కేసీఆర్​ కిట్ పైసలు పడ్తలేవ్!.

కేసీఆర్​ కిట్ పైసలు పడ్తలేవ్!.
  • డెలివరీలై  ఏండ్లు దాటుతున్నా లబ్ధిదారులకు అందని సొమ్ము
  • కామారెడ్డి జిల్లాలో వేలాది మందికి విడతల వారీగా బకాయిలు 
  • ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని మహిళల డిమాండ్​
కామారెడ్డి , వెలుగు: మాతా శిశు మరణాలు తగ్గించేందుకు, తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు గవర్నమెంట్​హాస్పిటల్స్​లో డెలివరీల సంఖ్య పెంచాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన కేసీఆర్​కిట్​ ప్రోత్సాహక పైసలు కామారెడ్డి జిల్లాలో ఏడాది కాలంగా ఆగిపోయాయి. జిల్లాలో ఇప్పటి వరకు 36, 576 మందికి  వివిధ విడతల వారీగా  అందాల్సిన పైసలు పెండింగ్​పడ్డాయి.  పలుమార్లు ఆఫీసర్లను, సిబ్బందిని అడిగితే  వస్తాయంటూ  చెప్పడం తప్పా  పైసలు మాత్రం అకౌంట్లలో  పడ్తలేవని లబ్ధిదారులు వాపోతున్నారు. 


 స్కీమ్​గైడ్​లైన్స్.. 

 
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే  తల్లి మంచి పోషకాహారం తీసుకునేలా చూడడం,  పుట్టిన తర్వాత  బిడ్డకు  టీకాలు సకాలంలో ఇప్పించడం లాంటి అంశాలకు అనుగుణంగా  రాష్ర్ట ప్రభుత్వం 2017లో  ‘కేసీఆర్​కిట్’​  స్కీమ్​ తీసుకొచ్చింది.  స్కీమ్​ప్రకారం.. ఆడ పిల్ల జన్మిస్తే  రూ.13 వేలు,  మగ పిల్లవాడు అయితే రూ.12వేలతో  పాటు, శిశువులకు వివిధ రకాల వస్తువులతో కూడిన కిట్​ ఇస్తారు.  పైసలు మాత్రం  విడతల వారీగా  అకౌంట్లలో వేస్తారు. ఇందులో సగం పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది.  గర్భం దాల్చిన తర్వాత  హెల్త్​ స్టాప్​ వద్ద  ఏఎన్సీ గా  ఎంట్రీ  చేయించుకోవడం  నెల నెలా  చెకప్స్​ చేయించడం లాంటివి  చేయాలి.  రెండో కాన్పు వరకు ఈ స్కీమ్​ వర్తిస్తుంది. స్కీమ్​తో పాటు,  ప్రైవేట్​లో  డెలివరీకి  ఖర్చు భారీగా  అవుతుండడంతో  ఎక్కువ మంది గవర్నమెంట్​హాస్పిటల్స్​లో డెలివరీలకు వస్తున్నారు. దీంతో జిల్లాలో గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్కీమ్​ ప్రవేశ పెట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు  పైసలు సకాలంలోనే ఇచ్చారు.  ఆ తర్వాత  వస్తువులతో కూడిన కిట్​ ఇస్తున్నప్పటికీ , పైసలు మాత్రం  చెల్లించడం లేదు.  ఏడాదిన్నర కాలంలో జిల్లాలో  ఒక్కరికీ పైసలు పడలేదు. 
 

జిల్లాలో పరిస్థితి


జిల్లాలో   ప్రస్తుతం ఏఎన్​సీలో ఎంట్రీ అయిన వాళ్లు 18,918 మంది,   డెలివరీ అయిన వాళ్లు 13,145 మంది,   డెలివరీ తర్వాత మూడున్నర నెలలు పూర్తయిన వాళ్లు 19,042 మంది,  డెలివరీ కావడానికి.. 9 నెలలు నిండిన వాళ్లు   17,534 మంది ఉన్నారు. జిల్లాలో వివిధ విడతల్లో  లబ్ధిదారులకు చెల్లించాల్సిన కిట్​పైసల్​ రూ. 8 కోట్ల వరకు బకాయిలు ఉంటాయని  హెల్త్ డిపార్ట్​మెంట్​వర్గాలు పేర్కొన్నాయి. చాలా మంది లబ్ధిదారులకు రెండో కాన్పు అయిన  తర్వాత కూడా ఇంకా ఫస్ట్ డెలివరీ పైసలు రాలేదని చెప్తున్నారు. ఈమె  కామారెడ్డికి చెందిన రేణుక.  ఫస్ట్  డెలివరీలో పాప పుట్టింది. ఆ పాపకు రెండేండ్లు. మళ్లీ ఇప్పుడు సెకండ్​ డెలివరీ అయ్యింది. కానీ ఫస్ట్​ డెలివరీ అయినప్పుడు రూ.3 వేలు వస్తువులున్న కిట్​ఇచ్చిన్రు. ఆ తర్వాత  మళ్లీ పైసలు రాలే. ‘సీఎం సారు మాటమీద పైసలిస్తే బాగుండు’ అని వాపోయింది. ఈమె  లింగంపేట మండల కేంద్రానికి చెందిన  నవనీత.  ‘డెలివరీ కాగానే కేసీఆర్​కిట్​ ఇచ్చారు.  పైసలు మాత్రం అకౌంట్​లో వేయలేదు.  చాలా సార్లు అడిగితే   వస్తాయని  చెప్పారు. సకాలంలో  పైసలు ఇస్తే   నాతో పాటు, బిడ్డకు  పౌష్ఠికాహారానికి అవసరమైన వస్తువులు  కొనే అవకాశముండేది’  అని అంటోంది.
 

ఆన్​లైన్లో ఎంట్రీ చేస్తున్నాం

 
‘కేసీఆర్​ కిట్’ పైసలకు సంబంధించిన  లబ్ధిదారుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో ఎంట్రీ చేస్తున్నాం. ఉన్నతాధికారులకు రిపోర్టులు పంపాం.  కొన్ని నెలలుగా పైసలు పెండింగ్ లో ఉన్నది నిజమే.. కొంత ఆలస్యమైనా  లబ్ధిదారులకు  అకౌంట్లలో  పైసలు పడ్తయ్.
- డాక్టర్​ లక్ష్మన్​సింగ్​, డీఎంహెచ్​వో