దళితులను అవమానించిన కేసీఆర్ : కాంగ్రెస్ లీడర్లు ప్రీతమ్, పుష్పలీల

దళితులను అవమానించిన కేసీఆర్ :  కాంగ్రెస్ లీడర్లు ప్రీతమ్, పుష్పలీల

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత ఉన్న దళిత ఎమ్మెల్యే పార్టీలో లేడని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ వ్యాఖ్యానించి, దళితులను అమానించారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. దళితులను అవమానించడం కేసీఆర్‌‌కు మొదటి నుంచి అలవాటేనని దుయ్యబట్టారు. సోమవారం గాంధీ భవన్‌లో మాజీ మంత్రి పుష్ప లీలతో కలిసి ప్రీతమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1,200 మంది చనిపోతే, కేసీఆర్ పాలనలో వేల మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి అందక ప్రాణాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పుష్ప లీల మాట్లాడుతూ, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోగా, కాంగ్రెస్ హయాంలో వారికిచ్చిన భూములను కేసీఆర్ గుంజుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి నేతల వల్ల దళితులపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందన్నారు. కేసీఆర్ పాలనలో దళితుల లాకప్‌ డెత్‌లు, హత్యలు, అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. దళిత ఆడ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే, ప్రేమ విఫలమై చనిపోయిందని కేసీఆర్ సర్కార్ అవమానించిందని దుయ్యబట్టారు. దళితులకు పాలన చేతకాదన్న రీతిలో కేసీఆర్ మాట్లాడారని, ఆయన ముక్కు నేలకు రాసినా తప్పు లేదని ఆమె ఫైర్ అయ్యారు.