దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు : కేసీఆర్

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు : కేసీఆర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు.  ఇది ప్రధాని మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని అన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు.  మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా  మారిందన్నారు . నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని విమర్శించారు.  పార్టీల మధ్య వైరుధ్యాలకు ఇది సందర్భం కాదన్న కేసీఆర్... దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆయనపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమేనని ఆరోపించారు. అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో రాహుల్ పై వేటు వేశారని కేటీఆర్ అన్నారు. ఇది తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ తత్తవేత్త వాల్ టేర్, జర్మన్ థియాలజిస్ట్ మార్టిన్ నిమాలర్ కోట్స్ ను మంత్రి కేటీఆర్ జత చేశారు. 

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించింది. ప్రధాని మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మార్చి 23న సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రాహుల్ గాంధీపై వేటు వేసినట్టు లోక్ సభ వెల్లడించింది. ఇక పార్టీ నాయకుడిపై ఈ రకమైన చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.