చిన్ననాటి నుంచే తెలంగాణ రావాలని జయశంకర్ ఆకాంక్ష

చిన్ననాటి నుంచే తెలంగాణ రావాలని జయశంకర్ ఆకాంక్ష
  • హోం మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్: చిన్నతనం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించిన వ్యక్తి జయశంకర్ సార్ అని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణపై అనేక అంశాల్లో సీఎం కేసీఆర్ కు ప్రొఫెసర్ జయశంకర్ సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు అవగాహన కల్పించిన వ్యక్తి అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో  జయశంకర్ సార్ జయంతిని నిర్వహించారు.

ఈ సందర్భంగా జయశంకర్  విగ్రహానికి హోం మంత్రి మహమూద్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, లక్ష్మారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, గజ్జెల నగేష్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు నాయకులు.

ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషిని అందరూ గుర్తించేలా జయశంకర్  పేరిట సీఎం కేసీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారని తెలిపారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అన్నారు.
తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కోసం చివరి క్షణం వరకు పోరాడిన వ్యక్తి జయశంకర్ అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణలో నక్సల్స్ పేరిట అనేక మందిని గతంలో చంపిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని నీళ్లు, నిధులు, నియామకాలపైన గళమెత్తారని వినోద్ కుమార్ తెలిపారు. జయశంకర్ కేసీఆర్ తో కలిసి రాష్ట్రం కోసం పోరాడారని, ఉద్యమకారుల పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడంతో తెలంగాణ సిద్దించిందని వినోద్ కుమార్ వివరించారు.