కేసీఆర్.. ఫైళ్లు ముడ్తలే.. రివ్యూలు చేస్తలే

కేసీఆర్.. ఫైళ్లు ముడ్తలే.. రివ్యూలు చేస్తలే
  • కీలక మీటింగ్​లకు కేసీఆర్​ దూరం
  • అన్నీ తానై నడిపిస్తున్న సీఎస్​ సోమేశ్​
  • ఎడ్యుకేషన్, ఫారెస్ట్, బీసీ, గల్ఫ్ ఇష్యూస్​పై ఆఫీసర్లతో మీటింగ్స్​​
  • మొక్కుబడిగానే అటెండ్​ అవుతున్న మంత్రులు
  • ప్రధాని మోడీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ భేటీలోనూ సీఎం బదులు సీఎస్
  • కొత్త సెక్రటేరియట్​, కాళేశ్వరం, ధరణిపైనే కేసీఆర్​ దృష్టి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో పరిపాలనకు కీలకమైనది… అన్ని డిపార్ట్​మెంట్లను పర్యవేక్షించాల్సింది, కీలక నిర్ణయాలన్నీ తీసుకునేదీ ముఖ్యమంత్రే. కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్  కొంతకాలంగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కీలక మీటింగ్​లకు, రివ్యూలకు కూడా అటెండ్​ కావడం లేదు. దాంతో సీఎం ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశాలు, సమీక్షలను చీఫ్​ సెక్రటరీయే నిర్వహించేస్తున్నారు. చాలా వరకు నిర్ణయాలను అధికారులే ప్రకటిస్తున్నారు. కాళేశ్వరం, ధరణి పోర్టల్, కొత్త సెక్రటేరియట్, యాదాద్రి నిర్మాణం వంటి కొన్నింటినే సీఎం కేసీఆర్​ పట్టించుకుంటున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. అసలు ఎంతో కీలకమైన నీతి ఆయోగ్​ వర్చువల్​ మీటింగ్​కు కూడా సీఎం కేసీఆర్​ అటెండ్​ కాలేదు. కృష్ణానదిపై ఏపీ కడ్తున్న పోతిరెడ్డిపాడు, తుంగభద్రకు తూట్లు పొడిచేలా చేపడ్తున్న ఆర్డీఎస్ ​నీటి మళ్లింపు తీరుపై సీఎం రివ్యూలు చేయలేదు. కరోనా లాక్ డౌన్​ టైంలో గంటలకు గంటలు ప్రెస్​మీట్లతో హడావుడి చేసిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టు చీవాట్లు పెట్టినా కూడా రివ్యూలు చేయలేదు. టీఆర్ఎస్​ సెకండ్​ టెర్మ్​ పాలన మొదలైనప్పటి నుంచి కేసీఆర్​ స్పీడ్​ తగ్గిందని.. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్​ ఓటమి తర్వాత ఆ మాత్రం పట్టించుకోవడం కూడా మానేశారని అధికారులు అంటున్నారు. గతంలో నెలకు 20 రివ్యూలు చేసిన సీఎం.. ఇప్పుడు గత 80 రోజుల్లో కలిపి 18 రివ్యూలే చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్​ ఫోకస్​ అంతా రాజకీయాలపై పెట్టారని.. దాంతో సీఎస్​ సోమేశ్​కుమారే ప్రభుత్వ సమీక్షలన్నీ చేస్తున్నారని అంటున్నారు. ఇక సాధారణంగా సీఎం ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు సీఎం సూచనలతో మంత్రులు సంబంధిత డిపార్ట్​మెంట్​ రివ్యూలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు సీఎం మౌనంగా ఉండటంతో.. మంత్రులు అతిథి పాత్రకు పరిమితమవుతున్నారు. సీఎస్​ ఆధ్వర్యంలో జరుగుతున్న మీటింగ్​లకు నామ్​కేవాస్తేగా హాజరవుతున్నారన్న విమర్శలున్నాయి.

