కేసీఆర్ విధానాలే తెలంగాణకు శ్రీరామరక్ష : పద్మారావు గౌడ్

కేసీఆర్ విధానాలే తెలంగాణకు శ్రీరామరక్ష :  పద్మారావు గౌడ్

 సికింద్రాబాద్, వెలుగు: కేసీఆర్ విధానాలే తెలంగాణకు శ్రీరామ రక్ష అని  సికింద్రాబాద్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెట్టుగూడ డివిజన్ పరిధి లంబాడీ బస్తీ, విజయపురి కాలనీ, వైట్​హౌస్, రైల్వే కాలనీ, ఆయిల్ డిపో ఏరియాల్లో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెగ్మెంట్​లో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి జనం లబ్ధిపొందారన్నారు. సికింద్రాబాద్​లో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా సాగుతున్నాయన్నారు. ఆయన వెంట మెట్టుగూడ కార్పొరేటర్ సునీత, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. 

రైల్వే కార్మికులతో సమావేశం

రైల్వే కార్మిక సంఘాల్లో ఒకటైన సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ కేంద్ర ఆఫీసును పద్మారావు గౌడ్ సందర్శించారు. యూనియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, జాతీయ రైల్వే కార్మికుల ఫెడరేషన్ నేత సీహెచ్ శంకర్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. రైల్వే కార్మికులకు అనుకూలంగా తమ విధానాలు ఉన్నందున ఎన్నికల్లో తమకే మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.  రైల్వే సిబ్బందికి తామే అండగా నిలుస్తున్నామని తెలిపారు.  ఎన్నికల్లో తమకే మద్దతు తెలపాలన్న  పద్మారావు గౌడ్ అభ్యర్ధనకు కార్మిక సంఘం నేత శంకర్ రావుతో పాటు యూనియన్ నేతలు సానుకూలంగా స్పందించారు.