కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది

కేసీఆర్ గ్రాఫ్  పడిపోతోంది

అవినీతి పాలన సాగిస్తున్న  కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందని.. రోజురోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.  కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి పంపడం బీజేపీకే సాధ్యమన్నారు.  బీజేపీ  శ్రేణులు ఈ దిశగా సమాయత్తం అవుతున్నాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ శక్తికేంద్రాల ఇంచార్జిల సమావేశంలో వివేక్ వెంకటస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్  అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు.  సిరిసిల్ల పర్యటన లో మంత్రి కేటీఆర్ పై  రైతు చెప్పు విసరడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ కమీషన్లకు ఆశపడి.. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో రూ.లక్ష కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి మేఘా కృష్ణారెడ్డికి లాభం చేకూర్చాడని ఆరోపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల చెన్నూరు నియోజకవర్గం పరిధిలో 40వేల ఎకరాల పంట నష్టం జరుగుతున్నా.. రైతులను రాష్ట్ర సర్కారు  ఆదుకోవడం లేదని పేర్కొన్నారు.

‘‘తాడిచెర్ల ఓసీపీలో రూ.20వేల కోట్ల అవినీతి జరిగింది. టన్ను బొగ్గుకు రూ.700 ఇవ్వాల్సి ఉండగా , ఆంధ్ర కాంట్రాక్టర్ కు టెండర్  ఇచ్చి టన్నుకు రూ.3,200 ఇస్తూ దోచిపెడుతుండు’’ అని వివేక్ వెంకటస్వామి చెప్పారు.  కేంద్రం ఎప్పుడు కూడా సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ ను గెలిపించుకోవాలని సింగరేణి కార్మికులను కోరారు.  జూలై 2,3 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం,  బహిరంగ సభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.