ప్రభుత్వాస్పత్రి పెద్దాఫీసర్​ తనకు వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్‌‌కు వెళ్లటం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు. గురుకుల స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. చాలా చోట్ల ఎలుకల దాడితో స్టూడెంట్స్ గాయపడటం బాధాకరమనని ఆవేదన వ్యక్తం చేశారు.  

గవర్నర్‌‌కే కరోనా నిబంధనలా?

రిపబ్లిక్‌‌ డే వేడుకలు రాజ్‌‌భవన్‌‌లోనే నిర్వహించాలని కేబినెట్‌‌ తీర్మానం చేయడంపై గవర్నర్‌‌ అసహనం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో రిపబ్లిక్‌‌ డే వేడుకలు బయటే నిర్వహించారని, తెలంగాణలో మాత్రమే కరోనా నిబంధనల పేరిట రాజ్​భవన్​కు పరిమితం చేశారని మండిపడ్డారు. ఎక్కడా లేని కరోనా నిబంధనలు గవర్నర్​కేనా అని ప్రశ్నించారు. పరేడ్‌‌లో గౌరవ వందన స్వీకరించడం గవర్నర్‌‌గా తన కోసం కాదని, అది రాష్ట్ర ప్రజలకే గౌరవప్రదమన్నారు. గవర్నర్​కు ఎదురైన అవమానాలు తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని, ఇది వాంఛనీయం కాదని చెప్పారు. తాను గవర్నర్‌‌గా వచ్చిన కొత్తలో కేసీఆర్ రాజ్‌‌భవన్‌‌కు వచ్చారని, ఆ టైంలో ప్రభుత్వ హాస్పిటళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరానని అన్నారు.

గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నరు. రాజ్యాంగబద్ధంగా గవర్నర్‌‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలోనూ నాపై ఇష్టమున్నట్లు విమర్శలు చేస్తున్నరు. జిల్లాల పర్యటనకు వెళ్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తున్నరు. గవర్నర్​కు ఎదురైన అవమానాలు తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. ఇది వాంఛనీయం కాదు. నేను రాజకీయాల కోసం పర్యటనలు చేయటం లేదు. సేవ చేయడానికే  ప్రజల వద్దకు వెళ్తున్న. 
- గవర్నర్​ తమిళిసై

ఏ పార్టీ వాళ్లు అడిగినా అపాయింట్​మెంట్​ ఇచ్చా

మూడేండ్లలో 50 వేల మంది వివిధ సందర్భాల్లో రాజ్ భవన్‌‌ వచ్చారని తమిళిసై  తెలిపారు. అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చానని, అన్ని పార్టీల నేతలు తనను కలిశారన్నారు. రాజ్ భవన్ స్కూల్ పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించానన్నారు. 

మేడారానికి కారులో 8 గంటలు ప్రయాణించా

మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెలిక్యాప్టర్‌‌ అడిగితే ఇవ్వలేదని, గిరిజనులకు భరోసానిచ్చేందుకు.. వారికి అండగా నిలిచేందుకు కారులో 8 గంటలు ప్రయాణించి మేడారం చేరుకున్నానని గవర్నర్​ తెలిపారు. రాజ్​భవన్​లో మహిళా దర్బార్‌‌, విద్యార్థుల పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించానని గుర్తుచేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తన వంతు సాయం అందించానని తెలిపారు. వరద బాధితులు ఇండ్లు కావాలని తనను అడిగారని, తాను ఇవ్వగలనా? అని ప్రశ్నించారు. ఆదివాసీలు, గిరిజనుల ఆర్థిక పరిపుష్టత కోసం పనిచేశామన్నారు. పేదలపై ప్రేమతోనే ఇవన్నీ చేశాను తప్ప రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. మహిళనైనా తాను పురుషుడిలా పనిచేస్తున్నానని, అందుకే తనను కించ పరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇవాళ గవర్నర్​ సీటులో నేను ఉండొచ్చు.. రేపు వేరొక్కరు ఉండొచ్చు.. కానీ, గవర్నర్​ సీటుకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఎట్లా?” అని ప్రశ్నించారు.