- కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నరు
- వాళ్లందరికీ దీటైన జవాబు చెప్పి సైదిరెడ్డిని గెలిపించారు
- కేసీఆర్ గో ఎహెడ్ అన్నారు.. ప్రజల తీర్పును తప్పకుండా పాటిస్తాం
- నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్‌కు గోదావరి నీళ్లు తెస్త
- త్వరలో సాగర్ ఆయకట్టు పరిధిలో నేనే స్వయంగా పర్యటిస్తా
- కాల్వలపై లిఫ్టుల బాధ్యత మాదే.. ఐడీసీ సిబ్బందికి జీతాలిస్తం: సీఎం
ఒక్కసారి చెప్పినమంటే.. ప్రజలకు మాట ఇచ్చినమంటే నిఖార్సుగా అమలు చేస్తం. తెలంగాణలో ఏ ఇంచైనా నాదే.. ఏ మూలైనా నాదే.. ఏ ఫీటు జాగైనా నాదే..ఎక్కడ నీళ్లు రాకపోయినా ఆ దుఃఖం నాదే.. ఆ బాధ నాకుంటది. తెలంగాణ యావత్తు కోటి 20 లక్షల ఎకరాలు నీళ్లు రావాలె. రైతులపై ఒక్కపైసా భారం పడకుండా అన్ని లిఫ్టుల మేనేజ్మెంట్ను ప్రభుత్వమే చూసుకుంటది. అందులోని సిబ్బందికి కూడా ప్రభుత్వమే జీతభత్యాలు ఇస్తది.
– సీఎం కేసీఆర్
హుజూర్నగర్, వెలుగు:
‘‘కేసీఆర్ యూ ఆర్ రైట్.. కేసీఆర్ గో ఎహెడ్’’ అని హుజూర్నగర్ ప్రజలు సందేశం ఇచ్చారని, దాన్ని తప్పకుండా పాటిస్తామని, ఎవరు ఏమన్నా భయపడకుండా ముందుకు పోతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలో, నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్న మొత్తం 600 లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణను ఇక ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు ఎన్జీవోలు, సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగిన వీటి మేనేజ్మెంట్ బాధ్యతలను ప్రభుత్వమే టేకోవర్ చేస్తుందని, అందులోని సిబ్బందిని కూడా అబ్జార్బ్ చేసుకుంటుందని, వారికి జీతభత్యాలను కూడా ఇస్తుందని వెల్లడించారు.
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రజా కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రైతుల మీద పైసా భారం పడకుండా లిఫ్టులన్నింటినీ ప్రభుత్వమే టేకోవర్ చేస్తుందని చెప్పారు. ప్రజలకు మాట ఇచ్చినమంటే నిఖార్సుగా అమలు చేస్తామని, ఇంచు భూమికి కూడా సాగు నీళ్లు అందిస్తామని తెలిపారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్‌కు గోదావరి నీళ్లు తీసుకొస్తామని, ఇక్కడి ఇరిగేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. త్వరలో తానే స్వయంగా సాగర్ ఆయకట్టు పరిధిలో పర్యటిస్తానని వెల్లడించారు. హుజూర్నగర్ నియోజకవర్గానికి సీఎం ప్రత్యేక నిధి నుంచి ఆయన వరాలు ప్రకటించారు. సూర్యాపేటకు, తుంగతుర్తి వరకు కాళేశ్వరం నీళ్లు వచ్చాయని, 99% భగీరథ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట నిఖార్సుగా అమలు చేస్త
నాగార్జున సాగర్ ఆయకట్టును కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఇక్కడ సాగు నీటికి శాశ్వత పరిష్కారం కోసం గోదావరి నీళ్లు సాగర్ లెఫ్ట్ కెనాల్‌కు తీసుకువస్తామని, ఆ నీళ్లతో ఏటా రెండు పంటలు పండే విధంగా, కృష్ణా నీళ్ల కోసం ఎదురుచూడకుండా ఉండేవిధంగా ప్రణాళికలు తయారుచేస్తున్నామని తెలిపారు. ఒక్కసారి చెప్పినమంటే.. ప్రజలకు మాట ఇచ్చినమంటే నిఖార్సుగా అమలు చేస్తామన్నారు. ‘‘తెలంగాణలో ఏ ఇంచైనా నాదే.. ఏ మూలైనా నాదే.. ఏ ఫీటు జాగైనా నాదే.. ఎక్కడ నీళ్లు రాకపోయినా ఆ దుఖం నాదే.. ఆ బాధ నాకుంటది. తెలంగాణ యావత్తు కోటి 20 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలె.. పచ్చబడాలె. దానికోసం మొండి పట్టుదలతో ముందుకు పోతున్న” అని సీఎం చెప్పారు. ‘‘ఇప్పుడు కేసీఆర్ దెబ్బ.. గ్యారంటీ నాగార్జున సాగర్ ఆయకట్టు మీద పడుతుంది. ఖచ్చితంగా తిరుగుత. ఎమ్మెల్యేలను వెంటేసుకొని రాబోయే 15, 20 రోజుల్లో నేనే స్వయంగా వచ్చి కోదాడ నుంచి హుజూర్నగర్ మీదుగా రోడ్డు మార్గంలో నాగార్జున సాగర్ వరకు పర్యటిస్త. ప్రజలను, రైతులను కూడా కలిసి సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరిస్త. అవసరమైన లిఫ్టులు మంజూరుచేస్తం. కాల్వల లైనింగ్ చేయిస్తం” అని ఆయన పేర్కొన్నారు.
