మోదీ చేసిన అప్పు.. 105 లక్షల కోట్లు: కేసీఆర్

మోదీ చేసిన అప్పు.. 105 లక్షల కోట్లు: కేసీఆర్

 

  • పదేండ్లలో ప్రధాని ఘనకార్యమిది: కేసీఆర్ 
  • బీజేపీ ఎజెండాలో పేదలే ఉండరు 
  • కాంగ్రెస్ వన్నీ అబద్ధపు హామీలు 
  • ఫ్రీ బస్ వద్దని మహిళలే అంటున్నరని కామెంట్  
  • కరీంనగర్​లో బీఆర్ఎస్ చీఫ్ రోడ్ షో

కరీంనగర్, వెలుగు: గత ప్రధానులు అంతా కలిసి రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ఒక్కరే రూ.105 లక్షల కోట్ల అప్పు చేశారని కేసీఆర్ అన్నారు. పదేండ్లలో ప్రధాని చేసిన ఘనకార్యమిది అని ఆయన విమర్శించారు. దేశంలోకి దిగుమతులు పెరిగిపోయి, ఎగుమతులు నిలిచిపోయాయని చెప్పారు. ‘‘పదేండ్ల మోదీ పాలనలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు.. ఇలా ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు. చట్ట ప్రకారం జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలి. రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలని మోదీని అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు. పోయినసారి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే నాలుగు రూపాయల పనైనా జరిగిందా?” అని ప్రశ్నించారు. గురువారం రాత్రి కరీంనగర్ ఇందిరాచౌక్ లో నిర్వహించిన రోడ్డు షోకు కేసీఆర్ హాజరయ్యారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీకి మత విద్వేషాలు రెచ్చగొట్టుడు తప్పా.. మరొకటి రాదని అన్నారు. ‘‘పదేండ్ల కింద 150 హామీలు ఇచ్చి ప్రధానిగా అధికారం చేపట్టిన మోదీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బీజేపీ ఎజెండాలో నిరుపేదల మాటే ఉండదు. కార్పొరేట్లకు మాత్రం 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారు. బీజేపీ పాలనలో సబ్ కా సాథ్​.. సబ్ కా వికాస్ కాలేదు గానీ సబ్ కా సత్తెనాశ్.. దేశ్ కా సత్తెనాశ్ మాత్రం అయింది. అచ్ఛేదిన్ రాలేదు గానీ సచ్చేదిన్ వచ్చాయి. వికసిత్ భారత్ కాలేదు గానీ విఫల భారత్ అయింది” అని అన్నారు.  

కాంగ్రెస్ ఇచ్చిన హామీలేమైనయ్?  

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ నోటికొచ్చిన హామీలు ఇచ్చిందని, మరి వాటి అమలు సంగతేంటని ప్రశ్నించారు. ‘‘మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.  కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వలేదు. రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే బస్సుల్లో వాళ్లు సీట్ల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నరు. మహిళలే తమకు ఫ్రీ బస్సు అవసరం లేదంటున్నారు. సాగునీరు, కరెంట్, తాగునీరు లేక నాలుగైదు నెలల్లోనే తెలంగాణ ఆగమాగం అయింది” అని అన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ , బీజేపీ మధ్యే పోటీ ఉందని.. ఒకవేళ ముస్లింలు కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుందని అన్నారు. 

బండి సంజయ్​కి వాగుడు తప్ప.. ఏమీ రాదు 

బండి సంజయ్ ఎంతసేపు లొడలొడ మాట్లాడుడు, మతం పిచ్చి వాగుడు తప్పా.. ఆయనతో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘బండి సంజయ్ తో పైసా పనైందా.. ఒక్కనాడైనా పార్లమెంట్ లో మాట్లాడిండా. అసలు ఆయనకు మాట్లాడొస్తదా.. ఆయన గట్టిగా మాట్లాడితే అది హిందో.. ఇంగ్లీషో తెలియక మనమే చావాలి. మనకే అర్థం కాకపోతే పార్లమెంట్ వాళ్లకు అర్థమైతదా?” అని విమర్శించారు. ‘‘విదేశాల నుంచి బ్లాక్ మనీ తెచ్చి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున అకౌంట్ లో వేస్తామని పదేండ్ల కింద మోదీ చెప్పారు. మీ కరీంనగర్ వాళ్లకు రూ.30 లక్షలు వచ్చాయట కదా.. బండి సంజయ్ తెచ్చి ఇచ్చిండట కదా..” అని ఎద్దేవా చేశారు. ‘‘బీజేపీ వాళ్లు మాట్లాడితే పాకిస్తాన్ అంటరు. పాకిస్తాన్ చిన్న దేశం. వాడిని ఒక్కటి జాపి అటు కొడితే 25 ఏళ్లు మన తెరువుకు రాడు. వాడిని చూపించి ఓ డ్రామా కొట్టి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి మనల్ని ఫూల్స్ చేస్తున్నరు” అని కేసీఆర్​ అన్నారు.