అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన

అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన

ఇది విగ్రహం కాదు విప్లవం అంటున్నారు.. ఏ విప్లవమైనా, ఆయా వర్గాల్లో వెలుగు కోసం జరుగుతుంది. కానీ కేసీఆర్ ఆలోచన మాత్రం విగ్రహాల చాటున, అణగారిన వర్గాలను నమ్మించి, ఇంకా చీకట్లోనే ఉంచాలనే కుట్రలా కనిపిస్తున్నది. అంబేద్కర్ జయంతిన.. తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించింది. ఈ సంద్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం సత్యదూరంగా ఉంది. వారి మాటలు, చేతలకు అసలు పొంతన లేదు. తెలంగాణలో దళిత బహుజనుల జీవితాలు నానాటికి ఆగం అయిపోతున్నాయి. సీఎం కేసీఆర్​గత 9 ఏండ్లలో సీఎం హోదాలో అంబేద్కర్ జయంతి, వర్ధంతులకు కనీసం ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించలేదు. ప్రగతి భవన్ ను 2016  మార్చిలో ప్రారంభించి, 8 నెలల వ్యవధిలో పూర్తిచేశారు. అదే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం 2017 ఏప్రిల్​లో ప్రారంభించి 2023లో పూర్తి చేశారు. 6 ఏండ్లు ఆలస్యం ఎందుకు అయింది? ఎన్నికల ఏడాది వరకు ఆపి ఆయా వర్గాలను ఓట్ల కోసం మభ్యపెట్టడానికి లేట్​చేసింది నిజం కాదా?

దళితుడే తొలి సీఎం మాట ఏమాయె?

తెలంగాణ తొలి సీఎం దళితుడే.. అని ప్రకటించి కేసీఆర్ దళితులను మొదటిసారి మోసం చేశారు. కేసీఆర్ మాట ఇస్తే తలనరుక్కుంటాడు గానీ మాట తప్పడని అనేక వేదికల మీద ప్రకటించిన కేసీఆర్.. తెలంగాణ ఏర్పడగానే సీఎం కుర్చీలో కూర్చున్నాడు. దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి, రాజయ్యను అర్ధంతరంగా తప్పించి దళిత జాతిని అవమానించాడు. భూమిలేని పేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్న ఆయన.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. ఇస్తానన్న మూడు ఎకరాల భూమి దళితులకు ఇవ్వకపోగా, నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంచిన భూములను ఇతర నిర్మాణాల కోసం లాక్కుంటున్నాడు. హుజూరాబాద్​ఎన్నికల ముందు తీసుకొచ్చిన దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కామధేనువుగా మారింది. అర్హులకు కాకుండా నచ్చిన కార్యకర్తలకు దళిత బంధు ఇస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయంలో దళితులకు పక్కా ఇల్లు ఏర్పాటు అనే కార్యక్రమం ప్రారంభించి, మెజారిటీ దళితులకు ఇండ్లు ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ స్వగృహ పేరుతో అపార్ట్​మెంట్లు వచ్చాయి. బీఆర్ఎస్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీం ప్రచారంగానే మిగిలిపోయింది.  

అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరు మార్పు!

నాడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన డా.బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో అంబేద్కర్ పేరును తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు మార్చారో కేసీఆర్ సమాధానం చెప్పగలరా? రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుర్చీ ఇన్నేండ్లుగా ఖాళీగా ఎందుకుంది? కేసీఆర్ ప్రభుత్వం, నేడు దళితుల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తున్నది. 

సబ్ ప్లాన్ నిధులేవి?

అంబేద్కర్ కలలుగన్న దళిత గిరిజనుల అభివృద్ధి కోసం బడ్జెట్​లో కేటాయింపులు చేసేలా సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని కింద కేటాయించిన రూ.6 వేల కోట్లు నిధులను మిషన్ భగీరథకు మళ్లించింది నిజం కాదా? ఇదా దళితుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి?  చట్టప్రకారం ప్రతి బడ్జెట్ లో హక్కుగా పొందాల్సిన నిధులను కూడా, దళితబంధు అనే పథకం పేరుతో మార్చి, నిధుల కేటాయింపు అధికారాలు ఎమ్మెల్యేలకు ఇచ్చి, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన ప్రభుత్వ సొమ్మును బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పంచుతున్న మాట వాస్తవం కాదా? 10 జిల్లాలున్న తెలంగాణను33 జిల్లాలు చేశారు. కానీ ఒక్క జిల్లాకైనా ఆయన పేరు పెట్టారా? అంబేద్కర్ కలలుగన్న మహిళా సాధికారత మచ్చుకైనా అమలవుతుందా? కేసీఆర్ మొదటి క్యాబినెట్​లో ఒక్క మహిళా మంత్రి లేరు. దళితుడైన ప్రదీప్ చంద్ర చీఫ్ సెక్రెటరీగా ఉంటే.. 2 నెలల్లో ఇంటికి పంపించింది వాస్తవం కాదా?  దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధితో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గేను ఎన్నుకున్నాం. ఇలాంటి చిత్తశుద్ధి కేసీఆర్​కు ఉందా? ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీకి దళితుడు అధ్యక్షుడు కాగలడా? అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ కు సైతం అవాస్తవాలతో కూడిన సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కులను కాలరాస్తున్న కేసీఆర్ ప్రభుత్వం విగ్రహం చూపించి దళితులను ఉద్దరిస్తున్నట్టుగా వారితో చెప్పించారు. అంబేద్కర్​అన్నట్టు ‘అద్దాల మేడలు, రంగులద్దిన రోడ్డులే అభివృద్ధి కాదు’ కేవలం విగ్రహాలు ప్రతిష్టించడమే అంబేద్కర్ కు నివాళులర్పించడం కాదు. ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తూ, పేదల హక్కులను రక్షించటం, అణగారిన వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే ఆ మహనీయుడికి ఇచ్చే అసలైన నివాళి. కానీ కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా, తెలంగాణను పోలీసు రాజ్యంలా నడుపుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం పెట్టారు తప్ప..అణగారిన వర్గాలను ఉద్దరించేందుకు కాదు!.