కేసీఆర్ అప్పులతోనే ... నెట్టుకొస్తున్నడు

కేసీఆర్ అప్పులతోనే ... నెట్టుకొస్తున్నడు

గద్వాల, వెలుగు: మిగులు బడ్జెట్​తో ఏర్పడిన బంగారు తెలంగాణను కేసీఆర్ చేతుల్లో పెడితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ‘బీడికి బిచ్చం.. కల్లుకు ఉద్దెర’ అన్నట్లుగా మారిందని వైఎస్సార్ టీపీ చీఫ్​వైఎస్ షర్మిల అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క స్కీంకూ డబ్బులు లేని పరిస్థితి వచ్చిందన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం జూరాల ప్రాజెక్టు మీదుగా గద్వాల జిల్లాలోకి ఎంట్రీ అయింది. ఈ సందర్భంగా కృష్ణమ్మ పరవళ్లను, జూరాల ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. అనంతరం చిన్నచింతరేవులలో మాట ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పెన్షన్లకు, జీతాలకు, పథకాలకు డబ్బులు లేవు. అప్పులతోనే రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నెట్టుకొస్తుండు.

ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పు చేసి బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిండు” అని అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడని కేసీఆర్ ని మోసకారి అనకుంటే ఏమనాలి? అని ప్రశ్నించారు. ‘‘రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. డ్రిప్పు లేదు. పంట నష్టపోతే పరిహారం లేదు. ఎరువుల సబ్సిడీ లేదు. ఇలా ఒక్కొక్క రైతుకు రూ. 30 వేల వరకూ లబ్ధి కలిగే స్కీములన్నింటినీ బంద్ పెట్టారు. రైతుబంధు పేరిట ఎకరాకు రూ. 5 వేలు ముష్టిగా ఇస్తున్నారు. ఎనిమిదేండ్లు అవుతున్నా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయడంలేదు?” అని షర్మిల ప్రశ్నించారు.
కౌలు రైతుల ఉసురు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.