బొచ్చెడు తప్పులు.. పుట్టెడు అప్పులు పదేండ్లలో బీఆర్ఎస్ చేసిందిదే: సీఎం రేవంత్ రెడ్డి

బొచ్చెడు తప్పులు.. పుట్టెడు అప్పులు  పదేండ్లలో బీఆర్ఎస్ చేసిందిదే: సీఎం రేవంత్ రెడ్డి
  • ఉమ్మడి ఏపీలో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.72 వేల కోట్లే 
  • పదేండ్లలో కేసీఆర్ ఒక్కడు చేసిన అప్పు మాత్రం రూ.6.40 లక్షల కోట్లు
  • 2–3 శాతం మిత్తికే లోన్లు దొర్కుతుంటే 11 శాతం అధిక వడ్డీకి తెచ్చారు 
  • ప్రతీది అమ్మేసి, దివాలా తీయించారు
  • ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులను వేరే దేశాల్లో అయితే ఉరితీసేటోళ్లు 
  • వాళ్లు కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం 
  • మూసీ ప్రక్షాళన చేయాలో? వద్దో?ప్రజలను అడుగుదాం.. రావాలని సవాల్


హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిందేమైనా ఉందంటే, అది ‘బొచ్చెడు తప్పులు.. పుట్టెడు అప్పులు’ మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్లు చేసిన అప్పులు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో దాదాపు 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.72 వేల కోట్లు మాత్రమే. కానీ పదేండ్ల పాలనలో కేసీఆర్​చేసిన అప్పులు రూ.6 లక్షల 40 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు  తెచ్చిన అప్పులపై ఏడాదికి రూ.6,500 కోట్ల వడ్డీ కట్టేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ మొత్తం ఒక్క నెలకే కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్​పేపర్​ రిలీజ్ చేశామని ఆయన చెప్పారు. ‘‘మేం రిలీజ్ చేసిన వైట్ పేపర్ లో మార్కెట్ అప్పులు రూ.3 లక్షల 89 వేల 673 కోట్లుగా, కార్పొరేషన్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే అప్పును రూ.1,27,208 కోట్లుగా పేర్కొన్నాం. నిజానికి ఇది రూ.1,29,243 కోట్లుగా ఉంది. మరో రూ.95,462 కోట్ల అప్పుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా, అది కార్పొరేషన్లు చెల్లించేది. ఇక ఏ గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పు ఇంకో రూ.59,414 కోట్లు ఉంది” అని వెల్లడించారు.ఈ లెక్కన వైట్ పేపర్ లో పేర్కొన్నట్టు మొత్తం రూ.6 లక్షల 71 వేల 757 కోట్ల అప్పు ఉంది. వీటితో పాటు పెండింగ్ బిల్లుల బకాయిలు మరో రూ.40,154 కోట్లు ఉన్నాయి. 2023 డిసెంబర్ 7 నాటికి మా సర్కార్ నెత్తిన రూ.7,11,911 కోట్ల అప్పు పెట్టారు. 2014 కంటే ముందున్న అప్పులు, బకాయిలు రూ.72 వేల కోట్లు తీసేసినా... బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.6.40 లక్షల కోట్ల అప్పులు చేశారు” అని రేవంత్​ అన్నారు.

బీఆర్ఎస్ తీరుతో రాష్ట్రం దివాలా.. 

బీఆర్ఎస్ వాళ్లు కట్టింది కాళేశ్వరం కాదని, కూలేశ్వరం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో రూ.72 వేల కోట్ల అప్పులు చేసి గుడులు, బడులు, అనేక ప్రాజెక్టులు కట్టాం. కానీ బీఆర్ఎస్ హయాంలో మాత్రం కూలేశ్వరం కట్టారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి, దాని ద్వారా 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. దీనికి కరెంట్ బిల్లుల కిందనే రూ.10 వేల కోట్లు కట్టారు. మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఇంత చేసి ఇంకా బుకాయిస్తున్నారు” అని మండిపడ్డారు. ‘‘గత 11 నెలల్లో మేం రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిన్టటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అట్లయితే మొత్తం అప్పు రూ.8.38 లక్షల కోట్లు కావాలి. కానీ ప్రస్తుతం ఉన్న అప్పు రూ.7,22,788 కోట్లు. మరి మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి పోయాయో బీఆర్ఎస్​నేతలు చెప్పాలి” అని ప్రశ్నించారు. 

ప్రతీది అమ్మేశారు..  

పదేండ్లు పాలించిన పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘పాపాల భైరవులు రాష్ర్టాన్ని అమ్మేశారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ లోని భూములు, హైటెక్ సిటీ, వైన్ షాప్స్.. ఇలా ప్రతిదీ అమ్మేశారు. సహజ సంపదను కాంట్రాక్టుల పేరుతో కొల్లగొట్టారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప బ్యాంకులు 2, 3 శాతం వడ్డీకే అప్పులు ఇస్తున్నాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 శాతం మిత్తికి అప్పులు చేసింది. ఇంతటి ఆర్థిక నేరానికి పాల్పడిన ఆర్థిక ఉగ్రవాదులను దుబాయ్ లాంటి దేశంలో అయితే రోడ్డుపై నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేవాళ్లు. కొన్ని దేశాల్లో అయితే ఉరితీసేవారు” అని అన్నారు. తాము చెప్పిన గ్యారంటీలేవైనా అమలు చేయడం లేటైతే, ఆ పాపం బీఆర్ఎస్ నేతలదేనని అన్నారు.  

వడ్డీ రేట్లు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నం.. 