అత్యంత కీలకమైన నీతి ఆయోగ్ మీటింగ్ కు దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు అటెండ్ ఆయ్యారు. పీఎం మోడీ నేతృత్వంలో ఈ నెల 20న జరిగిన ఈ వర్చువల్ మీటింగ్ లో.. ఏపీ సీఎం జగన్  పాల్గొని ఏపీకి స్పెషల్​ ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చాలా అంశాలపై ఏపీ అభిప్రాయాలను వివరించారు. కానీ ఈ మీటింగ్​కు సీఎం కేసీఆర్​ దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సీఎస్  సోమేశ్​ అందులో పాల్గొన్నారు. అసలు ఈ మీటింగ్ కు సీఎం కేసీఆర్​ ఎందుకు అటెండ్​ కాలేదన్న దానిపై సీఎంవో అధికారికంగా ఎట్లాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక ఏటా బడ్జెట్ తయారీపై కేసీఆర్ వరుసగా రివ్యూలు నిర్వహించేవారు. కానీ ఈసారి అలాంటి సమీక్షలేవీ జరగలేదని, కేవలం ఒకే రివ్యూ జరిగిందని ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో బడ్జెట్ ప్రపోజల్స్​ ఎట్లా ఉండాలి? ఏ స్కీమ్ లకు ఎంత మేర ఫండ్స్​ కేటాయించాలన్న దానిపై ఆఫీసర్లు కిందామీదా పడుతున్నరు. బడ్జెట్​పై ఇంకా ఏదీ కొలిక్కిరాలేదని.. సీఎం పిలుపు కోసం ఆఫీసర్లు వెయిట్​చేస్తున్నారని
అంటున్నారు.

అన్నీ తానై సీఎస్​ రివ్యూలు

సీఎం కేసీఆర్  దూరంగా ఉండటంతో డిపార్ట్​మెంట్ల రివ్యూలన్నీ సీఎస్​ సోమేశ్​ చేస్తున్నారని ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. సీఎస్  మంగళవారం ఎడ్యుకేషన్ పై రివ్యూ చేశారు. ఈ నెల 24 నుంచి మార్చి 1లోపు ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 22న సివిల్ సప్లైస్, బీసీ సంక్షేమ శాఖలపై సీఎస్ రివ్యూ నిర్వహించగా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్  దానికి అటెండ్​ అయ్యారు. బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాల పురోగతి, బీసీల కోసం కొత్తగా చేపట్టనున్న కొత్త స్కీమ్స్, యాసంగి ధాన్యం సేకరణపై ఆ రివ్యూలో చర్చించారు. ఇక ఈ నెల 19న నేషనల్ హైవేల వెంబడి రంగురంగుల పూలమొక్కలు నాటడంపై సుదీర్ఘంగా రివ్యూ చేశారు. ఇందులో అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్, అర్ అండ్ బీ శాఖల సెక్రటరీలు, జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫీసర్లు పాల్గొన్నారు. దానికంటే ముందు 16న గల్ఫ్ లో తెలంగాణ వాసులు ఎదుర్కుంటున్న సమస్యలపై సీఎస్​ సమీక్షించారు. గల్ఫ్ లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసులను రప్పించి వారికి ఎలాంటి ఉపాధి పథకాలు అమలు చేయాలన్న దానిపై డీజీపీ, లేబర్, లా, హోం సెక్రటరీతోపాటు పాస్ పోర్టు ఆఫీసర్ తో చర్చించారు. ఇక గత నెల 23న డీసీసీబీ బ్యాంకుల ఆర్థిక పటిష్టతపై రివ్యూ జరిపిన సీఎం.. ఇతర బ్యాంకుల్లా డీసీసీబీల బిజినెస్ పెంచడం కోసం హైలెవల్ కమిటీ సమర్పించిన రిపోర్టుపై ఆరా తీశారు.

