నేను శాసనసభలో ఉండకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తుండు

నేను శాసనసభలో ఉండకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తుండు

ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. నోటీసులు ఇస్తే ఇవ్వొచ్చేమో అన్న ఆయన.. తనను శాసనసభలో ఉండకుండా చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. మరోవైపు  స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర మనిషి అంటూ బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యునిగా తనకు 20 యేండ్ల సీనియారిటీ ఉందని మాట్లాడుతున్న ఈటల.. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరస్తూ మాట్లాడడం తీవ్ర విచారకరం అన్నారు.

తన సీనియారిటీలో నేర్చుకున్నది ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్ తన బాధ్యతలను నిబంధనల మేరకు చక్కగా నిర్వహిస్తున్నారని, సభ్యుల సంఖ్యను బట్టి బీ ఏ సి లో పార్టీలకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నపుడు కూడా బీజేపీకి బీఏసీ లో అవకాశం లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈటలతో మాకు నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.