బీఆర్ఎస్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని, ఆ వడ్డీ రేట్లను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘20 సార్లు ఢిల్లీకి పోయాను. వడ్డీ రేట్లు తగ్గించాలని కేంద్రాన్ని కోరాను. నాలుగైదు శాతం వడ్డీ రేటు తగ్గినా, ఎన్నో స్కీమ్ లు అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది” అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క గురుకులానికీ బిల్డింగ్ కట్టలేదని మండిపడ్డారు. ‘‘జీవోలు ఇచ్చేసి, హాస్టళ్లు పెట్టేసి స్టూడెంట్ల జీవితాలతో బీఆర్ఎస్ నేతలు చెలగాటమాడారు. పదేండ్లలో ప్రగతి భవన్, సెక్రటేరియెట్, ఫామ్ హౌస్, 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. టీవీలు, పేపర్లు పెట్టుకున్నారు. వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్నారు. కానీ పేద పిల్లలు చదివే గురుకులాలకు మాత్రం బిల్డింగులు కట్టలేదు. పదేండల్లో ఎన్ని హాస్టళ్లు కట్టారు? ఒకసారైనా టైమ్​కు మెస్ చార్జీలు ఇచ్చారా? అసలు కాస్మోటిక్ చార్జీలు ఇచ్చారా? పదేండ్లలో కనీసం బాత్ రూములు కూడా కట్టివ్వలేదు. దీనికి సిగ్గుతో తలదించుకొని ముక్కు నేలకు రాసి, దళిత గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పండి” అని బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. కేసీఆర్ కు మొహం చెల్లకనే అసెంబ్లీకి రావడం లేదని, ఆయన వస్తే కడిగేద్దామనుకున్నానని చెప్పారు. 

పైసలు పంపించి అధికారులపై దాడులు చేయించిన్రు.. 

కొడంగల్ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకురావాలని తాను భావించానని, కానీ బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఫార్మాసిటీ పెడ్తామని తక్కువ ధరకు 15 వేల ఎకరాల భూమిని సేకరించారు. కానీ నేను కొడంగల్ ఏరియాలో 3 లక్షల ఎకరాల భూమి ఉంటే, దాంట్లో 4 గ్రామాల నుంచి 1,300 ఎకరాలు సేకరించి అక్కడ పరిశ్రమలు పెడ్తే 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావించాను. అయితే బీఆర్ఎస్ నేతలు అక్కడికి కోట్లు పంపించి.. అధికారులపై దాడులు చేయించారు. 95 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలున్న నియోజకవర్గం నాది. నా ప్రజలకు చేయకపోతే.. నాకేందుకు ఈ కుర్చీ. అందుకే ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోతా” అని హెచ్చరించారు. ‘‘ఢిల్లీలో కాలుష్యంతో బడులు, ఆఫీసులు బంద్ అయితున్నాయి. ఇక్కడా కూడా అలాగే చేసుకుందామా? నేను సవాల్ విసురుతున్నా.. బావాబామ్మర్దులు (హరీశ్, కేటీఆర్) రండి.. నల్గొండ పోదామా.. మునుగోడు, భువనగిరి, ఆలేరు, రంగారెడ్డి, ఎల్​ బీనగర్ పోదామా?.. నేను, రాజ్ గోపాల్ రెడ్డి గన్ మెన్లు లేకుండా వస్తాం.. మీరూ రండి. మూసీ ప్రక్షాళన చేయాలా? వద్దా? ప్రజలను అడుగుదాం” అని సవాల్ విసిరారు.

మీరా నన్ను ప్రశ్నించేది? 

బీఆర్ఎస్ నేతలు చేసిందంతా చేసి, ఇప్పుడు తమను ప్రశ్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘నా నిబద్ధతను మీరా క్వశ్చన్ చేసేది? పదేండ్లు సర్వనాశనం చేసి, రాష్ర్టాన్ని తాకట్టుపెట్టి, పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని మీరా.. నన్ను ప్రశ్నించేది” అని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరంతో సాగు నీరు, మిషన్ భగీరథతో తాగు నీరు ఇస్తున్నామని గతంలో కేటీఆర్ చెప్పారు. 2022–23లో తప్పుడు నివేదికలు ఇచ్చారు. రాష్ట్రంలోని 19 కార్పొరేషన్లలో రూ.1,29,283 కోట్లు అప్పు చేశారు. ఇవన్నీ వాళ్లే కట్టుకుంటారని చెప్పారు. అందులో రూ.38,867 కోట్లు మాత్రమే బడ్జెట్ లో చూపించారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు..

పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేట, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, వైన్ షాప్స్.. ఇలా ప్రతీది అమ్మేశారు. సహజ సంపదను కాంట్రాక్టుల పేరుతో కొల్లగొట్టారు. ఒక్క గురుకులానికీ బిల్డింగ్ లేదు. జీవోలు ఇచ్చేసి, హాస్టళ్లు పెట్టేసి స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడారు. పదేండ్లలో ప్రగతి భవన్, సెక్రటేరియెట్, ఫామ్ హౌస్, 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కట్టుకున్నరు. టీవీలు, పేపర్లు పెట్టుకున్నారు. వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్నరు. కానీ పేద పిల్లలు చదివే గురుకులాలకు మాత్రం బిల్డింగులు కట్టలేదు. పదేండ్లలో కనీసం బాత్​రూములు కూడా కట్టివ్వలేదు. దీనికి బీఆర్ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకొని ముక్కు నేలకు రాసి దళిత, గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలి. కొడంగల్​లో పరిశ్రమలు పెట్టి, అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించాలని అనుకుంటే.. బీఆర్ఎస్ నేతలు అక్కడికి కోట్ల కొద్దీ డబ్బు పంపించి అధికారులపై దాడులు చేయించారు.

ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం

సినీ ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి. షూటింగ్‌లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలను సహించం. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదు.

- అసెంబ్లీలో సీఎం రేవంత్​ రెడ్డి