కళ్యాణలక్ష్మికి రూ.వెయ్యి కోట్లు బాకీ పెట్టిన కేసీఆర్

కళ్యాణలక్ష్మికి రూ.వెయ్యి కోట్లు బాకీ పెట్టిన కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని తేలిపోయింది. కేసీఆర్ ​చేసిన ఆరోపణల్లో ఒక్క నిజం కూడా లేదని, ఆ పథకాలన్నింటినీ బీఆర్ఎస్​ హయాంలోనే పెండింగ్​లో పెట్టినట్టు వెల్లడైంది. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి  గతేడాది జనవరి నుంచి కాంగ్రెస్​ అధికారం చేపట్టే డిసెంబర్​ 7వ తేదీ నాటికి లక్షపైనే అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నట్టు అధికారులు నివేదించారు. వీటికి సంబంధించి ఏకంగా రూ.1000 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. 

ఎన్నికల కోడ్​ లోపే రిలీజ్​ చేసేందుకు నిధులు కేటాయించాలని గత ప్రభుత్వాన్ని సెప్టెంబర్​లోనే కోరినా.. పైసా ఇవ్వలేదని తెలిపారు. దీంతో మరిన్ని అప్లికేషన్లు పేరుకుపోయాయని పేర్కొన్నారు. ఎమ్మార్వో స్థాయి వెరిఫికేషన్​లో దాదాపు 30 వేలు ఉండగా, ఆర్డీవో స్థాయిలో మరో 55 వేల అప్లికేషన్లు ఉన్నాయి. ట్రెజరరీలో బిల్లులు సాంక్షన్​ కాకుండా 20 వేల పైనే ఉన్నట్టు అధికారులు తెలిపారు. కల్యాణలక్ష్మికి సంబంధించి బడ్జెట్​లో పెటుకున్న మేరకు ఆర్థిక శాఖ ప్రతి ఏటా మొదటి నెలలో బీఆర్వోలను ఇస్తోంది. అయితే, ఆ మేరకు నిధుల సర్దుబాటు మాత్రం చేయలేదని పేర్కొన్నారు. 

2023–24 కు సంబంధించి కల్యాణ లక్ష్మి పథకానికి రూ.3,210 కోట్లు కేటాయింపులు చేశారు. నిధులు నెలానెలా కొంత మొత్తం చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ స్థాయిలో ఇవ్వలేదు. ఫలితంగా ఒక్క అప్లికేషన్​కు  ఏడాది దాటితే కానీ చెక్కులు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని  అధికారులు రిపోర్ట్​లో వివరించారు.