జ్యుడీషియల్​ కమిషన్​నే తప్పు పడ్తరా?

జ్యుడీషియల్​ కమిషన్​నే తప్పు పడ్తరా?
  • విద్యుత్​ రంగ నిపుణుడు వేణుగోపాల్ రావు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ అక్రమాలపై విచారణకు వేసిన జ్యుడీషియల్​ కమిషన్ నే కేసీఆర్ వ్యతిరేకించడం కరెక్ట్​ కాదని విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాల్ రావు అన్నారు. అడిగిన ప్రశ్నలకు కేసీఆర్​ తప్పకుండా సమాధానం ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. జ్యుడీషియల్​ కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని,  కమిషన్ వేయడం తప్పు అని కేసీఆర్ భావిస్తే కోర్టులో చాలెంజ్ చేసుకోవచ్చని ఆదివారం మీడియాతో అన్నారు. కానీ, కమిషన్ ను తప్పు బట్టే అధికారం కేసీఆర్​కు లేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణంపై కమిషన్ పూర్తి విచారణ చేయాల్సిన అవసరముందన్నారు. కేసీఆర్ రాసిన 12 పేజీల లెటర్​తో జ్యుడీషియల్​ కమిషన్ సంతృప్తి చెందకపోతే.. ప్రత్యక్షంగా కమిషన్​ ముందుకు విచారణ కోసం రావాలని ఆయనను పిలువొచ్చని తెలిపారు. ‘‘విద్యుత్ అధికారులను కమిషన్ విచారిస్తే... అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు చేశామని చెప్పారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్​ ప్రశ్నిస్తుంది” అని అన్నారు. కరోనా సాకుతో యాదాద్రి ప్లాంట్ లేట్ అయిందనడం వాస్తవం కాదని పేర్కొన్నారు. ‘‘భద్రాద్రి ప్లాంట్ నిర్మాణ ప్లాన్ సరిగా లేకపోవడం వల్ల ప్రభుత్వానికి భారీగా అనవసర ఖర్చు వచ్చింది. చత్తీస్ గఢ్​ జెన్కోతో పీపీఏ చేసుకోకుండా.. అక్కడి డిస్కంలతో విద్యుత్ కొనుగోలు చేశారు” అని వేణుగోపాల్​ రావు అన్నారు.