కేసీఆర్, హరీశ్, చీఫ్ ఇంజినీర్లను.. జైలుకు పంపాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్, హరీశ్, చీఫ్ ఇంజినీర్లను.. జైలుకు పంపాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగింది
  • బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్ , వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని నాసిరకంగా కట్టి లక్ష కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేసిన కేసీఆర్​ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్​లో ఆయన మాట్లాడారు. కమీషన్ల కోసమే కేసీఆర్ నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడటం వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.లక్ష కోట్ల అప్పు తెచ్చి వృథా చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ.40 వేల కోట్లను అక్రమంగా దోచుకుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారకులైన కేసీఆర్, హరీశ్​రావు, చీఫ్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు.

ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు తరలి వెళ్లడానికి కారణం ఎమ్మెల్యే కోనప్ప అని ఆరోపించారు. ఎన్నికల రూల్స్​కు విరుద్ధంగా కోనప్ప అన్నదాన సత్రం నడిపిస్తున్నారని, దీనిపై ఎలక్షన్​ కమిషన్​ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచారంలో భాగంగా చీలపల్లి, పూసుగూడ, లింబుగూడ, మేడిపల్లిల్లో పర్యటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, మండల అధ్యక్షుడు బొడ్డు రవి, ఉపాధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఎంపీటీసీ నగరడే రాజు, ముత్తు పటేల్, చాంద్ పాషా, అస్లాం, భీమ్ రావు, దేవిదాస్, ప్రభాకర్ పాల్గొన్నారు.