కేసీఆర్ మిడతల కంటే డేంజర్

కేసీఆర్ మిడతల కంటే డేంజర్
  • కేసీఆర్.. దళిత ద్రోహి
  • రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించిన్రు
  • కేంద్రం పైసలతో నదులు అనుసంధానిస్తే మీకేం ఇబ్బంది

న్యూఢిల్లీ, హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. అందుకే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారని అన్నారు. కేసీఆర్ ఏనాడూ అంబేద్కర్ జయంతి, వర్ధంతికి రాలేదని గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టలేదన్నారు. కానీ అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలను పెట్టి, ఆయన చరిత్రను భావితరాలకు బీజేపీ అందిస్తున్నదని చెప్పారు. సీఎం కామెంట్లపై దళిత సమాజం స్పందించాలని కోరారు. కేసీఆర్‌‌‌‌పై దేశద్రోహం కేసు పెట్టాల్సిందేనన్నారు. కేసీఆర్ మనసులోని ఆలోచనలను, కుట్రలను బీజేపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరగరాస్తుందని గతంలో కేసీఆరే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బడ్జెట్ కన్నా ముందు అంబేడ్కర్‌‌‌‌పై కేసీఆర్ చేసిన కామెంట్లపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో వర్చువల్ మోడ్‌‌లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. గత చరిత్రను తెరమరుగు చేసి, కుటుంబ రాజ్యాంగాన్ని ప్రజలకు చెప్పుకోవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. డిప్రెషన్‌‌లో రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న తన అక్కసు బయటపెట్టారని చెప్పారు.

సెంటిమెంట్ రగిల్చే కుట్ర చేస్తుండు
దేశంలోనే పెద్ద అవినీతిపరుడు కేసీఆర్ అని, త్వరలో ఆయన జైలుకు పోవడం ఖాయమని సంజయ్ హెచ్చరించారు. తన అవినీతి సామ్రాజ్యం, మోసపూరిత హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ మతి తప్పినట్లు మాట్లాడారని, ఆయనలాంటి పిచ్చోళ్ల కోసమే కేంద్రం ఈ బడ్జెట్‌‌లో మెంటల్ ఆస్పత్రుల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లుందన్నారు.

కేసీఆర్ మిడతల కంటే డేంజర్
కేసీఆర్ మిడతల కంటే డేంజర్ అని,  ప్రెస్ మీట్ పెట్టి బుడ్డర ఖాన్ మాటలు చెప్పారని సంజయ్ విమర్శించారు. తెలంగాణలో రైతులు కోటీశ్వరులయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని, ఉద్యోగాలిస్తే, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ఖర్మ ఎందుకు వస్తదని ప్రశ్నించారు. సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణకు  ప్రధాని రావద్దనే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నిధులతో నదుల అనుసంధానం చేస్తానంటే కేసీఆర్‌‌‌‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. కమీషన్లు పోతయని భయమా అని ప్రశ్నించారు. 

విప్లవాత్మకమైన బడ్జెట్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విప్లవాత్మకమైందని, రాబోయే పాతికేళ్ల దేశ భవిష్యత్ కు ఇది అద్దంపట్టే బడ్జెట్ అని బండి సంజయ్ అన్నారు. స్వదేశీ వ్యాక్సిన్​తో కరోనాను కట్టడి చేసిన మోడీ ప్రభుత్వం.. ‘ఆత్మ నిర్భర్’ తో  ఆర్థిక సుస్థిరత సాధించడం చరిత్రాత్మకమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం మోపకుండా పన్నుల రహిత బడ్జెట్ ను రూపొందించడం సాహసోపేతమన్నారు. ఎన్నికలతో, రాజకీయాలతో పనిలేకుండా దీర్ఘకాల లక్ష్యాలతో దేశ క్షేమం కోసం ఈ బడ్జెట్ రూపొందించారన్నారు. ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ రంగాలకు రూ.6 లక్షల కోట్ల ప్రోత్సాహకాలతో కోట్లాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు.

పీకే డైరెక్షన్‌‌తోనే కేసీఆర్ విమర్శలు: లక్ష్మణ్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో బడ్జెట్‌‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగియక ముందే సీఎం కేసీఆర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. దీనిపై కేసీఆర్ కూనిరాగాలు తీస్తున్నారని విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎలా విమర్శించినా... కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకం అన్నారు. తాయిలాలతో ఎన్నికల బడ్జెట్ ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలు తప్పాయన్నారు. ఇండియాను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా బడ్జెట్ ఉందన్నారు. 

భవిష్యత్తు నిర్మాణానికి పునాది: డీకే అరుణ
భవిష్యత్తు భారత నిర్మాణానికి పునాది వేసేలా బడ్జెట్​ ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ అధిక ప్రాధాన్యమిచ్చిందన్నారు. డిజిటల్ ఇండియా సాధనతో ఆత్మ నిర్భర భారత సాధికారతకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని మంగళవారం హైదరాబాద్ లో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్రాలకు వడ్డీ లేకుండా రుణ సౌకర్యం కోసం లక్ష కోట్లు కేటాయించడం, కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్రాల్లోని ఉద్యోగులకు ఎన్ పీఎస్ డిడక్షన్ చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం రూ. 10.68 లక్షల కోట్లు కేటాయించడం సమాఖ్య వ్యవస్థపై ప్రధాని మోడీకి ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. వరి, గోధుమల మద్దతు ధర కోసం రూ.2.37 లక్షల కోట్ల కేటాయింపు, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచడం, అద్దె పద్ధతిలో రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించడం రైతులకు మేలు చేసే బడ్జెట్ అన్నారు. మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, మిషన్ అంగద్, పోషణ్ అభియాన్ 2.0 లాంటి పథకాలను అమలు చేయడం మహిళా సాధికారత, శిశు సంక్షేమంలో కీలకమని అన్నారు.