
బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అవినీతి చిట్టాలతో బ్లాక్ మెయిల్ చేసి పార్టీ ఫిరాయింపులు చేయించింది కేసీఆరేనని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలో ఐదో రోజు కొనసాగుతున్న ‘ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర’లో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేరాఫ్ అడ్రస్ గా మారారన్నారు. ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరులు అవినీతికి పాల్పడితే చూసీ చూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలు టీఆర్ఎస్ ను పొగిడే స్థాయి నుంచి తిట్టే స్థాయికి వచ్చారని ఆయన చెప్పారు.
‘‘ బీజేపీలో సంస్థాగతంగా మార్పు వచ్చింది. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి, గెలుపు గుర్రాలకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి’’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి చెందిన డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీని వీడిన వారు రాజకీయ భవిష్యత్తును కోల్పోవడం ఖాయమని తెలిపారు. ‘‘రాష్ట్రంలో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లితే ఏరియల్ సర్వేకే పరిమితం అయ్యారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే దిక్కు లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.