
కరీంనగర్ గులాబీమయమైంది. నగరంమంతా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ బ్యానర్లతో నిండిపోయింది. తన సెంటిమెంట్ ను ఫాలో అవుతూ లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు గులాబీబాస్, సీఎం కేసీఆర్. కాసేపట్లో ఆయన కరీంనగర్ చేరుకోనున్నారు. కేసీఆర్ తో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ వినోద్ ఇతర ముఖ్యనేతలు సభకు హాజరుకానున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. సార్.. కారు.. సర్కార్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తొలి బహిరంగ సభ కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండున్నర లక్షల మంది సభకు వస్తారనే అంచనాతో స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలోని 30 ఎకరాలు సభకు సిద్ధం చేశారు. సభావేదికతో పాటు.. ముఖ్యనేతలు, జనం కూర్చునేందుకు వీలుగా.. గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వాహనాల కోసం.. లోయర్ మానేర్ డ్యాం ఖాళీ స్థలం, ఎల్ఎండీ, మహాలక్ష్మి ఆలయం, సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పోలీసులు. టూవీలర్స్ కోసం కొండా సత్యలక్ష్మి గార్డెన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజ్, హోండా షోరూం దగ్గర ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.