రాజకీయాలపై ఫోకస్

సరైన కేడర్  లేకపోవడమే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్​ ఓటమికి కారణమని సీఎం కేసీఆర్ గుర్తించారని పార్టీ లీడర్లు చెప్తున్నారు. అందుకే రాజకీయాలపైనే ఫోకస్​ చేశారని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీ కేడర్ కు ఉత్సాహపర్చేందుకు జీహెచ్ఎంసీ రిజల్ట్​వచ్చిన వారంలో సిద్దిపేటలో బహిరంగ సభ పెట్టి సొంత పార్టీ నేతలపై ప్రశంసలు గుప్పించారు. తర్వాత రెండు రోజులకు.. అంటే డిసెంబర్ 12న కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. తర్వాత 15 రోజులపాటు ఫాంహౌజ్ లోనే గడిపారు. అదే సమయంలో కేటీఆర్ ను సీఎం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా డిమాండ్లు చేయడంతో రాజకీయ దూమారం రేగింది. దానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఈ నెల 8న కేసీఆర్​ తెలంగాణ భవన్ లో పార్టీ లీడర్ల మీటింగ్ పెట్టారు. ‘‘సీఎం మార్పుపై ఎవరు మాట్లాడినా కాళ్లందుకుని బండకేసి కొడ్తా’’ అని హెచ్చరించారు. తర్వాత సాగర్ బై ఎలక్షన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 11న నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ, కాంగ్రెస్ లపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

అన్నీ పెండింగే..ఇంట్రస్ట్​ ఉన్న కొన్నింటిపైనే..

సీఎం కేసీఆర్  రెండు నెలలుగా తనకు ఇష్టమైన రెండు, మూడు అంశాలపై మాత్రమే రివ్యూలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ రిజల్ట్​ నాటి నుంచి ఇప్పటివరకు.. ధరణి పోర్టల్, రైతుబంధు, ఇరిగేషన్ అంశాలపై మాత్రమే సమీక్షించారు. తన హయాంలోనే ఇరిగేషన్ డిపార్ట్ మెంట్  రీఆర్గనైజేషన్ చేపట్టాలన్న పట్టుదలతో.. ఇరిగేషన్ రివ్యూ జరిపి మేజర్, మీడియం, మైనర్, ఐడీసీ శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చారు. కుటుంబ సమేతంగా కాళేశ్వరం వెళ్లి.. నీటి పంపింగ్ ను పరిశీలించారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ప్రాణహిత, గోదావరి సంగమంలో పూలు, పసుపుకుంకుమలతో పూజ చేశారు. కీలకమైన రైతుబంధు అమలుపై రివ్యూ చేశారు. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో పార్టీ ఓటమి తర్వాతి నుంచి.. సీఎం కేసీఆర్ పాలనపై ఇంట్రస్ట్​ చూపడం లేదని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతకుముందు కేసీఆర్​ ప్రతి అంశంపై సుదీర్ఘంగా సమీక్షలు చేసేవారని, ఒక్కోసారి అర్ధరాత్రి వరకు అవి జరిగేవని గుర్తు చేస్తున్నారు. కరోనా టైంలోనూ మొదట్లో గంటలు గంటలు రివ్యూలు చేసి ప్రెస్​మీట్లు పెట్టిన సందర్బాలు ఉన్నాయి. తర్వాత ధరణి పోర్టల్ ఏర్పాటు టైంలో కూడా వరుస రివ్యూలు పెట్టి ఆఫీసర్లకు డైరెక్షన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు చాలా వరకు సీఎస్ సోమేశ్ కుమార్ రివ్యూలు నిర్వహించి సీఎంకు రిపోర్టులు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి 

ఈశ్వరీబాయి జీవిత ప్రస్థానం యువతకు స్ఫూర్తి

చేయని తప్పుకు కుల బహిష్కరణ.. సెల్ఫీ వీడియో తీసి యువకుడు సూసైడ్

భార్యకు శీలపరీక్ష…మరుగుతున్న నూనెలో