తుంగతుర్తి దాకా కాళేశ్వం నీళ్లు వస్తున్నయి
‘‘నిన్నా మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు.. మీ అందరు చూస్తా ఉన్నారు. మీ పక్కనే ఉన్న సూర్యాపేటలో, కోదాడ, నడిగూడెంలో, తుంగతుర్తిలో ఈ రోజు కాళేశ్వరం నీళ్లు వస్తా ఉన్నాయి’’ అని సీఎం తెలిపారు. నిందలు భరించి పక్షులలాగా తిరిగి తెలంగాణ సాధించుకున్నామని, ఇప్పుడు కడుపు నోరు కట్టుకొని, అవినీతి రహితంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మిషన్ భగీరథతో 56 లక్షల ఇండ్లకు ట్యాప్ పెట్టి నీళ్లిచ్చే కార్యక్రమం జరుగుతోందని, 99 శాతం అది పూర్తయిందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
7 ఫీట్లున్న అప్పటి మంత్రులు ఏం జేసిండ్రు
ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు ఇష్టమున్నట్లు మాట్లాడాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డిని మూడుఫీట్లు ఉన్నడని విమర్శించిండ్రు. ఆయనను మేమేమన్నా 8 ఫీట్లు ఉన్నడన్నమా? అప్పట్ల ఇక్కడోళ్లు కొందరు 7 ఫీట్ల మంత్రులుండే. వాళ్లు ఏం జేసిండ్రు మరి. 3 ఫీట్లున్న ఈ జగదీశ్‌రెడ్డే పెన్ పహాడ్, కోదాడ వరకు కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు కృషి చేసిండు. పవర్ ప్లాంట్‌ను ఈ కాంగ్రెసోళ్లు విమర్శించిండ్రు. అధికారంలోకి వస్తే రద్దు చేస్తమన్నరు. వాళ్లు మహామేధావులు.. వాళ్ల గురించి మాట్లాడదలచుకోలేదు’ అని ఆయన ఎద్దేవా చేశారు.
హుజూర్‌నగర్‌కు వరాలే వరాలు
హుజూర్నగర్ నియోజకవర్గ ఓటర్లు అందించిన విజయం తమలో ఉత్సాహాన్ని, సేవాభావాన్ని పెంచుతుందని, ఇది మామూలు విజయం కాదని సీఎం చెప్పారు. నియోజకవర్గంలోని 134 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి సీఎం ప్రత్యేక నిధి కింద రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. హుజూర్‌నగర్‌కు ఎస్టీ రెసిడెన్సియల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి వెంటనే ఆర్డర్ ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. హుజూర్‌నగర్‌లో బంజారా భవన్ కూడా నిర్మిస్తామని, రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తానని చెప్పారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో మాట్లాడి మేళ్లచెరువు, చింతల పాలెం మండలాలను హుజూర్నగర్ కోర్టు పరిధిలోకి తీసుకొస్తానని ఆయన అన్నారు. హుజూర్‌నగర్‌లో రింగురోడ్డు ఏర్పాటు చేస్తామని, స్థానిక చెరువును ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
హుజూర్‌నగర్‌కు 100 కోట్లు
- 134 పంచాయతీలకు 20 లక్షల చొప్పున, 7 మండల కేంద్రాలకు 30 లక్షల వంతున నిధులు
- హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు
- అన్నీ సీఎం ప్రత్యేక నిధి నుంచే కేటాయింపు.. రెండురోజుల్లో విడుదల
- ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్, బంజారా భవన్, పాలిటెక్నిక్ కాలేజీ, రెవెన్యూ డివిజన్, రింగ్ రోడ్డు,
ట్యాంక్‌బండ్ మంజూరు - వీలైనన్ని ఎక్కువ డబుల్ బెడ్రూం ఇండ్లు
- కేంద్రంతో మాట్లాడి ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు.
