మోడీ పర్యటనకు దూరంగా కేసీఆర్

 మోడీ పర్యటనకు దూరంగా కేసీఆర్

దేశ ప్రధాని మోడీ నేడు (శనివారం) హైదరాబాద్కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.45 నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరనున్న మోడీ.. మధ్యాహ్నం 2. 55 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అయితే ప్రధానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరుపున సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు. ఆయనకు బదులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎయిర్పోర్టుకు  వెళ్లి మోడీకి స్వాగతం పలకనున్నారు. ఐతే ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. ప్రధాని మోడీ విమానాశ్రయంలో దిగడానికి కొన్ని గంటల ముందు బేగంపేట విమానాశ్రయంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కేసీఆర్ రిసీవ్ చేసుకోనున్నారు. ఈ విషయన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఆరునెలల్లో ఇది మూడోసారి

ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంలో సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం ఆరు నెలల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతకుముందు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో 20వ వార్షిక వేడుకలకు హాజరయ్యేందుకు మోడీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు ఆ సమయంలో కేసీఆర్ బెంగళూరుకు వెళ్లారు. అప్పుడు కూడా ప్రభుత్వం తరఫున మోడీకి తలసానినే స్వాగతం పలికారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ సందర్భంగా మోడీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికలేదు. జ్వరం కారణంగా కేసీఆర్, మోడీకి స్వాగతం పలికేందుకు వెళ్లలేదని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.