- రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు
- ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు నియామకాలపై ఎంక్వైరీ
- సర్వీసు ముగిసినా ఎందుకు నియమించాల్సి వచ్చిందనే దానిపై ఆరా
- జీవోలు ముందు పెట్టి 2 గంటల పాటు విచారణ.. స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మాజీ సీఎం కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని గురువారం సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని ఏసీపీ ఆఫీస్‌లో జాయింట్ సీపీ ఆధ్వర్యంలో సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఓఎస్డీలుగా పని చేసిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నియామకంపై ఆరా తీశారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న టైమ్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నియామకాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు మొత్తం రాజశేఖర్ రెడ్డి చూసుకునేవారని సిట్ అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రాజశేఖర్ రెడ్డిని విచారిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఎస్డీల నియామకాలకు సంబంధించిన జీవోలు, గైడ్‌లైన్స్ వివరాలతో రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఐజీ స్థాయి లేదా ఆపై అధికారికి మాత్రమే అధికారం ఉంటుంది. కానీ, పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియమించడానికి గల కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. ప్రభాకర్ రావును ఓఎస్డీ నియమించేందుకు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారనే వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే సేకరించిన పలు జీవో నంబర్ల ఆధారంగా రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ సిట్ అధికారులు రికార్డ్ చేశారు.
అదనంగా మూడేండ్లు పని చేసిన రాధాకిషన్ రావు
ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియమించడంతో పాటు రాధాకిషన్ రావు రిటైర్మెంట్ తర్వాత కూడా 2020, ఆగస్టులో ఓఎస్‌డీగా నియమించారు. దీంతో 2023, ఆగస్టు వరకు అదనంగా మూడేండ్ల పాటు రాధాకిషన్ రావు సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా కొనసాగారు. ఈ మేరకు ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు. వీరిద్ద రినీ ఓఎస్డీలుగా నియమించడానికి ప్రత్యేక అవసరాలు ఏమున్నాయనే కోణంలో రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఓఎస్డీ హోదాలో ప్రభాకర్ రావును గత ప్రభుత్వ హయాంలో ‘ఫోన్ లీగల్ ఇంటర్‌సెప్షన్‌కు డిజిగ్నేటెడ్ అథారిటీ’గా నియమించడంపై కూడా సిట్ వివరణ తీసుకున్నది. డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలోనూ కేవలం 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్లపై నిఘా పెట్టేందుకు అవకాశం ఉండేది. కానీ.. ఇందుకు విరుద్ధంగా ప్రభా కర్ రావు, ప్రణీత్‌రావుతో కూడిన ఎస్‌వోటీ ఇష్టం వచ్చినట్లు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది. రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్ ఆధారంగా మరో ముగ్గురిని విచారించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
