
మంత్రివర్గ కూర్పుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఓ వైపు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న దానిపై ఆసక్తి నెలకొంటే….ప్రగతి భవన్ లో జరుగుతున్న పరిణామాలు…ఆశావాహులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. మాజీ మంత్రులు, సీనియర్ నేతలను కేసీఆర్….ప్రగతిభవన్ కు పిలుస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ కేసీఆర్ ఎవరిని ప్రగతిభవన్ కు పిలిచి మాట్లాడారు.
TRS రెండో సారి అధికారపగ్గాలు చేపట్టి దాదాపు 50రోజులు పూర్తవుతోంది. KCR ముఖ్యమంత్రిగా…మహమూద్ అలీ…హోంమంత్రిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా మంత్రి పదవుల భర్తీపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే కొన్ని రోజులుగా ఈ నెల 7న లేదా 10న మంత్రివర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందని గులాబీ పార్టీలో జోరుగా చర్చ సాగింది. రెండు మూడు రోజులుగా ప్రగతి భవన్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఆశావహుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో పాలనాపరమైన అంశాలపై రివ్యూలు నిర్వహిస్తూనే….మరోవైపు పార్టీ నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. కొంత మంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులను స్వయంగా పిలిచి మంతనాలు జరపటంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలను పిలిచిన గులాబీ బాస్….వారితో గంటల తరబడి చర్చించినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతున్న టైంలో వీరితో ప్రత్యేకంగా మాట్లాడటం ఆసక్తిగా మారింది. దీంతో మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలైంది.
స్పీకర్ ఎన్నిక టైంలో సీఎం…పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిని మాత్రమే ప్రగతిభవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. నామినేష న్ కు కొన్ని గంటల ముందే పోచారంను ఫైనల్ చేయడం పార్టీ నేతలను ఉత్కంఠకు గురిచేసింది. ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణ జరగబోతున్న టైంలో….కొంత మంది నేతలనే పిలిచి మాట్లాడటంపై ఆంతర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. క్యాబినెట్ లోకి తీసుకునేందుకే చర్చించారా లేదా….వారికి ఈసారి అవకాశం ఇవ్వట్లేదని బుజ్జగించారా అన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.
ఈసారి కేబినెట్ లో కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పట్నం నరేందర్ రెడ్డి, రెడ్యానాయక్, పువ్వాడ అజయ్, రేఖానాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ టైంలో మాజీ మంత్రులను పిలిచి మాట్లాడటంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఆశావహుల్లో నెలకొంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సీనియర్లకు నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారనే చర్చతో….మాజీ మంత్రులకు మంత్రి వర్గంలో చోటు ఉంటుందా లేదా అన్న చర్చ సైతం జరుగుతోంది.