రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారు: షర్మిల

రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారు: షర్మిల

పిట్లం, వెలుగు: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం బిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీలో మకాం వేశారని వైఎస్సార్‌‌‌‌టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. బిడ్డను అరెస్టు చేయకుండా లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ బతుకే లేని తెలంగాణగా మార్చారని విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో సాగింది. బిచ్కుందలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో  కొత్త రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రైతులకు విలువ లేకుండా పోయిందని అన్నారు.

 పంజాబ్, హర్యానాలో డబ్బులు పంచుతున్న కేసీఆర్.. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి జగదీశ్​​రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ అని అబద్ధాలు చెబుతున్నారని ఆయన నియోజకవర్గం సూర్యాపేటలోనే మోటార్లు కాలిపోతే రిపేర్లు చేసుకుంటున్న సమయంలో కరెంట్ షాక్​తో ఇద్దరు రైతులు చనిపోయారని తెలిపారు. కేసీఆర్​ఫ్యామిలీ రాష్ట్రంలో లక్షల కోట్ల విలువ చేసే భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. ఇక్కడ దోచుకున్నది చాలక బీఆర్​ఎస్​ పేరుతో దేశం మీద పడ్డారన్నారు. స్థానిక ఎమ్మెల్యే  హన్మంత్​ షిండే మండలానికి ఒక నాయకున్ని పెట్టుకుని ఇసుక మాఫియా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.