
- అందుకే 75 ఏండ్లయినా దేశం ముందుకుపోతలె
- కాంగ్రెసోళ్లు ధరణిని తీసేసి ‘భూమాత’ తెస్తరట
- బీజేపీకి మత పిచ్చి తప్ప ఇంకోటి లేదు
- మసీదులు తవ్వేటోడు సిపాయా? అని కామెంట్
- కరీంనగర్, గంగాధర, జమ్మికుంట, పరకాలలో బీఆర్ఎస్ సభలు
కరీంనగర్/హనుమకొండ/గంగాధర/పరకాల, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ఎలక్షన్లు వచ్చినయంటే ఆగమాగం, అడవడివి, అడ్డగోలు జమాబందీ, బద్నాంలు, లొల్లులు, హడావుడి పనులన్నీ జరుగుతుంటయ్. గాడిద, గుర్రం ఒక్కటై పని చేస్తుంటయ్. గెలవడానికి ఫాల్త్ వాగ్దానాలు ఇస్తుంటరు. అనేక దుర్మార్గపు పనులు చేస్తుంటరు.
అమెరికాలో మనలాగా సభలు పెట్టరు. టీవీల ద్వారా మెసేజ్ ఇస్తరు. పార్టీల పాలసీల మీదే ఓటింగ్ జరుగుతది. అలాంటి పరిణతి రాకపోతే దేశం ముందుకుపోదు” అని చెప్పారు. రాయేదో రత్నమేదో ప్రజలు తేల్చాలని, అదే ప్రజాస్వామ్యానికి మంచిదని తెలిపారు. శుక్రవారం కరీంనగర్ సిటీ, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, హనుమకొండ జిల్లాలోని పరకాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడారు.
ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది?
కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తామంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు. దాని స్థానంలో భూమాత తెస్తమని చెప్తున్నరు. ఒకవేళ ధరణి బంద్ అయితే రైతుబంధు, రైతుబీమా ఎట్లొస్తయ్? మళ్లీ ఆఫీసర్లు పహానీ నకలు తేపో, అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం తీసుకురా అంటరు. వీటి కోసం కమీషన్లు అడుగుతరు. అప్పుడు రైతుల పరిస్థితి వైకుంఠపాళీలో పెద్దపాము మింగినట్లయితది’’ అని అన్నారు.
‘‘రైతుబంధు ఇచ్చి కేసీఆర్ పైసలు వేస్ట్ చేస్తున్నడని కాంగ్రెసోళ్లు అంటున్నరు. 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటలు సరిపోతదని చెబుతున్నరు. మరి రైతుబంధు ఉండాల్నా? వద్దా? మూడు గంటల కరెంట్ సరిపోతుందా?” అని ప్రశ్నించారు. కత్తి ఒకని చేతిలో పెట్టి, యుద్ధం ఇంకొకరిని చెయ్యమంటే సాధ్యమైతదా? అని అడిగారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం..
తెలంగాణ ఏర్పాటు, ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ చెప్పారు. ‘‘కాంగ్రెస్ దోఖాబాజీ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు ఏడిపించింది. 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని పిట్టల్లా కాల్చేసింది. 2004లో తెలంగాణ ఇస్తమని చెప్పి మళ్లీ మోసం చేసింది. చివరికి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నేను ఆమరణ దీక్షకు పోతే.. మీరంతా ఉప్పెనలాగా లేస్తే అప్పుడు దిగొచ్చింది. చాలామంది పిల్లలు చచ్చిపోయాక తెలంగాణ ఇచ్చింది” అని అన్నారు.
తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకుపోతున్నామని చెప్పారు. కడుపు, నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం కాబట్టే ఇయ్యాల ఈ స్థాయికి వచ్చామన్నారు. సభల్లో కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్, చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్, హుజూరాబాద్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి, పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలు ఇయ్యనోళ్లకు ఓటెందుకు వెయ్యాలె?
మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘50 ఏండ్ల కాంగ్రెస్ జమానాలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. మోదీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టుకుంటున్నాం. ప్రతి ఏడాది 10 వేల మంది డాక్టర్లను ఇచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగింది” అని చెప్పారు. జిల్లాకో నవోదయ పాఠశాల పెట్టాలని చట్టంలో ఉన్నప్పటికీ, దాన్ని మోదీ ఉల్లంఘించారని మండిపడ్డారు. వందలాది సార్లు అడిగినా కూడా నవోదయ పాఠశాలలు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
పైగా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ బెదిరించిండని, సచ్చినా సరే పెట్టనని తాను చెప్పానని పేర్కొన్నారు. బీజేపీకి మతపిచ్చి తప్ప ఇంకోటి లేదని ఆరోపించారు. ‘‘ఎంపీ వినోద్ ఉన్నప్పుడు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీలో పెట్టించారు. ఇప్పుడు స్మార్ట్ లేదు.. నా బోట్ లేదు.. వట్టిదే బొబ్బ.. మసీదులు తవ్వుదామా.. గుళ్లు తవ్వుదామా.. మసీదులు తవ్వేటోడు సిపాయా? ఈ దేశంలో మసీదులు తవ్వడం సంస్కారం ఉన్నోడు చేసే పనేనా? ఇది రాజకీయమా’’ అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు.